Breakfast Dairies : చిటికెలో రెడీ అయ్యే బేసన్ దోశ.. ఆరోగ్యానికి చాలా మంచిదట..
16 June 2022, 6:43 IST
- ఉదయాన్నే ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం ఓ వరమనే చెప్పాలి. ఎందుకంటే ఏది హెల్తీ, ఏది అన్ హెల్తీ అని చెప్పడం కష్టమైపోతుంది. మీరు కూడా అలాంటి వారైతే.. ఈ దోశ రెసిపీని ట్రై చేయాల్సింది. ఇంట్లో ఎక్కువగా ఉండే పదార్థాలతో దీనిని చిటికెలో తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
శనగ పిండితో దోశ
Besan Dosa : ఫైబర్, ఇతర పోషకాలను సమృద్ధిగా కలిగి ఉన్న దోశ బేసన్ దోశ (శనగపిండి దోశ). ఇది మీకు ఆరోగ్యకరమైన అల్పాహారంగా బాగా ఉపయోగపడుతుంది. దోశ అంటే పిండిని నానబెట్టాలి. బ్యాటర్ రెడీ చేసుకోవడానికి గంటలు గంటలు కష్టపడాలని ఆలోచిస్తున్నారా? అయితే వాటికి బ్రేక్ వేయండి. ఎందుకంటే ఈ రెసిపీని చిటికెలో తయారు చేసుకోవచ్చు. త్వరగా ఆఫీసులకు వెళ్లాలి అనుకున్నా.. లేటుగా లేచి త్వరగా ఏమైనా తినాలనుకునే వారికి ఇది ఆరోగ్యకరమైన బెస్ట్ రెసిపీ అవుతుంది. మరి దాని తయారీ, కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు చుద్దాం.
కావాల్సిన పదార్థాలు
* శనగపిండి - 1 కప్పు
* వాము - చిటికెడు
* కరివేపాకు - 7 నుంచి 8 రెబ్బలు
* పసుపు - అర టీ స్పూన్
* ఉప్పు - రుచికి తగినంత
* నీళ్లు - పిండి మిశ్రమానికి సరిపడ
* ఆయిల్ - వేయించుకునేందుకు సరిపడ
* కారం - 1 స్పూన్
తయారీ విధానం
ఒక పెద్ద గిన్నెలో శనగ పిండి, వాము, పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలపండి. ఇలా చేయడం వల్ల పిండి ఎక్కువగా గడ్డలు కట్టకుండా ఉంటుంది. అనంతరం దానిలో నీరు పోసి.. ఉండలు లేకుండా బాగా కలపండి.
నాన్ స్టిక్ దోశ పాన్‌ను వేడి చేసి.. ఈ శనగ పిండి బ్యాటర్‌తో దోశను వేయండి. చుట్టూ నూనె పోసి ఉడికించండి. ఒకవైపు ఉడికిన తర్వాత.. మరోవైపు ఉడికించండి. అంతే సింపుల్ అండ్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రెడీ. మీరు ఈ పిండిలో పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, లేదా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు.