తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Organs Donation: మరణం తర్వాత దానం చేయగల 9 అవయవాలు ఇవే

Organs Donation: మరణం తర్వాత దానం చేయగల 9 అవయవాలు ఇవే

09 September 2024, 8:00 IST

google News
  • Organs Donation: ఒక వ్యక్తి అవయవాలను దానం చేయడం వల్ల అనేక మంది జీవితాలను రక్షించవచ్చు. అవయవ దానం ప్రాముఖ్యతను, మరణించిన తర్వాత ఏ అవయవాలను దానం చేయవచ్చో వివరంగా తెల్సుకోండి.

అవయవ దానం
అవయవ దానం (pixabay)

అవయవ దానం

ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత పనికొచ్చే అవయవాలు అన్నింటినీ దానం ఇవ్వడం వల్ల సగటున ఏడెనిమిది మందికి పునర్జీవితాలను ప్రసాదించే అవకాశం ఉంటుంది. అయితే రకరకాల భయాలు, నమ్మకాల వల్ల చాలా మంది అవయవ దానం చేయడానికి భయపడుతుంటారు. కానీ కళ్ల దగ్గర నుంచి కాలేయం వరకు మనలో దానం చేయడానికి అనేక అవయవాలు ఉంటాయిట. వీటిలో మరీ ముఖ్యంగా 9 అవయవాలు దానం చేయడం వల్ల ఎదుటి వారికి జీవన దానం చేసినట్లే అవుతుంది.

అవయవ దానానికి ముఖ్యమైన వాటి జాబితా :

1. గుండె :

ఎవరి శరీరం అయినా బతికి ఉందంటే అది గుండె కొట్టుకోవడం వల్లే. ఇది రక్తాన్ని శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. హార్ట్‌ ఫెయిల్యూర్ అయిన వ్యక్తులకు దీన్ని మార్పిడి చేస్తే వారికి మళ్లీ కొత్త జీవితం వచ్చినట్లే.

2. క్లోమం :

రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రించడంలో క్లోమం పాత్ర కీలకం. అందుకనే ఎక్కువగా షుగర్‌ వ్యాధిగ్రస్తులకు దీని ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అవసరం ఉంటుంది.

3. ఊపిరితిత్తులు :

శ్వాసకోశ వ్యవస్థలో ముఖ్యమైన అవయవం ఊపిరితిత్తులు. ఇది ఆక్సిజన్‌ని లోపలికి తీసుకుని కార్బన్‌డయాక్సైడ్‌ని బయటకు పంపించివేస్తుంది. క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ (సీఓపీడీ) లాంటివి ఉన్న వారికి కొన్ని సార్లు ఆరోగ్యవంతమైన ఊపిరితిత్తుల్ని మార్పిడి చేస్తే వారు మరింత కాలం ఆనందంగా జీవిస్తారు.

4. కాలేయం :

జీవక్రియలో, శరీరంలో వ్యర్థాల్ని బటయకు పంపించివేయడంలో కాలేయం ప్రముఖంగా పని చేస్తూ ఉంటుంది. అయితే జబ్బుపడిన కాలేయం ఉన్న వారికి ఆరోగ్యవంతమైన కాలేయం కొంత భాగం దొరికినా సరిపోతుంది. ఇది మళ్లీ దాన్ని పునర్నిర్మించుకోగల లక్షణాన్ని కలిగి ఉంటుంది.

5. కిడ్నీలు :

మనలో ద్రవాల్ని ఫిల్టర్‌ చేసే కిడ్నీలు సరిగ్గా పని చేయకపోతే ఆ వ్యక్తికి చెప్పలేనంత ఇబ్బంది. అయితే కిడ్నీ మార్పిడి అనేది చాలా ఎక్కువగా జరిగే అవయవ మార్పిడి శస్త్ర చికిత్స. చనిపోయిన వారి నుంచి, బ్రతికే ఉన్న వాళ్లు కూడా సజీవ దానం చేయొచ్చు.

6. చిన్న పేగు :

కొంత మందికి చిన్న పేగు సరిగ్గా పని చేయక పోషకాలను శరీరం శోషించుకోలేని స్థితిలో ఉంటుంది. అలాంటి వారికి చిన్న పేగు మార్పిడి ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇస్తుంది.

7. పెద్ద పేగు :

నీటిని శోషించుకోవడంలో, మలాన్ని శరీరం నుంచి వేరు చేసి బయటకు పంపించడంలో పెద్ద పేగు పని చేస్తుంది. పెద్దపేగు క్యాన్సర్‌, ఇతర సమస్యలు ఉన్న వారికి ఇతరుల పెద్ద పేగును శస్త్ర చికిత్స ద్వారా ఏర్పాటు చేయవచ్చు.

8. కళ్లు :

అవయవ దానంలో ఎక్కువగా వినిపించేది కళ్ల గురించే. చనిపోయిన వారి కళ్లను దృష్టి లేని వారికి పెడితే వారికి ప్రపంచాన్ని చూసే అవకాశం కల్పించినట్లే.

9. కణజాలం, చర్మం :

కణజాలాలతో నిండిన చర్మం, ఎముకలు లాంటి వాటిని కూడా చనిపోయిన వారి నుంచి తీసి అవసరం అనుకున్న వారికి మార్చవచ్చు.

అవయవ దానానికి సిద్దమయ్యే వ్యక్తి ఇలా విభిన్న అవసరాలున్న ఎనిమిది నుంచి తొమ్మిది మంది వ్యక్తుల ప్రాణాల్ని కాపాడగలుగుతారు.

తదుపరి వ్యాసం