Drinking Water: ఎక్కువ నీరు తాగడం కూడా ప్రమాదకరమా? ఏ సందర్భంలో ఇది?
08 January 2024, 18:34 IST
- ఓవర్‌హైడ్రేషన్, డీహైడ్రేషన్ రెండూ మీ శరీరానికి హాని కలిగిస్తాయి. ఈ రెండింటిలో ఏది ఎలా ప్రమాదకరమో నిపుణుల నుండి తెలుసుకోండి?
ఒకేసారి అధికంగా నీళ్లు తాగడం ప్రమాదకరమా?
ఇండియానాకు చెందిన 35 ఏళ్ల మహిళ కుటుంబంతో కలిసి విహారయాత్రలో ఉన్నప్పుడు ఎక్కువ నీరు తాగడం వల్ల మరణించింది. ఆష్లే సమ్మర్స్ అనే మహిళ డీహైడ్రేషన్ కారణంగా తలనొప్పి, తలతిరగడం సమస్య వచ్చినప్పుడు ఒకేసారి దాదాపు 1.89 లీటర్ల నీరు తాగింది.
సమ్మర్స్ తర్వాత కుప్పకూలడంతో, ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ స్పృహలోకి రాలేకపోయింది. ఆసుపత్రి వైద్య బృందం తెలిపిన వివరాల ప్రకారం.. యువతి ఓవర్ హైడ్రేషన్‌కు గురైంది. అంటే తక్కువ సమయంలో ఎక్కువ నీరు త్రాగడం వల్ల ఇది సంభవిస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే అటు డీహైడ్రేషన్, ఇటు ఓవర్ హైడ్రేషన్ రెండూ ప్రాణాంతకం కావచ్చు.
‘జీవితానికి నీరు చాలా అవసరం. శరీరం తన విధులు నిర్వర్తించడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. రెండూ ద్రవ స్థాయిలలో అసమతుల్యత, వాటి పర్యవసానాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం..’ అని కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ హెచ్‌టీ తెలుగుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
ఓవర్ హైడ్రేషన్ అంటే..
వాటర్ ఇంటాక్సికేషన్ లేదా ఓవర్ హైడ్రేషన్ అంటే ఒక వ్యక్తి ఎక్కువ నీరు తీసుకున్నప్పుడు సంభవించే పరిస్థితి. ఇది రక్తప్రవాహంలో అవసరమైన ఎలక్ట్రోలైట్‌లను పలుచన చేస్తుంది. ఈ అసమతుల్యత శరీరం యొక్క సున్నితమైన సమతుల్యతను దెబ్బతీస్తుంది. వివిధ ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. తేలికపాటి లక్షణాలు తలనొప్పి, వికారం, గందరగోళం ఏర్పడుతుంది. ఇది వాంతులు, మూర్ఛలు, తీవ్రమైన సందర్భాల్లో కోమా వంటి అనారోగ్యానికి దారితీస్తుంది.
డీహైడ్రేషన్ అంటే ఏమిటి?
శరీరం ఎక్కువ ద్రవాలను కోల్పోయినప్పుడు డీహైడ్రేషన్ సంభవిస్తుంది. సాధారణ శారీరక విధులకు సాయం చేయడానికి తగినంత నీరు అందదు. విపరీతమైన చెమట, విరేచనాలు, వాంతులు లేదా తగినంత నీరు తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల హైడ్రేషన్ సంభవించవచ్చు. దీని ప్రారంభ సంకేతాలు దాహం, గొంతు పొడిబారడం, మైకం, అలసట. ఇది చికిత్స చేయకుండా వదిలేస్తే అవయవ వైఫల్యంతో సహా తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.
తీవ్రమైన డీహైడ్రేషన్ కూడా ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, మూత్రపిండాల వైఫల్యం, ఇతర ప్రాణాంతక సమస్యలను కలిగిస్తుంది. పిల్లలు, వృద్ధులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు ముప్పు ఎక్కువ.
‘సరైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ద్రవం తీసుకోవడంలో సరైన సమతుల్యతను సాధించడం చాలా అవసరం. మీ శరీరం యొక్క సంకేతాలపై శ్రద్ధ వహించండి. ముఖ్యంగా తీవ్రమైన శారీరక శ్రమ సమయంలో ఒకేసారి అధికంగా నీరు తీసుకోవడం మానుకోండి. అతిగా చేయకుండా హైడ్రేటెడ్ గా ఉండండి. మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా ఓవర్ హైడ్రేషన్ లేదా డీహైడ్రేషన్‌కు సంబంధించి తీవ్రమైన లక్షణాలను కలిగి ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి..’ డాక్టర్ అగర్వాల్ వివరించారు.