తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tuesday Motivation : బలహీనతలనేవి బఠాణీలు కాదు.. అందరితో పంచుకోవడానికి..

Tuesday Motivation : బలహీనతలనేవి బఠాణీలు కాదు.. అందరితో పంచుకోవడానికి..

17 January 2023, 4:00 IST

    • Tuesday Motivation : సంతోషాన్ని నలుగురితో పంచుకున్నా పర్లేదు కానీ.. బాధలను, బలహీనతలను ఎవరితో పంచుకోకపోవడమే మంచిది. ఎవరితో అయినా బాధ షేర్ చేసుకుంటే తగ్గుతుంది అంటారు నిజమే. కానీ ఎవరితో పడితే వాళ్లతో బలహీనతలు, బాధలు పంచుకుంటే.. కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే. అదేంటి అనుకుంటున్నారా?
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Tuesday Motivation : మీతో ఓ వ్యక్తి మంచిగా ఉండొచ్చు. ఆ వ్యక్తి ప్రతిసారి మీతో మంచిగా ఉంటారని అర్థం కాదు. ఏ వ్యక్తితో అయినా కొంత దూరం ట్రావెల్ చేశాకే.. మీ బాధను అయినా.. సంతోషాన్ని అయినా పంచుకోండి. ఒకరు గురించి తెలుసుకోకుండా.. మీ బలహీనతలు చెప్పేయడం కరెక్ట్ కాదు. తెలిసి వ్యక్తులు మోసం చేయరా అనే ప్రశ్న మీలో ఉండొచ్చు. కానీ మనకి ఎంత తెలిసినా వ్యక్తి అయినా మనం కొన్ని విషయాలు షేర్ చేసుకోము. ఎందుకంటే వారిపై మనకి నమ్మకం ఉండదు కాబట్టి. కానీ కొందరిపై మనకి ఎనలేని నమ్మకముంటుంది. బాధను వారితో పంచుకుంటే హాయిగా ఉంటుంది అనిపించవచ్చు. అలాంటివారితో మీకు ఎక్కువ హాని ఉండదు.

కానీ మీకు ఓ వ్యక్తి గురించి పూర్తిగా తెలియకుండా మీ సీక్రెట్స్ షేర్ చేసుకోకండి. నిజమే బాధలో ఉన్నప్పుడు మనసు కాస్త ఓదార్పును కోరుకుంటుంది. అది మీ పక్కనే ఉన్నవారు ఇస్తారేమో అని మీకు అనిపించి.. మీ బాధ, బలహీనతలు గురించి చెప్పేసుకోవచ్చు. కానీ మీ పర్సనల్ విషయాలు చెప్పడానికి ఆ వ్యక్తి కరెక్టేనా? అందరూ మంచివారు అనుకోవడం మన బలహీనత కావొచ్చు. కానీ.. కపటులతో నిండిన ఈలోకంలో జాగ్రత్తగా వ్యవహరించకుంటే మీకే ప్రమాదం. కొందరు మీరు బాధలో ఉన్నారని తెలిస్తే.. తెలివిగా వారి భుజం మీకిస్తున్నట్లు నటిస్తారు. అలాంటి వారితో జాగ్రత్త.

అదేంటి వారు మనకి ఓదార్పునిస్తున్నారు కదా.. వాళ్లతో ప్రాబ్లం ఏంటి అని మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే.. వారు మనకి నిజంగా ఓదార్పునిస్తే పర్లేదు. కానీ తెలివిగా మన బలహీనతలను తెలుసుకుని.. వాళ్లకి సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని మోసం చేస్తే.. లేదా మీ బలహీనతలను అడ్డుగా పెట్టుకుని వారికి అనుకూలమైన విషయాలకు మిమ్మల్ని బలవంతంగా ఒప్పించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. అలాంటి వారు ఎక్కడో ఎందుకు మన కుటంబంలో కూడా ఉంటారు. తెలివిగా మన విషయాలు తెలుసుకుని.. మనకు వ్యతిరేకంగా వాటిని ప్రయోగించేందుకు ట్రై చేస్తారు.

మీ కష్టాలు, బాధలు, బలహీనతలను మీ సొంతం అనుకున్న వారితో మాత్రమే పంచుకోండి. ఎవరికిపడితే వారికి మీ బలహీనతల గురించి చెప్తే మీ గొయ్యి మీరు తీసుకున్నట్లే. ఇతరులతో మాట్లాడే ముందు మీరు తెలివిగా వ్యవహరించడం నేర్చుకోండి. ఇతరులను నమ్మి మీరు కూడా మోసపోయి ఉంటారు. ఇంకా మీరు అందరూ మంచి వారు అని నమ్మితే కనుక మీ అంత మూర్ఖులు ఇంకొకరు ఉండరు. మీరు బాగా నమ్ముతున్న వ్యక్తి గురించి మీకు క్లారిటీ లేకపోయినా.. మీరు మీ విషయాలు వెల్లడించకండి. మనకి మంచే చేసే వారు ఎవరూ? ముంచేవారు ఎవరో మీరు కచ్చితంగా గుర్తించాలి.

ఇప్పుడున్న బిజీ లైఫ్​లో మన చుట్టూ మనకి నచ్చినవారు, మనం నమ్మేవారు ఉండరు. అలాంటప్పుడు ఎవరితో పడితే వారితో మన బలహీనతలను షేర్ చేసుకుంటాము. అయితే వారు మనకి వ్యతిరేకంగా మన సమచారాన్ని ఉపయోగించే ప్రమాదం ఉంది. లేదంటే వారు మన బాధలు, బలహీనతలను మరొకరితో పంచుకుంటారు. కాబట్టి.. వీక్ మూమెంట్​లో అయినా.. మీ గురించి మీరు నోరు విప్పకండి. మీరు మంచివారు కావొచ్చు. కానీ మీ చుట్టూ ఉన్నవారు అంతా మంచివారు కాకపోవచ్చుగా. మీరు నమ్మిన వారితో మీ కష్టాలు పంచుకోండి. అంతేకానీ అందరితో పంచుకోవడానికి ఇవేమి బఠాణీలు కాదు. బలహీనతలు.