Throat pain: వంటగదిలో ఉన్న ఈ మూడు వస్తువులు మీ గొంతు నొప్పిని తగ్గించేస్తాయి, ప్రయత్నించండి
18 September 2024, 17:30 IST
- Throat pain: మారుతున్న సీజన్ వల్ల గొంతునొప్పి సమస్య ఎక్కువ మందిలో కనిపిస్తుంది. దీనిని ఎదుర్కోవటానికి రకరకాల మందులు వేసుకుంటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం వంటింట్లో ఉన్న వస్తువులతోనే గొంతునొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు.
గొంతు నొప్పి తగ్గించే చిట్కాలు
వాతావరణం చల్లబడుతున్న కొద్దీ గొంతునొప్పి, దగ్గు వంటి సమస్యలు పెరుగుతాయి. ఈ సీజన్లో వర్షం పడడం వల్ల త్వరగా ఇన్ఫెక్షన్ సోకుతుంది. పిల్లలు, పెద్దలు ఇద్దరికీ గొంతు నొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. ఈ సమస్యలను ఎదుర్కోవటానికి ఎంతో మంది యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తారు. ఇలా ప్రతిసారీ ఆ యాంటీ బయోటిక్స్ వేయడం మంచి పద్ధతి కాదు. అటువంటి పరిస్థితిలో, కొన్ని ఆయుర్వేద పద్ధతులను అనుసరించడం ద్వారా, మీరు గొంతు నొప్పి నుంచి బయటపడవచ్చు.
గొంతునొప్పి, జలుబు, కఫం, జీర్ణక్రియ వంటి సమస్యలను పరిష్కరించడానికి వంటింట్లో ఉండే మూడు వస్తువులను ఉపయోగించుకోవచ్చు. ఆయుర్వేద వైద్యులు చెబుతున్న ప్రకారం గొంతు నొప్పిని తగ్గించడానికి మాత్రలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న వస్తువులతోనే గొంతు నొప్పిని తగ్గించుకోవచ్చు.
త్రికటు చూర్ణం
త్రికటు చూర్ణం ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైనది. దీనిలో నల్ల మిరియాలు, శొంఠి, పిప్పాలి కలిపి ఈ చూర్ణాన్ని తయారు చేస్తారు. ప్రతి ఇంట్లో నల్ల మిరియాలు ఉంటాయి. శొంఠి అంటే ఎండు అల్లం కొనుక్కోవాలి. వీటిలో ఎన్నో ఔషధ లక్షణాలు ఉన్నాయి. నల్లి మిరియాల పొడి, ఎండు అల్లం పొడితో గొంతు నొప్పిని తగ్గించుకోవచ్చు. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆకలి మెరుగుపడుతుంది. అలాగే ఎంజైమ్ లను ఉత్పత్తి చేయడానికి పొట్టను ప్రేరేపిస్తుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. శ్వాసకోశ వ్యవస్థకు కూడా మిరియాల పొడి, అల్లం పొడి చాలా మంచిది. దగ్గు, జలుబు, ఆస్తమా, అలర్జిక్ రైనైటిస్ వంటి సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.
పిప్పాలి కూడా ఆయుర్వేదం షాపుల్లో లభిస్తుంది. వీటి వాడకం కొవ్వును కరిగించడంతో పాటు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా థైరాయిడ్ సమస్యను, గొంతునొప్పి, ట్రాన్సిలైటిస్ వంటి గొంతు వ్యాధుల్లో ఇది ప్రయోజనకరంగా పనిచేస్తుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పొడిని రోజుకు 3 గ్రాముల వరకు తీసుకోవచ్చు. రాత్రి భోజనం తరువాత ఈ పొడిని తినడం మంచిది. త్రికటు పొడిని తేనె లేదా నీటిలో కలిపి తినవచ్చు. ఎవరికైనా దాని రుచి చాలా కారంగా అనిపిస్తే, దాన్ని ఆహారంలో కలిపి తీసుకోవచ్చు.
ఈ మిశ్రమాన్ని చల్లని వాతావరణంలోనే వాడాలి. త్రికూట చూర్ణం ప్రభావం వేడి చేస్తుంది. కాబట్టి మీరు ఈ మిశ్రమాన్ని తీసుకోవాలనుకుంటే, ముందుగా ఆయుర్వేద వైద్యుడిని కలిసి సలహా తీసుకోండి.
జలుబు, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలతో బాధపడేవారు త్రికటు చూర్ణాన్ని సేవించవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. త్రికటు చూర్ణంలో డిటాక్సిఫికేషన్ లక్షణాలను కలిగి ఉంటుంది. జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. అధిక బరువును తగ్గిస్తుంది.
(గమనిక: ఈ వ్యాసంలో పేర్కొన్న విసయాలను కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఎటువంటి చికిత్స/ఔషధం/ఆహారం తీసుకునే ముందు డాక్టర్ లేదా నిపుణుడిని సంప్రదించండి)