Missing Day | వారిని ఇంకా మరిచిపోలేకపోతున్నారా? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి!
20 February 2023, 8:35 IST
- Missing Day: మన మనసుకు బాగా దగ్గరైన వ్యక్తులు, ఒక్కసారిగా దూరం అయితే తట్టుకోలేనంత బాధగా ఉంటుంది. వారు లేని జీవితం వృధా అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ, ఇవన్నీ తాత్కాలికమైన భావోద్వేగాలే. ఇలాంటపుడు ఏం చేయాలో తెలుసుకోండి.
Missing Day
Missing Day: మనం ఒక వ్యక్తిని చాలా ఇష్టపడి, కొన్నాళ్ల పాటు వారితో కలిసి ప్రయాణం చేసినపుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. వారితో పంచుకునే ఒక్కో క్షణం ఒక్కో మధుర జ్ఞాపకంగా అనిపిస్తుంది. నిద్రపోయే ముందు వారి ఆలోచనలే, నిద్రలేచాక వారి ఆలోచనలే. ఇలా వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటే, వారి సావాసాన్ని ఆస్వాదిస్తుంటే, వారు మన జీవితంలో ఎప్పటికీ ఉండిపోవాలని కోరుకుంటాం. వారు మనతో పంచుకునే విషయాలు, మన ఆనందం కోసం చేసే చిన్నచిన్న పనులు వారిని మన మనసుకు మరింత దగ్గరకు చేస్తాయి.
కానీ, కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదు. ఒకానొక రోజు వారితో మీరు ఊహించుకున్న ఊహలు తలకిందులు అవ్వొచ్చు, ఆ సమయంలో జీవితం ఒక్కసారిగా రివర్స్ గేర్ వేసినట్లు ఉంటుంది. మనసుకు భరించలేని గాయం కావచ్చు. ఒక్కసారి వారు మన జీవితంలో నుంచి దూరం అయ్యాక మనసుకు చాలా కఠినంగా అనిపిస్తుంది. నిన్న, మొన్నటి వరకు మన అనుకున్న వారు మనకు, మన జీవితానికి ఏ మాత్రం సంబంధంలేని వారిగా వ్యవహరిస్తే, మనం మధురమైన జ్ఞాపకాలు అనుకున్నవి మదిని తొలిచేస్తాయి. నిన్నటి నవ్వులు నేడు వెక్కిరిస్తాయి. ప్రతిరోజూ నరకంలా అనిపిస్తుంది.
చాలా మంది తమ జీవితంలో ఇలాంటి ఒక దశను ఎదుర్కొని ఉంటారు. ఈ సమయంలో భావోద్వేగాలు మన నియంత్రణలో లేకపోతే అది ఎంతటి పరిణామాలకైనా దారితీస్తుంది.
Broken Heart Healing Tips - కోల్పోయిన వారిని మిస్ అవుతుంటే ఇలా చేయండి
మీరూ ఎవరినైనా చాలా మిస్ అవుతున్నారా? ఇలాంటి సమయాల్లో ఏం చేయాలో నిపుణులు అందించిన సూచనలు చూడండి.
- ఒక రోజు, కాలపరిమితిని విధించుకోండి. ఆ వ్యక్తితో మీకు ఉన్న చేదు తీపి జ్ఞాపకాలను నెమరువేసుకోండి. ఆ వ్యక్తి ఇక మీ జీవితంలోకి తిరిగి రాకపోవచ్చని అంగీకరించండి. వారి గురించి ఆలోచనలు తగవు అనే నిర్ణయానికి రండి. మీ క్షేమం కోసం ఏం చేయాలో దానిపై దృష్టిపెట్టండి.
- ఎన్నో గొడవలు జరిగి చివరకు విడిపోయిన తర్వాత, మీరు మీ మాజీ ప్రియులను లేదా భాగస్వామిని కలవడం గానీ, చూసే ప్రయత్నాలు గానీ చేయకూడదు. వారిని మళ్లీ కలిసే ప్రయత్నం చేయడం, స్నేహంగా మెదలాలనుకోవడం, మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోవడమే. కాబట్టి దూరంగా ఉండటమే మేలు. ఇది చాలా కష్టతరమైనదే కావొచ్చు, కానీ గడ్డుకాలాన్ని ఎదుర్కోవాలి.
- వారికి మెసేజ్ చేయడం గానీ, సోషల్ మీడియా ద్వారా మళ్లీ కనెక్ట్ అవడం గానీ, స్నేహితులతో కలిసి క్షేమ సమాచారం గురించి అడిగి తెలుసుకోవడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. వారిని ఏ విధంగానూ కాంటాక్ట్ చేయవద్దు. ఇది అంత తేలికైన పని కాదు కానీ వాస్తవంలో ఉండటం మంచిది.
- మైండ్‌ఫుల్‌నెస్‌ని ప్రాక్టీస్ చేయండి, ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టండి. ఈ క్షణం మీకు ఆనందాన్ని అందించే అందాన్ని ఆస్వాదించండి. మీరు ఇప్పుడు కలిగి ఉన్న వాటితో సంతృప్తిగా ఉండటం వలన, గతాన్ని అధిగమించడంలో మీకు సహాయపడుతుంది.
- ప్రతిరోజూ ఒక 15 నిమిషాలు యోగా, ధ్యానం సాధన చేయండి. అవి మీతో మిమ్మల్ని కనెక్ట్ చేసుకోవడానికి, మీ బలాన్ని గుర్తించడానికి ఒక మార్గాన్ని అందిస్తాయి.
- మిమ్మల్ని అర్థం చేసుకునే, మీకు భావోద్వేగ మద్దతును అందించగల వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి.
Missing Day - Anti Valentines Week
యాంటీ-వాలెంటైన్స్ వీక్ అనేది ప్రస్తుతం ప్రేమలో లేని వ్యక్తుల కోసం ఉద్దేశించిన వారం. ఇందులో ఫిబ్రవరి 20న మిస్సింగ్ డేగా జరుపుకుంటారు. ఒకరితో సంబంధం ముగిసిన తర్వాత లేదా వారితో విడిపోయిన తర్వాత అనుభూతి చెందే విభిన్న భావోద్వేగాలకు ఉపశమనం కల్పించడానికి ఈరోజు కేటాయించడమైనది. తమను తాము స్వస్థపరచుకోవడానికి, బలంగా ఎదగడానికి అవకాశం ఇచ్చుకోవడం చేయాలి. ఫిబ్రవరి 21న బ్రేకప్ డేతో యాంటీ-వాలెంటైన్స్ వీక్ ముగియనుంది.