Prevent Dengue। డెంగ్యూను నివారించడానికి సమర్థవంతమైన మార్గాలివిగో!
16 August 2023, 12:15 IST
- Ways to Prevent Dengue: డెంగ్యూను నివారించడానికి కచ్చితమైన చికిత్స లేనప్పటికీ, తగిన జీవనశైలి మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రోగనిరోధక శక్తిని పెంచడం, దోమ కాటుకు గురికాకుండా జాగ్రత్తపడడం వంటి చర్యలను ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Ways to Prevent Dengue
Ways to Prevent Dengue: దేశంలోని అనేక ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. డెంగ్యూ జ్వరం అనేది ఈడిస్ దోమలు కుట్టడం ద్వారా మానవులకు వ్యాపించే ఒక వైరల్ వ్యాధి. ఈ వ్యాధి తీవ్రత స్వల్పంగా ఉన్నప్పుడు అధిక జ్వరం, శరీర నొప్పి, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు, వికారం వంటి వాటికి కారణమవుతుంది. వ్యాధి తీవ్రమైన దశలో ముక్కు లేదా చిగుళ్ళ నుండి రక్తస్రావం, తక్కువ రక్తపోటు, ప్లేట్ లెట్లు పడిపోవడం, గందరగోళం వంటి లక్షణాలు ఉంటాయి. డెంగ్యూను నివారించడానికి కచ్చితమైన చికిత్స లేనప్పటికీ, తగిన జీవనశైలి మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రోగనిరోధక శక్తిని పెంచడం, దోమ కాటుకు గురికాకుండా జాగ్రత్తపడడం వంటి చర్యలను ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
డెంగ్యూ ఎవరికి ప్రమాదకరం?
డయాబెటిస్ మెల్లిటస్, గుండె జబ్బులు, కాలేయ వ్యాధులు, మూత్రపిండ వ్యాధులు, క్యాన్సర్‌లు, స్టెరాయిడ్స్ వాడకం, హెచ్‌ఐవి/ఎయిడ్స్ మొదలైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, డెంగ్యూ ఇన్ఫెక్షన్ కు గురైతే వారి ఆరోగ్య పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉంటుందని వైద్యులు అంటున్నారు. కాబట్టి డెంగ్యూ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలను తగ్గించడం, తీవ్రమైన ఇన్ఫెక్షన్ల ముప్పును తగ్గించే దానిపై దృష్టి పెట్టాలి అని వైద్యులు అంటున్నారు.
గ్రేటర్ నోయిడాలోని మెట్రో హాస్పిటల్స్ నుంచి డా. సాయిబల్ చక్రవర్తి మాట్లాడుతూ డెంగ్యూను నివారించడంలో సహాయపడే కొన్ని మార్గాలను వివరించారు, అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
దోమల నుండి రక్షణ
దోమలు కుట్టకుండా పొడవాటి చేతులు కల దుస్తులు, మోకాళ్ల వరకు ప్యాంటు ధరించండి. దోమలు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండటానికి కిటికీలు, తలుపులు మూసివేయండి. వీలైనంత వరకు దోమ కాటును నివారించడానికి చర్యలు తీసుకోండి, నిద్రపోయేటప్పుడు దోమతెరలను ఉపయోగించండి. ఆరుబయట ఉన్నప్పుడు దోమల ఆకర్షణను తగ్గించడానికి మీ శరీరాన్ని కప్పి ఉంచే లేత రంగు దుస్తులను ధరించండి.
దోమలు పెరిగే ప్రదేశాలపై శ్రద్ధ వహించండి:
పూల కుండలు, నీటితో నిండిన టైర్లు, ఓపెన్ ప్లాస్టిక్ సీసాలు, నీరు నిలిచిపోయే ప్రదేశాలు దోమల సంతానోత్పత్తి ప్రదేశాలు. కాబట్టి పరిసరాల పరిశుభ్రతపై శ్రద్ధ వహించండి.
పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పరచండి:
దోమల వృద్ధిని నివారించడానికి మీ నివాసంలో, చుట్టుపక్కల పరిశుభ్రతను నిర్వహించండి. మురికి కాలువలు, చెత్త డబ్బాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. బహిరంగ ప్రదేశాలను శుభ్రంగా ఉంచండి.
ఫ్యాన్ ఉపయోగించండి:
దోమలు గాలిలో ఎగరడం కష్టం. కాబట్టి, ఇంటి లోపల ఉన్నప్పుడు వీలైనంత వరకు ఫ్యాన్‌ని ఉపయోగించండి. తెల్లవారుజామున , మధ్యాహ్నం పూట దోమలు చాలా చురుకుగా ఉంటాయి. ఈ సమయంలో బహిరంగ కార్యకలాపాలను తగ్గించండి.
సహజ వికర్షకాలు:
మీ ఇంటి చుట్టూ సిట్రోనెల్లా, లెమన్‌గ్రాస్, పుదీనా వంటి దోమలను తరిమికొట్టే మొక్కలను నాటండి. మీ ఇంటి పరిసరాల చుట్టూ దోమల నివారణ మందులు వాడండి.
వ్యక్తిగత పరిశుభ్రత:
మంచి వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి, దోమలు చెమట , శరీర దుర్వాసనకు ఆకర్షితులవుతాయి. కాబట్టి రోజుకు రెండుసార్లు స్నానం చేయండి.
అవగాహన కల్పించండి:
డెంగ్యూ నివారణ పద్ధతుల గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించండి.