Paneer Tikki Chat: శక్తినిచ్చే పన్నీర్ టిక్కి చాట్, ఉపవాసం రోజూ తినొచ్చు
04 October 2024, 15:30 IST
Paneer Tikki: నవరాత్రులలో రుచికరమైన శక్తినిచ్చే స్నాక్స్ కోసం చూస్తే పన్నీర్ టిక్కి చాట్ బెస్ట్ ఆప్షన్. ఉపవాసం రోజున కూడా కావాల్సినంత శక్తనిస్తుందిది. ఈ రెసిపీ ఎలా చేయాలో చూడండి.
పన్నీర్ టిక్కి చాట్
నవరాత్రులలో వివిధ రకాలుగా ఉపవాసం చేస్తారు. కొందరు 9 రోజులు పండ్లు మాత్రమే తీసుకుంటారు. కొందరు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. కొందరేమో ఈ నవరాత్రుల్లో ఉల్లి, వెల్లుల్లి తినరు. అయితే ఈ 9 రోజులు ఉపవాసం ఉంటే మీకు శక్తినిచ్చే ఆహారం ఒక్కపూట తిన్నప్పుడు చేర్చుకోవాల్సిందే. ప్రొటీన్ ఎక్కువుండేలా చూసుకోండి. అలాంటి హై ప్రొటీన్, ఆరోగ్యకరమైన స్నాక్ పన్నీర్ టిక్కి చాట్. దాన్నెలా చేయాలో చూడండి.
పన్నీర్ టిక్కి చాట్ కోసం కావలసిన పదార్థాలు:
200 గ్రాముల పనీర్
2 ఉడకబెట్టిన బంగాళాదుంపలు
2 చెంచాల పెరుగు
2 పచ్చిమిర్చి
1 చెంచాడు గ్రీన్ చట్నీ (ఆప్షనల్)
అర చెంచా వేయించిన జీలకర్ర పొడి
గుప్పెడు దానిమ్మ గింజలు
నెయ్యి లేదా బటర్
సగం టీస్పూన్ మిరియాల పొడి
సగం టీస్పూన్ నల్లుప్పు(ఉపవాసం రోజు సైంధవ లవణం వాడండి)
వేరుశెనగలు (నూనెలో వేయించినవి)
పన్నీర్ టిక్కి చాట్ తయారీ విధానం:
- ముందుగా బంగాళాదుంపలను ఉడికించి గుజ్జుగా చేయాలి.
- అందులోనే పనీర్, కొద్దిగా ఉప్పు కలపాలి. పన్నీర్ తురుముకున్నా పరవాలేదు. లేదంటే చేతితో నలిపి వేసుకోవచ్చు.
- ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని చేతుల మధ్య పెట్టి టిక్కీలాగా ఒత్తుకోవాలి.
- ప్యాన్ వేడి చేసుకుని బటర్ లేదా నెయ్యి వేసి వీటిని కాల్చుకోవాలి. మంచి బంగారు వర్ణం రావాలి. దాంతో క్రిస్పీగా అవుతాయి.
- వీటిని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. వాటిమీద మీకిష్టం ఉంటే కాస్త గ్రీన్ చట్నీ వేయాలి.
- పెరుగును గిన్నెలో తీసుకుని అందులో కాస్త పంచదార, ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి.
- దీన్ని గ్రీన్ చట్నీ మీద కొద్దిగా వేసుకోండి. పైన ఉప్పు, దానిమ్మ గింజలు, వేరుశనగలతో గార్నిష్ చేసుకోండి.
టాపిక్