handbag types: మీ లుక్ మార్చేసే బ్యాగులివే.. ఏ బ్యాగు ఎప్పుడు వాడాలంటే..
30 April 2023, 17:41 IST
handbags: అమ్మాయిల వార్డ్‌రోబ్ లో తప్పకుండా ఉండాల్సిన కొన్ని రకాల బ్యాగుల గురించి, ఏ బ్యాగును ఎప్పుడు వాడితే బాగుంటుందో తెలుసుకోండి.
హ్యాండ్ బ్యాగులు
సాయంత్రం వేడుకకి, పెళ్లిళ్లకి, దూర ప్రయాణాలకి, షాపింగ్‌కి.. ఇలా ప్రతి సందర్భంలో అమ్మాయిల వెంట ఒక బ్యాగ్ ఉంటుంది. ఇంతకీ ప్రతి అమ్మాయి దగ్గర ఉండాల్సిన బ్యాగులేంటో.. ఎప్పుడు ఏ బ్యాగు వాడితే బాగుంటుందో తెలుసుకుందాం.
డఫెల్ బ్యాగ్:
ఇది స్థూపాకారం (cylindrical) లో అడ్డంగా ఉంటుంది. ఎక్కువ సామాన్లు తీసుకెళ్లాల్సి వచ్చినపుడు ఇది సరిపోతుంది. జిమ్ కి వెళ్లేటపుడు, వారాంతపు టూర్‌కి వెళ్లినపుడు.. దీనిలో అన్నీ పట్టేస్తాయి. బ్యాగు పెద్దగా ఉండటం వల్ల వస్తువులు కూడా సులభంగా సర్దుకోవచ్చు.
టోట్ బ్యాగ్:
రోజూవారీ అవసరాలకి ఇది చక్కగా సరిపోతుంది. పొడవుగా, ఎక్కువ స్థలం ఉండే ఈ బ్యాగులు ఆఫీసుకి వెళ్లేవాళ్లు, కాలేజీలకి వెళ్లే వాళ్లకు ఎంచుకోవచ్చు.
ఈవెనింగ్ క్లచ్:
సాయంత్రం వేళ పార్టీలకు, పొడవాటి గౌనులకు కాస్త మెరిసే క్లచ్ చక్కగా నప్పుతుంది. ఎంబ్రయిడరీ, లేసులతో మెరిసిపోయే ఈ క్లచ్ తప్పకుండా ప్రతి అమ్మాయి దగ్గర ఉండాల్సిందే. నలుపు రంగు శాటిన్ లేదా మెటాలిక్ లుక్ తో బంగారం లేదా వెండి రంగులో ఉండే క్లచ్ చాలా బాగుంటుంది. అయితే వీటిలో కేవలం ఫోను, డబ్బులు పట్టేంత చిన్నగా ఉంటాయివి. సామాన్లు పెట్టుకునే వీలుండదు.
బ్యాక్ ప్యాక్:
కాలేజీ బ్యాగును కాస్త మార్చినట్టుంటుందిది. చూడటానికి వివిధ ప్రింట్లతో, ట్రెండీగా.. కాస్త ఆకారం మార్చి ఉంటాయివి. వీటిని చిన్న ట్రిప్పులకు, రోజూవారీ కూడా వాడుకోవచ్చు. కాలేజీలకు కూడా కాస్త ట్రెండీగా ఉండాలనుకుంటే వీటిని ఎంచుకోవచ్చు. ఫ్యాన్సీ ప్రింట్లతో వచ్చేవి కూడా ఉన్నాయి. వాటిని స్టైల్ స్టేట్ మెంట్ లాగా వాడేస్తున్నారు.
టాపిక్