Breakfast Recipe : బ్రేక్‌ఫాస్ట్‌కి ఓట్స్ ఉతప్పం.. అస్సలు కాదనలేం..
28 July 2022, 8:18 IST
- Oats Utappam : ఓట్స్ అనేవి బ్రేక్‌ఫాస్ట్‌కి మంచి ఎంపిక. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా.. ఎక్కువసేపు ఎనర్జీగా ఉండేలా చేస్తాయి. అందుకే చాలా మంది ఓట్స్‌ని తమ డైట్లో చేర్చుకుంటారు. మీరు కూడా అలాంటివారు అయితే ఈ ఓట్స్ ఉతప్పం ట్రై చేయవచ్చు.
ఓట్స్ ఉతప్పం
Breakfast Recipe : ఓట్స్ తయారు చేసినది ఏదైనా చాలా ఆరోగ్యకరమైన, శక్తినిచ్చే వంటకం అవుతుంది. దానిలో అన్ని పోషకగుణాలు ఉన్నాయి. అయితే రొటీన్ ఓట్స్‌కి బాయ్ బాయ్ చెప్పి.. కొత్త వంటను ట్రై చేయాలి అనుకుంటే ఓట్స్ ఉతప్పం బెస్ట్ ఎంపిక. దీనిని తయారుచేయడం కూడా చాలా సులువు. దీనిని ఎలా తయారు చేసుకోవాలి. ఏమేమి పదార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్ ఉతప్పం తయారీకి కావాల్సిన పదార్థాలు
* ఓట్స్ - 1 కప్పు
* సెమోలినా - అరకప్పు
* ఇంగువ - చిటికెడు
* పెరుగు - 1 కప్పు
* జీలకర్ర - టీస్పూన్
* కారం - పావు టీస్పూన్
* బేకింగ్ సోడా - చిటికెడు
* నీళ్లు - అవసరం మేరకు
* ఉల్లిపాయ - 1 (తరగాలి)
* టొమాటో - 1 (తరగాలి)
* పచ్చిమిర్చి - 3 (తరగాలి)
* ఉప్పు - తగినంత
* నూనె - తగినంత
* అల్లం - అరస్పూన్ (తరగాలి)
* కొత్తిమీర - కొంచెం
ఓట్స్ ఉతప్పం తయారీ విధానం
ఓట్స్, సెమోలినాను మిక్సీలో వేయాలి. గ్రైండ్ చేసి.. ఇంగువ వేసి బాగా తిప్పాలి. ఇప్పుడు దానిని ఓ గిన్నెలోకి తీసుకుని.. పెరుగు, జీలకర్ర, కారం, సోడా, అల్లం, నీరు వేసి చిక్కటి పిండిలా తయారు చేసుకోవాలి. దీనిని 10 నిమిషాలు పక్కన పెట్టేయండి.
అనంతరం ఆ మిశ్రమంలో తరిగిన ఉల్లిపాయ, టొమాటోలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేయాలి. రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి ఒక నాన్-స్టిక్ పాన్ వేడి చేయండి. దానిలో కొద్దిగా నూనె వేసి.. ఒక గరిటెతో పిండిని వేయండి. ఇది బంగారు గోధుమ రంగులోకి వచ్చినప్పుడు.. మరొక వైపునకు తిప్పి కాల్చండి. అంతే వేడి వేడి ఓట్స్ ఉతప్పం రెడీ. దీనిని మంచి చట్నీతో లాగించేస్తే సరి.