Awakening at Night | మధ్య రాత్రిలో నిద్ర లేస్తున్నారా? ఈ చిట్కాలు పాటించండి!
28 June 2022, 21:59 IST
- కొంతమంది నడిరాత్రిలో ఉన్నట్లుండి నిద్రలేస్తారు. ఆ తర్వాత ఒంటరిగా దిక్కులు చూస్తూ ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమస్యకు పరిష్కార మార్గాలు ఇక్కడ ఉన్నాయి.
Awake in the night
శారీరకంగా దృఢంగా ఉండేందుకు సమతుల్య ఆహారం, ప్రతిరోజూ వ్యాయామం ఎంత అవసరమో.. అదే విధంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు 8 గంటల రాత్రి నిద్ర అంతే అవసరం. ఈ రోజుల్లో జీవనశైలిలో మార్పుల వల్ల రాత్రిపూట నిద్ర సరిగా పట్టడం లేదు. ఒకవేళ ఏదో రకంగా త్వరగానే నిద్రపోయినా ఉన్నట్టుండి అకస్మాత్తుగా నడిరాత్రిలోనే మెలకువ వచ్చేస్తుంది. ఇక ఆ సమయంలో ఏం చేయాలో తెలియక గుడ్లగూబలా కూర్చుని దిక్కులు చూడటం, అనవసరపు ఆలోచనలతో బుర్ర పాడుచేసుకోవడం జరుగుతుంది.
పొద్దుపోయే వరకు టీవీ చూడటం, మొబైల్‌లో సెర్చ్ చేయడం, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఇప్పుడు చాలా మంది జీవ గడియారం ప్రభావితమైంది. ఈ కారణాల వల్ల మీరు కూడా రాత్రి బాగా నిద్రపోలేకపోతే లేదా అర్ధరాత్రి మెలకువ వచ్చేస్తే మీరు రాత్రంతా బాగా నిద్రపోవడానికి మీకు సహాయపడే కొన్ని చిట్కాలను ఇక్కడ తెలుసుకోండి.
మెగ్నీషియం థెరపీ
పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగండి. ఇందులోని మెగ్నీషియం కండరాలను విశ్రాంతి తీసుకోవడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే కాల్చిన జీడిపప్పు, బాదంపప్పు మొదలగు నట్స్ లో మెగ్నీషియం లభిస్తుంది. నిద్రవేళకు 1-2 గంటల ముందు స్నానం చేసే అలవాటు ఉంటే ఆ నీటిలో కొన్ని మెగ్నీషియం ఫ్లేక్స్ వేయండి. అవి కరిగిన తర్వాత స్నానం చేయండి. అయితే ఈ మెగ్నీషియ స్నానం విషయంలో ముందుగా వైద్యుని సలహా తీసుకోవడం ఉత్తమం.
బాడీ మసాజ్
మసాజ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది శరీరానికి విశ్రాంతినిస్తుంది. బాధ, నిరాశ, ఆందోళనలను నివారిస్తుంది. తద్వారా హాయిగా నిద్ర పోవచ్చు. పడుకునే ముందు బాడీ మసాజ్ చేసుకోండి. లేదా మసాజ్ కోసం మీరు మసాజ్ కోసం మీ భాగస్వామిని అభ్యర్థించవచ్చు. మీరు సింగిల్ అయితే మీకు మీరుగా లావెండర్ నూనెను తల, చేతులు, పాదాలు, నడుముపై మసాజ్ చేయండి. అదీ కుదరకపోతే పాదాలకు కొబ్బరినూనె రాసుకోండి.
మైండ్ ఫుల్ మెడిటేషన్
మైండ్ ఫుల్ మెడిటేషన్ ను మీ అలవాట్లలో చేర్చుకోండి. ఈ తరహా ధ్యానం వలన మనసు నిమ్మలం అవుతుంది, నిద్ర నిండుగా తెల్లారే వరకు వస్తుంది. ఉదయం లేదా సాయంత్రం కేవలం 15 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి చాలు.
యోగ నిద్ర
నిద్రపోయే ముందు కొన్ని యోగాసనాలు చెబుతారు, అందులో అత్యంత ప్రభావవంతమైనది యోగా నిద్ర. దీనినే శవాసనం అని కూడా అంటారు. వెల్లకిలా ఎలాంటి కదలికలు, మనసులో ఎలాంటి ఆలోచనలను లేకుండా పడుకోవడమే ఈ ఆసనం. రోజూ 15-20 నిమిషాల పాటు యోగ నిద్ర ప్రాక్టీస్ చేయండి.
జపించండి
తెలుగు, సంస్కృతం, హిందీ లేదా ఏ భాషలోనైనా మంత్రాలను పఠించడం వల్ల మీ మైండ్, మనసు ప్రశాంతం అవుతాయి. ఒక మంత్రాన్ని పదే పదే జపించడం వలన ఏకాగ్రత ఏర్పడుతుంది. దీంతో మెదడు విశ్రాంతి పొంది గాఢ నిద్రలోకి వెళ్లే ప్రక్రియ జరుగుతుంది.
ఇక పడుకునే ముందు బిగుతైన దుస్తులు కాకుండా వదులుగా ఉండేలా వేసుకోండి. గదిలో చిమ్మ చీకటి చేసుకోండి. మీకు ఉదయం వరకు మెలకువ రాదు.
టాపిక్