Breakfast Dairies : మ్యాంగో ఓట్స్ స్మూతీ.. టేస్ట్‌కి టేస్ట్.. పైగా హెల్తీ కూడా..
17 June 2022, 7:33 IST
- మామిడి పండ్లు ఆరోగ్యకరమైనవి, రుచికరమైనవి కూడా. కాబట్టి వీటిని మీ బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా భాగం చేసుకోవచ్చు. మామిడి పండ్లతో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ను తయారు చేసుకోవచ్చు.
మ్యాంగో ఓట్స్ స్మూతీ
Mango Oats Smoothie : వేసవి అయిపోయింది. మాన్సూన్ వచ్చేసింది. కానీ మార్కెట్లలో ఇంకా మామిడి పళ్లు దొరుకుతున్నాయి. ఇప్పుడు తినకపోతే.. మళ్లీ వింటర్ వరకు వేచి చూడాలనే బాధ చాలా మందిలో ఉంటుంది. అందుకే వారు మామిడి పండ్లను ఇప్పుడూ కూడా లాగించేస్తూ ఉంటారు. అయితే మీరు కూడా మామిడి పండ్ల ఫ్యాన్ అయి ఉంటే ఈ స్మూతీని మీ బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోవచ్చు. పైగా ఓట్స్ మ్యాంగో స్మూతీ మీ ఆరోగ్యానికి కూడా చాలామంచిది. దీనిని తయారు చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలు.. తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* మామిడి పండ్లు - 2
* ఓట్స్ - 15 గ్రాములు
* పాలు - 110 మి.లీ
* చక్కెర - 30 గ్రాములు (తేనె కూడా వాడొచ్చు)
* పెరుగు - 160 మి.లీ
* బాదం పప్పులు - 5
తయారీ విధానం..
మామిడిపండ్లను తొక్క తీసి.. ముక్కలుగా కట్ చేసి.. పక్కన పెట్టుకోవాలి. పాలను వేడి చేసి దానిలో ఓట్స్ వేసి.. కొన్ని నిమిషాలు ఉడికించాలి. అనంతరం గ్యాస్‌ను ఆపివేయండి. దానిలో చక్కెర లేదా తేనె వేసి బాగా కలపండి. అది పూర్తిగా చల్లారేవరకు పక్కన పెట్టేయండి.
బాదంపప్పును బ్లెండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దానిలో మామిడికాయ ముక్కలు, ఓట్స్, పంచదార, పెరుగు కలిపి మెత్తగా అయ్యేవరకు చేయాలి. దీనిని గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచి చల్లారాక బాదం పలుకలు, మ్యాంగో ముక్కలతో సర్వ్ చేసుకుని లాగించేయండి.