Pulse Rate: ఒక వ్యక్తి పల్స్ రేట్ ఎంత ఉండాలి? తక్కువగా ఉంటే ఏమవుతుంది, పల్స్ రేట్ ఎక్కువైతే ఏ వ్యాధులు ఉన్నట్టు?
16 October 2024, 16:30 IST
- Pulse Rate: అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళగానే మొదటి చెక్ చేసేది పల్స్ రేటు. ఇది ఎంతో ముఖ్యమైనది. ఒక సాధారణ ఆరోగ్యకరమైన వ్యక్తికి పల్స్ రేట్ ఎంత ఉండాలో తెలుసుకోండి.
పల్స్ రేట్ ఎంత ఉంటే ఆరోగ్యం?
పల్స్ రేట్... మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని చెబుతుంది. అందుకే ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగానే మొదట చూసేది పల్స్ రేటే. వేలికి చిన్న పరికరాన్ని పెట్టి పల్స్ రేట్ ఎంతుందో చెక్ చేస్తారు. ఇది పెద్ద ఆరోగ్య సమస్య నుంచి అంతర్లీన ఆరోగ్య సమస్యల వరకు సూచిస్తుంది. మీ శరీరం ఎలా పనిచేస్తుందో పల్స్ రేటు కొలవడం ద్వారా తెలుసుకోవచ్చు. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి పల్స్ రేట్ ఎంత ఉండాలో తెలుసుకోండి.
ఆరోగ్యకరమైన పల్స్ రేట్ ఎంత ఉండాలి?
సాధారణంగా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి పల్స్ రేటు నిమిషానికి 60 నుంచి 100 బీట్ల వరకు ఉండవచ్చు. అథ్లెటిక్స్ అంటే క్రీడాకారులు పల్స్ రేట్ ఒక్కోసారి 60 బీట్లు కంటే తక్కువగా ఉంటుంది. ఇది సాధారణంగా ఆరోగ్యమనే చెబుతారు. ఇక వయసులవారీగా ఎంత పల్స్ రేట్ ఉండాలో తెలుసుకుందాం.
వయసును బట్టి ఉండాల్సిన పల్స్ రేట్
1.అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు పల్స్ రేటు ఒక నెల వయసు వరకు 70 నుంచి 190 బీట్ల మధ్య ఉంటుంది.
2. ఒక నెల నుంచి 11 నెలల వయసున్న శిశువుల పల్స్ రేటు 80 నుంచి 160 బీట్ల మధ్య ఉంటుంది.
3. ఏడాది వయసు నుంచి 10 ఏళ్ల వయసులోపు పిల్లలకు పల్స్ రేటు 70 నుంచి 120 బీట్ల వరకు ఉండవచ్చు.
4. ఇక 11 ఏళ్ల నుంచి 17 సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ రేటు 60 నుంచి 100 బీట్ల మధ్య ఉంటుంది.
5. పెద్దల్లో కూడా 60 నుంచి 100 బీట్ల మధ్య నిమిషానికి పల్స్ రేటు ఉంటుంది.
పల్స్ రేటును చెక్ చేయడానికి విశ్రాంతి తీసుకుంటున్న సమయమే ఉత్తమమైనది. మంచంపై పడుకుని విశ్రాంతిగా ఉన్నప్పుడు పల్స్ రేట్ చెక్ చేస్తే అది సరైన పల్స్ ను చూపిస్తుంది. వ్యక్తి ఆందోళనగా ఉన్నప్పుడు లేదా గాభరాలో ఉన్నప్పుడు, తీవ్రంగా వ్యాయామం చేసి వచ్చినప్పుడు వారి పల్స్ మారే అవకాశం ఉంది.
పల్స్ అంటే ఏమిటి?
పల్స్ రేటు అనేది హృదయ స్పందన రేటు. అంటే మీ గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో చెప్పే కొలమానం. ఇది ఇది మీ ఆరోగ్యం గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది.
పల్స్ రేటు ఎక్కువగా ఉంటే...
మీ పల్స్ రేటు 100 బీట్స్ కంటే ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు క్రీడాకారులు కాకపోయి ఉంటే మీ హృదయ స్పందన రేటు 60 బీట్ల కంటే తక్కువగా ఉన్నట్టయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే శిక్షణ పొందిన క్రీడాకారులకు మాత్రమే హృదయ స్పందన రేటు 60 కంటే తక్కువగా ఉంటుంది. వృద్ధాప్యం వల్ల కూడా కొంతమందిలో గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. అలాగే కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా గుండె కొట్టుకునే వేగం పెరగడం, తగ్గడం అనేవి ఉంటాయి.
మీ పల్స్ రేటు అసాధారణంగా ఉండడంతో పాటు ఛాతీ నొప్పి, గుండెలో దడ, శక్తి లేకపోవడం, కాంతిని చూడలేకపోవడం, జ్ఞాపకశక్తి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
పల్స్ రేటు ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది?
పల్స్ రేటు అంటే గుండె కొట్టుకునే వేగం ఎప్పుడు అధికంగా ఉంటుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు, తీవ్రమైన శారీరక శ్రమ చేసినప్పుడు, డీహైడ్రేషన్ బారిన పడినప్పుడు, హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు హృదయ స్పందన రేటు ఎక్కువగా ఉంటుంది. అలాగే జ్వరం, రక్తపోటు తగ్గిపోవడం లేదా రక్తపోటు పెరిగిపోవడం కొన్ని రకాల మందులు పడకపోవడం వంటి సమయాల్లో కూడా పల్స్ రేటు పెరిగే అవకాశం ఉంది. కెఫీన్ అధికంగా ఉండే పదార్థాలు తిన్నా కూడా గుండె కొట్టుకునే వేగం పెరిగిపోతుంది. రక్తంలో కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్ల మధ్య అసమతుల్యత ఏర్పడిన కూడా పల్స్ రేటు పెరిగే అవకాశం ఉంది.
పల్స్ రేటు ఎప్పుడు తక్కువగా ఉంటుంది?
వృద్ధాప్యం వల్ల గుండె సరిగా పనిచేయలేకపోయినప్పుడు పల్స్ రేటు తగ్గుతుంది. అలాగే గుండెకు సంబంధించిన లోపాలు ఉన్నా కూడా పల్స్ రేటు తగ్గిపోతుంది. లూపస్, రుమాటిక్ ఫీవర్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో కూడా పల్స్ రేటు తక్కువగా ఉంటుంది. గుండెకు శస్త్ర చికిత్సలు చేసిన వారిలో కూడా గుండె కొట్టుకునే వేగం తక్కువగా ఉంటుంది. క్యాల్షియం, పొటాషియం వంటివి రక్తంలో సమతుల్యంగా లేకపోయినా కూడా హృదయం కొట్టుకునే రేటు తగ్గిపోతుంది. కాబట్టి మీ పల్స్ రేటు అధికంగా ఉన్న లేదా తక్కువగా ఉన్న వైద్య సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
టాపిక్