తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Toys: పిల్లలకు ఏ వయసులో ఎలాంటి బొమ్మలు కొనివ్వాలి? తెలివితేటలు పెంచే బొమ్మలివే

Toys: పిల్లలకు ఏ వయసులో ఎలాంటి బొమ్మలు కొనివ్వాలి? తెలివితేటలు పెంచే బొమ్మలివే

20 September 2024, 12:30 IST

google News
  • Toys: పిల్లల వయసు ఆధారంగా వాళ్లకి బొమ్మలు కొనాలి. దీంతో అవి వాళ్ల మానసిక శారీరక ఎదుగుదలకు సాయపడతాయి. ముఖ్యంగా నెలల వయసున్న పిల్లలకు ఏ నెలలో ఎలాంటి బొమ్మలు కొనాలో చూడండి.

పిల్లల వయసు బట్టి ఎలాంటి బొమ్మలు కొనాలి?
పిల్లల వయసు బట్టి ఎలాంటి బొమ్మలు కొనాలి? (freepik)

పిల్లల వయసు బట్టి ఎలాంటి బొమ్మలు కొనాలి?

పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఏ బొమ్మలు కొనాలా అనే ఆలోచన మొదలవుతుంది. అలాగని వాళ్ల వయసుకు మించిన బొమ్మలు కొన్నా ప్రయోజనం లేదు. పిల్లలు ఏ వయసులో ఉన్నప్పుడు ఎలాంటి బొమ్మలు కొనాలనే అవగాహన ఉంటే అది వాళ్ల ఎదుగుదలకు దోహదం చేస్తుంది. వాళ్ల వయసుకు తగ్గట్లు ఏ బొమ్మలు కొంటే మంచిదో చూసేయండి.

మొదటి రెండు నెలలు (0-2):

ఈ సమయం చాలా కీలకం. పిల్లలు ఈ సమయంలోనే అన్ని రకాల భావోద్వేగాల గురించి తెల్సుకోవడం మొదలుపెడతారు. కాస్త నవ్వడమూ మొదలుపెడతారు. ఈ సమయంలో బొమ్మలు ఇవ్వడం కన్నా వాళ్లతో ఎక్కువగా మాట్లాడటం, నవ్వటం, వాళ్లను హత్తుకోవడం, పాటలు పాడటం లాంటివి చేయాలి.

రెండు నుంచి మూడు నెలలు (2-3):

ఈ సమయంలో వాళ్ల చేతులను వాళ్లు గుర్తించడం మొదలు పెడతారు. వస్తువుల్ని పట్టుకోవడం, ఊపడం చేస్తారు. బొమ్మలు ఇవ్వడం ఇప్పుడే మొదలు పెట్టాలి. తక్కువ బరువుతో మృదువుగా, మెత్తగా, చిన్నగా ఉండే బొమ్మలు ఎంచుకోవాలి. మెత్తగా ఉండి నొక్కితే శబ్దం చేసే బొమ్మలు, శబ్దాలు చేసే గిలకలు మంచి ఎంపిక.

నాలుగు నుంచి ఆరు నెలలు(4-7):

ఈ సమయంలో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కొత్త ఆకారాలు, దృశ్యాలు, శబ్దాలు అర్థం చేసుకుంటారు. అలాగే ఏ వస్తువునైనా నోట్లో పెట్టుకోడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి నాణ్యత ఉన్న బొమ్మలు ఎంచుకోవాలి. బొమ్మలకు చిన్న చిన్న బటన్లు లాంటివి ఉండొద్దు. అవి నోట్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. శబ్దం చేస్తూ కదిలే బొమ్మలు, మెత్తటి బాల్, బొమ్మలు, ప్లే జిమ్ మ్యాట్, వాళ్ల శబ్దాలకు స్పందించే బొమ్మలు కొనొచ్చు. అలాగే ఈ సమయంలోనే బోర్లా పడతారు కాబట్టి శబ్దం చేస్తూ కదిలే బొమ్మలుంటే వాటిని పట్టుకోడానికి ప్రయత్నిస్తారు. వాటికోసం ముందుకు కదిలే ప్రయత్నం చేస్తారు.

ఎనిమిది నుంచి పన్నెండు(8-12):

ఈ సమయంలో పిల్లలు చాలా విషయాలు నేర్చుకుంటారు. పాకడం నేర్చుకుంటారు. ఏదైనా ఆసరాగా పట్టుకుని నిలబడటం నేర్చుకుంటారు. నడవటం నేరుస్తారు. కొన్ని విషయాలకు ప్రతిస్పందనగా ఏడుస్తారు. ఇబ్బంది అనిపిస్తే దానికి పరిష్కారం వచ్చేదాకా ఏడుస్తారు. ఉదాహరణకు ఏదైనా బొమ్మ దూరంగా వెళ్లిపోతే వాళ్ల చేతికి ఇచ్చేదాకా ఏడవడం అన్నమాట. ఈ వయసులో యాక్టివిటీ టేబుళ్లు, లాక్కుంటూ ఆడుకునే బొమ్మలు, వెనకకు ముందుకు కదిలే కార్లు, చక్రాలున్న బొమ్మలు, ఆకారాన్ని బట్టి పేర్చే బొమ్మలు, పెద్దలు ఆడించే తోలు బొమ్మల్లాంటివన్నీ ఇష్టపడతారు. అలాగే వాళ్ల తెలివిని పెంచే బోర్డ్ బుక్స్, ఫ్యాబ్రిక్ బుక్స్ ఎంచుకోవచ్చు.

జాగ్రత్తలు:

ఏ వయసు అయినా సరే ఎలాంటి ప్రమాదం లేని బొమ్మలు ఎంచుకోవాలి. పదునుగా, చిన్న చిన్న బటన్లు, వస్తువులన్న బొమ్మలు ఎంచుకోవద్దు. నోట్లో పెట్టుకున్నా ప్రమాదం లేనివి, ఎలక్ట్రికల్ కానివి, గ్లాసు లేదా పగిలే మెటల్ కానివి ఎంచుకోవాలి.

తదుపరి వ్యాసం