తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mixed Dal Garelu: దసరాకు మిక్స్‌‌డ్ పప్పుల గారెలు చేసి చూడండి ఇవి చాలా టేస్టీ ఎంతో హెల్తీ

Mixed Dal Garelu: దసరాకు మిక్స్‌‌డ్ పప్పుల గారెలు చేసి చూడండి ఇవి చాలా టేస్టీ ఎంతో హెల్తీ

Haritha Chappa HT Telugu

11 October 2024, 17:30 IST

google News
    • Mixed Dal Garelu:మినపప్పు గారెలు ఎప్పుడూ చేసుకునేవే, ఇక్కడ మేము మిక్స్‌డ్ పప్పులతో గారెలు ఎలా చేయాలో చెప్పాము. శెనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు ఈ మూడింటితో చేసే గారెలు టేస్టీగా ఉంటాయి.
మూడు పప్పులతో గారెలు రెసిపీ
మూడు పప్పులతో గారెలు రెసిపీ

మూడు పప్పులతో గారెలు రెసిపీ

Mixed Dal Garelu: మినప్పప్పుతో చేసే గారెలు అందరికీ తెలిసినవే. వీటినే వడలు అని కూడా అంటారు. దసరాకు స్పెషల్ మూడు రకాల పప్పులు, రెండు రకాల పిండిని కలిపి గారెలు వండి చూడండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని అమ్మారివకి నైవేద్యంగా కూడా ఉపయోగించవచ్చు. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిని సాంబార్, కొబ్బరి చట్నీతో తింటే ఎంతో రుచిగా ఉంటాయి. ఇక రెసిపీ ఎలాగో చూసేయండి.

మిక్స్‌డ్ పప్పుల గారెలు రెసిపీకి కావలసిన పదార్థాలు

పెసరపప్పు - అరకప్పు

మినప్పప్పు - అర కప్పు

శనగపప్పు - అర కప్పు

గోధుమపిండి - అరకప్పు

బియ్యప్పిండి - అరకప్పు

అల్లం - చిన్న ముక్క

నీరు - సరిపడినంత

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

కొత్తిమీర తరుగు - అయిదు స్పూన్లు

పచ్చిమిర్చి - ఎనిమిది

కరివేపాకుల తరుగు - గుప్పెడు

ఉప్పు - రుచికి సరిపడా

మిక్స్‌డ్ పప్పుల గారెలు రెసిపీ

1. శెనగపప్పు, పెసర పప్పు, మినప్పప్పును ముందుగానే నానబెట్టుకోవాలి.

2. వీటిని ఐదు గంటల పాటు నానబెట్టాల్సి వస్తుంది.

3. ఇవి బాగా నానాక మిక్సీ జార్లో వేసి అల్లం, పచ్చిమిర్చి, తగినంత నీరు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

4. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి.

5. ఆ గిన్నెలోనే బియ్యప్పిండి, గోధుమ పిండి, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

6. గారెలు వేయడానికి ఎంత మందంగా పిండి కావాలో అంత మందంగా వచ్చేలా ఈ పిండిని కలుపుకోవాలి.

7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.

8. ఆ నూనె వేడెక్కాక పిండిలోంచి కొంత ముద్దను తీసి గారెల్లా వత్తుకొని మధ్యలో చిల్లు పెట్టి నూనెలో వేసి వేయించాలి.

9. రెండు వైపులా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. టేస్టీగా ఉంటాయి.

10. వీటిని అమ్మవారి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. వీటిలో మూడు రకాల పప్పులు రెండు రకాల పిండి ఉన్నాయి.

11. కాబట్టి టేస్టీ కాస్త భిన్నంగా ఉంటుంది. సాధారణ గారెల కన్నా ఇవి రుచిగా ఉంటాయి.

మినప్పప్పుతో చేసిన గారెల్లో కేవలం మినప్పప్పులోని పోషకాలు మాత్రమే అందుతాయి. కానీ ఈ మిక్స్‌డ్ పప్పుల గారెల్లో పెసరపప్పు, శనగపప్పు, గోధుమపిండి, బియ్యప్పిండి, కొత్తిమీరలోని పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. కాబట్టి అప్పుడప్పుడు ఇలా మూడు రకాల పప్పులతో గారెలు వండేందుకు ప్రయత్నించండి.

తదుపరి వ్యాసం