Ganesh Chaturthi Decorations : మీ ఇంట్లో వినాయకుని మండపాన్ని ఇలా అలంకరించేయండి..
30 August 2022, 8:42 IST
- Ganesh Chaturthi Decoration Ideas: వినాయకచవితి రానే వచ్చేసింది. ఇప్పటికే చాలా మండపాలు పూర్తై పోయాయి. అయితే మీరు ఇంట్లో పెట్టుకునే బుజ్జి గణేశ్ కోసం మండపం తయారు చేశారా? ఎలా డిజైన్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే. వినాయక మండపాన్ని క్రియేటివ్‌గా, చూడచక్కని విధంగా, సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
వినాయక చవితి మండపం అలంకరణ చిట్కాలు, ఐడియాలు
Ganesh Chaturthi Decorations Ideas : మరో రోజులో వినాయక చవితి ప్రారంభం కానుంది. భక్తులంతా ఈ వేడుకల కోసం ఇప్పటికే పలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తమకు కావాల్సిన గణపయ్యలను కొందరు మండపానికి చేర్చేస్తున్నారు. అయితే వీధుల్లో మండపం ఎంత ప్రత్యేకమో.. ఇంట్లో కొలువుంచే మండపం కూడా అంతే ప్రత్యేకం. మరి మీరు మీ ఇంట్లో మండపాన్ని రెడీ చేసుకున్నారా? అయితే రాబోయే పండగ కోసం ఎలాంటి అలంకరణ అనుకూలంగా చూడచక్కగా ఉంటుందో తెలుసుకుందాం. అంతేకాకుండా.. సులువుగా, క్రియోటివ్‌గా మీ మండపాన్ని మార్చుకోవడానికి ఇక్కడ కొన్ని ఐడియాలు ఉన్నాయి. అవేంటో చూసేయండి.
పువ్వులు
పువ్వులు శుభప్రదమైనవి. అందుకే వాటిని అనేక భారతీయ పండుగలు, వేడుకలలో పువ్వులు ఉపయోగిస్తారు. అయితే మీరు వినాయక చవితి మండపం అలంకరణ కోసం పువ్వులను ఉపయోగించవచ్చు. మీరు మీ గణపతి మండపాన్ని రంగురంగుల పువ్వులు, అందమైన తీగలతో సులభంగా అలంకరించవచ్చు.
సహజమైన పూలు త్వరగా పాడైపోతాయని మీరు భావిస్తే.. మార్కెట్లో సులభంగా లభించే కృత్రిమ పువ్వులను కూడా అలంకరణకు వాడుకోవచ్చు.
లైట్లు
మీరు గణేష్ మండపానికి ఓ థీమ్ అనుకున్నారా? అయితే ఆ థీమ్‌కు బాగా సరిపోయే కొన్ని శక్తివంతమైన ఫెయిరీ లైట్లను తీసుకోండి. అదనంగా మండపానికి మరింత శోభను తీసుకువచ్చేందుకు మల్టీకలర్ లైట్లు లేదా పెద్ద బల్బులను ఉపయోగించవచ్చు. ఒక మంచి ఆలోచన ఏమిటంటే.. విగ్రహానికి మంచి ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటే.. గణేష్ ప్రతిమ చుట్టూ లైట్లు వేయాలి. ఇవేకాకుండా మీరు కొన్ని దీపాలను కూడా వెలిగించవచ్చు. ఎందుకంటే గణేశుడు చీకటిని తరిమికొట్టడానికి వచ్చాడని భక్తులు భావిస్తారు కాబట్టి.
రంగోలి
మీరు ఏ వేడుకలు జరుపుకున్నా రంగోలీని వేయడం సంప్రదాయం. ఈ గణేష్ చతుర్థి రోజున మీ సృజనాత్మకతకు పనిపెట్టండి. రకరకాల రంగులతో అద్భుతమైన రంగోలిని తయారు చేయండి. రంగురంగుల గణపతి రంగోలిని కూడా మీరు వేయవచ్చు. అవసరమైతే మార్కెట్లో సులభంగా లభించే స్టెన్సిల్‌ను ఉపయోగించండి.
పర్యావరణ అనుకూలమైన వేడుక కోసం మీరు ఇంట్లో ఎరుపు, పసుపు, నారింజ, గోధుమ వంటి రంగులను తయారు చేసుకోవచ్చు.
పేపర్ అలంకరణలు
పువ్వులు పెట్టడమే కాకుండా.. మండపాన్ని మరింత అందంగా కనిపించేలా చేయడానికి మీరు కొన్ని ఆకర్షణీయమైన పేపర్ డిజైన్‌లను ఎంచుకోవచ్చు. ఓరిగామితో మీరు స్వాన్స్, సీతాకోకచిలుకలు, గొడుగుల వంటి నమూనాలను తయారు చేయవచ్చు.
మీరు స్పైరల్స్, స్ట్రింగ్స్ వంటి కొన్ని అందమైన అబ్‌స్ట్రాక్ట్ డిజైన్‌లను కూడా సృష్టించవచ్చు. మొత్తం థీమ్‌ను ఏకీకృతం చేసే ఒకే రంగును ఎంచుకోండి లేదా మల్టీకలర్ పేపర్‌లను ఉపయోగించండి.
ఫోటో ఫ్రేమ్‌లు, పెయింటింగ్‌లు
మీరు ఆర్ట్ ఫ్రీక్ అయితే.. ఈ గణేష్ చతుర్థికి మీ సృజనాత్మక నైపుణ్యాలను పరీక్షించుకోవచ్చు. వినాయకుని అందమైన చిత్రాలను తయారు చేయండి. వాటిని రంగురంగుల ఫ్రేమ్‌లలో ఉంచండి. గణేష్ విగ్రహం వెనుక గోడపై వాటిని అమర్చండి. మీరు వాటిని గోడ లేదా ఫాబ్రిక్‌పై అతికించవచ్చు. మరొక ఆలోచన ఏమిటంటే.. LED స్ట్రింగ్‌కు కొన్ని పూజ్యమైన పేపర్ పెయింటింగ్‌లను క్లిప్ చేయడం.