Breakfast Recipe : దోశలకు ప్రత్యామ్నాయం.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఓ వరం..
27 July 2022, 7:45 IST
- ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌కి దోశ ఒక సౌకర్యవంతమైన ఆహారం. పైగా దీనిని ఎక్కువగా చాలా మంది ఇష్టపడి తింటారు. అయితే గ్లూటెన్ రహిత దోశలు తినాలి అనుకునే వారు కచ్చితంగా రాగి దోశను తయారు చేసుకోవాల్సిందే. ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం. టేస్ట్‌కి టేస్ట్. పైగా దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
రాగిదోశ
Breakfast Recipe : సాధారణ దోశలకు రాగి దోశ ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. గ్లూటెన్ రహితంగా ఉండటమే కాకుండా.. రాగి దోశలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా ఇనుము, కాల్షియం, ఇతర ఖనిజాల సమృద్ధిగా ఉంటాయి. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
రాగిదోశకు కావాల్సిన పదార్థాలు
* రాగి పిండి - రెండు కప్పులు
* బియ్యం పిండి - అరకప్పు
* పుల్లటి పెరుగు - అరకప్పు
* పచ్చిమిర్చి - 3-4 (సన్నగా తరగాలి)
* కొత్తిమీర - 1 కప్పు (తురిమి పెట్టుకోవాలి)
* ఉల్లిపాయలు - అరకప్పు
* ఉప్పు - రుచికి తగినంత
* ఆవాలు - 1 స్పూన్
* జీలకర్ర - 1 స్పూన్
* కరివేపాకు - 5-6
* నూనె - తగినంత
రాగి దోశ తయారీవిధానం
రాగి పిండి, బియ్యంపిండి, పెరుగు, ఉప్పు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఓ పెద్ద గిన్నెలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని 2 గంటల పాటు పక్కన పెట్టేయాలి. రెండు గంటల తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనెను వేడి చేసి దానిలో ఆవాలు వేయాలి. అవి చిటపటలాడినప్పుడు.. జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఈ తాళింపును పిండిలో వేయండి. దానిని బాగా కలపండి.
ఇప్పుడు నాన్ స్టిక్ దోశ పాన్ వేడి చేసి.. దానిపై కాస్త నూనె వేయండి. అది వేడిగా అయిన తర్వాత.. సన్నని దోశను వేసి ఒక వైపు ఉడికించాలి. వండేటప్పుడు అంచుల వెంట కొద్దిగా నూనె పోయాలి. ఉడికినతర్వాత.. సర్వ్ చేసుకుని.. వేడి వేడిగా మంచి చట్నీతో లాగించేయాలి.