Tablets for Spermcount: స్పెర్మ్ కౌంట్ పెంచడానికి సప్లిమెంట్స్ వాడుతున్నారా? అవెంత హానికరమో తెలుసుకోండి
13 June 2024, 18:30 IST
Tablets for Spermcount: స్పెర్మ్ కౌంట్ పెంచడానికి మాత్రలు లేదా సప్లిమెంట్లను వాడుతూ ఉంటారు కొంతమంది పురుషులు. అయితే ఆ సప్లిమెంట్లను వాడడం వల్ల హానికరమైన ప్రభావాలను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి.
స్పెర్మ్ కౌంట్ పెంచే సప్లిమెంట్లు
పురుషుల్లో అనేక రకాల ఆరోగ్య సమస్యలు తొంగి చూస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం. వీటి సంఖ్య తక్కువగా ఉండడం, అలాగే వాటి చలన శీలత లేకపోవడం వల్ల పునరుత్పత్తి సమస్యలు వస్తున్నాయి. ఇది గర్భధారణ అవకాశాలను తగ్గిస్తుంది. తక్కువ స్పెర్మ్ కౌంట్ ఉన్నవారు కొన్ని రకాల సప్లిమెంట్లను వాడుతూ ఉంటారు. ఆ మాత్రలు లేదా సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ గణనీయంగా పెరుగుతుందని ఒక అపోహ ఉంది.
కొన్ని సప్లిమెంట్స్ స్పెర్మ్ కౌంట్స్ పెంచుతాయని పేర్కొన్నప్పటికీ, ఏదైనా మందులు లేదా సప్లిమెంట్ తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. జీవనశైలి ఎంపికలు, అంతర్లీన ఆరోగ్య పరిస్థితులు, వారసత్వం వంటి వివిధ అంశాలు స్పెర్మ్ కౌంట్‌ను ప్రభావితం చేస్తాయి. విటమిన్ సి, జింక్, ఫోలిక్ యాసిడ్ వంటి కొన్ని విటమిన్లు, ఖనిజాలు స్పెర్మ్ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పోషకాల కోసం కేవలం సప్లిమెంట్లపై ఆధారపడకుండా సమతుల్య ఆహారం తినడం మంచిది. స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి సమతులాహారం తినాల్సిన అవసరం ఉంది.
మగవారూ కారణమే..
పిల్లలు పుట్టక ఇబ్బంది పడుతున్న జంటల్లో 70 శాతం మంది స్త్రీలలో సమస్యలు ఉంటే, 30 శాతం మంది పురుషుల్లో పునరుత్పత్తి సమస్యలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. మగవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం వల్ల, వాటి చలనశీలత తక్కువగా ఉన్నా గర్భం ధరించడం కష్టంగా మారుతుంది. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా కూడా ఎటువంటి లక్షణాలు కనిపించవు. డయాబెటిస్, హార్మోన్ల అసమతుల్యత, కొన్ని జన్యు పరిస్థితులు, లైంగిక సంక్రమణ అంటువ్యాధులు, శస్త్రచికిత్సలు వల్ల కూడా కొంతమంది మగవారిలో తక్కువ స్పెర్మ్ కౌంట్ ఉండే అవకాశం ఉంది. ధూమపానం, అధికంగా మద్యం సేవించడం, మాదకద్రవ్యాల వాడకం వంటి అనారోగ్య జీవనశైలి వల్ల కూడా వీర్య కణాలు తగ్గే అవకాశం ఉంది.
కొన్ని సప్లిమెంట్స్ లేదా టాబ్లెట్లు వాడడం ద్వారా స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడం, వాటి నాణ్యతను పెంచడానికి కొంతమంది ప్రయత్నిస్తారు. వీటిలో హార్మోన్ సప్లిమెంట్స్, అంతర్లీన ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి వాడే యాంటీబయాటిక్స్ వంటివి ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ ఇ, కోఎంజైమ్ క్యూ 10, జింక్, ఫోలిక్ యాసిడ్, ఎల్-కార్నిటైన్ వంటి వివిధ విటమిన్ సప్లిమెంట్స్, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. వీటి కోసం సప్లిమెంట్లు తినడం కన్నా ఆహార రూపంలో తినడం ముఖ్యం. వీర్య కణాలు పెంచుకోవడం కోసం సప్లిమెంట్లను వాడడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
తక్కువ స్పెర్మ్ కౌంట్ ఉందని సప్లిమెంట్లు వాడితే ఇబ్బందులు వస్తాయి. ఆ మందులు వైద్యులు చెప్పిన మేరకే వాడాలి. సకాలంలో వైద్య సలహా తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం మొత్తం పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఒత్తిడిని నిర్వహించడం, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం, ధూమపానం మానేయడం, మద్యపానాన్ని పరిమితం చేయడం, బిగుతైన లో దుస్తులు వేసుకోకపోవడం, వేడి స్నానాలు చేయడం మానేయడం వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల సహజంగానే వీర్య కణాలు పెరుగుతాయి.
టాపిక్