Sweating Benefits: చెమట పట్టడం లేదని ఆనందపడకండి, చెమట పడితేనే కిడ్నీలు రాళ్లు చేరవు-sweating reduces the risk of kidney stones many more benefits of sweating ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sweating Benefits: చెమట పట్టడం లేదని ఆనందపడకండి, చెమట పడితేనే కిడ్నీలు రాళ్లు చేరవు

Sweating Benefits: చెమట పట్టడం లేదని ఆనందపడకండి, చెమట పడితేనే కిడ్నీలు రాళ్లు చేరవు

Haritha Chappa HT Telugu
May 08, 2024 12:40 PM IST

Sweating Benefits: చెమట పడితే చాలా చికాకుగా అనిపిస్తుంది. చెమట పట్టకుండా ఉండాలని ఎంతో మంది కోరుకుంటారు. నిజానికి చెమట పట్టడం ఆరోగ్యానికి మేలే చేస్తుంది.

చెమట వల్ల ఉపయోగాలు
చెమట వల్ల ఉపయోగాలు (Pixabay)

Sweating Benefits: చెమట పెడితే ముఖానికి వేసిన మేకప్ పోతుందని బాధపడేవారు ఎంతోమంది. ఎక్కువమంది చెమట పట్టకూడదని కోరుకుంటారు. కొంతమందికి చెమట అధికంగా పట్టదు. నిజానికి శరీరానికి చెమటలు పట్టడం అనేది ఆరోగ్యానికి మేలే చేస్తుంది. చెమట పట్టడం అనేది శరీరాన్ని చల్లబరిచే ప్రక్రియలో ముఖ్యమైనది. చెమట చర్మంపై ఉన్న స్వేద గ్రంధుల ద్వారా బయటికి స్రవిస్తుంది. అలా శ్రమించడం ద్వారా లోపల శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వేడి ప్రాంతంలో నివసించే వారికి చెమట అధికంగా పట్టే అవకాశం ఉంది. చెమట ద్వారా ద్రవాలన్నీ బయటికి పోతాయి. కనుక వారు ఎక్కువగా నీరు త్రాగుతూ ఉండాలి.

చెమట వల్లే చర్మానికి మెరుపు

వ్యాయామం చేసినప్పుడు శరీరం నిండా రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది. ఇది చర్మం లోపల నుండి ఆరోగ్యకరమైన మెరుపును అందిస్తుంది. వ్యాయామం చేసేటప్పుడు చెమట విపరీతంగా పడుతుంది. ఇలా చెమట పట్టడం వల్ల మీ చర్మానికి మెరుపు సంతరించుకుంటుంది. ఆరోగ్యకరమైన రక్త ప్రవాహం చర్మ కణాలకు ఆక్సిజన్, పోషకాలను అందించడం వంటివి చేస్తుంది. రక్త ప్రవాహం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం వంటివి చేయాలి. వ్యాయామం చేసేటప్పుడు చెమట పట్టడం సహజం.

ఏదైనా పని చేస్తున్నప్పుడు చెమట పడుతోంది... అంటే అర్థం మీ గుండెకు అంతా మేలే జరుగుతోందని. ఎక్కువ చెమట పట్టే వారు ఎక్కువగా పని చేస్తున్నారని అర్థం. మీ శరీరాన్ని శుభ్రపరిచి అత్యంత ప్రభావంవంతమైన మార్గాల్లో చెమట పట్టడం ఒకటి. చెమట శరీరంలో ఉన్న అధిక ఉప్పును కొలెస్ట్రాల్‌ను తొలగించడానికి సహాయపడుతుంది. చెమట రంధ్రాల ద్వారా వ్యర్ధాలు, విషాలు బయటికి వచ్చేస్తాయి. కాబట్టి మొటిమలు, ఇతర చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి.

కిడ్నీలో రాళ్లు ఏర్పడవు

చెమట అధికంగా పట్టే వారిలో కిడ్నీలో రాళ్ల సమస్య వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. చెమట పట్టడం వల్ల అదనపు ఉప్పును బయటకు పంపించేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి కారణం మూత్రంలో ఉప్పు, కాల్షియం వంటివి పేరుకుపోవడమే. ఎప్పుడైతే చెమట ఉప్పును బయటికి పంపించేస్తుందో ,కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా తగ్గుతుంది.

చెమట పట్టడం వల్ల హానికరమైన అంటువ్యాధులు, క్రిములు వంటివి శరీరంలో చేరకుండా ఉంటాయి. చెమటలో యాంటీ మైక్రోబయల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాను శరీరంలో చేరకుండా బయటికి పంపిస్తూ ఉంటాయి. కాబట్టి చెమట పడుతుందని బాధపడవద్దు. రోజులో ఎంతో కొంత సేపు చెమట పట్టడం శరీరానికి అన్ని విధాలా మంచిది.

టాపిక్