తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Puffed Rice Bun Dosa | చాలా సాఫ్ట్, ఎంతో టేస్ట్.. ముర్మురా బన్ దోశ రెసిపీ!

Puffed Rice Bun Dosa | చాలా సాఫ్ట్, ఎంతో టేస్ట్.. ముర్మురా బన్ దోశ రెసిపీ!

HT Telugu Desk HT Telugu

02 June 2022, 8:28 IST

    • ఉదయంవేళ మీకు అస్సలు తీరిక లేకుండా ఉంటే త్వరగా కేవలం 10 నిమిషాల్లో సిద్ధం చేసుకునే ముర్మురా బన్ దోశ రెసిపీ ఇక్కడ ఉంది.
Puffed ice Dosa
Puffed ice Dosa (iStock)

Puffed ice Dosa

మనలో చాలా మందికి ఉదయం పూట తీరకలేని షెడ్యూల్ ఉంటుంది. ఓపికగా అల్పాహారం తయారు చేసుకుని తినడానికి కూడా తగినంత సమయం లభించదు. కానీ. అల్పాహారం చేయడం తప్పనిసరి లేనిపక్షంలో నీరసంగా ఉంటుంది. ఏకాగ్రతగా పనిచేయలేము. మీకు సులభంగా త్వరతగతిన చేసుకోగలిగే అల్పాహారాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి మరమరాల్ల బన్ దోశ. దీనినే ప్యాలాల దోశ, పఫ్డ్ రైస్ దోశ అని కూడా అంటారు. ఎంతో మృదువుగా, రుచికరంగా ఉంటుంది ఈ వంటకం.

ఈ బన్ దోశ చేసుకోవడం కూడా చాలా ఈజీ, కేవలం 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. అంతేకాదు ఎంతో తేలికైన ఆహారం కూడా. సులభంగా జీర్ణం అవుతుంది, వెంటనే శక్తి లభిస్తుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలేమి, ఎలా తయారుచేసుకోవాలి అనేది రెసిపీ కింద ఇచ్చాము. మీరు కూడా తప్పకుండా బన్ దోశ చేసుకోండి.

ముర్మురా బన్ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు

  • మరమరాళ్లు/ప్యాలాలు - 2 కప్పులు
  • రవ్వ - 1 కప్పు
  • పుల్లని పెరుగు - 1 కప్పు
  • ఉప్పు - 1 స్పూన్
  • ఈనో లేదా బేకింగ్ సోడా- 1/2 టీస్పూన్
  • నూనె - 2 స్పూన్
  • ఆవాలు - 1 tsp
  • మినప పప్పు - 1 స్పూన్
  • తరిగిన పచ్చిమిర్చి - 3
  • తరిగిన కరివేపాకు- 1 టీస్పూన్

తయారీ విధానం

  1. ముందుగా ప్యాలాలను మిక్సీలో వేసి పొడిగా మార్చుకోవాలి. ఈ పొడిలో రవ్వను కలుపుకోవాలి. అనంతరం పుల్లని పెరుగు, అలాగే ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. పెరుగు పుల్లగా లేకపోతే కొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్చు.
  2. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని కొన్ని నీళ్లు పోసుకుంటూ దోశ బ్యాటర్ లాగా చేసుకొని 15 నిమిషాలు పక్కనపెట్టండి.
  3. ఇప్పుడు పోపుకోసం చిన్నగిన్నె తీసుకొని అందులో నూనె వేడిచేసి. ఆవాలు, మినపపప్పు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన కరివేపాకు వేసి కొద్దిగా వేయించాలి. అనంతరం ఈ పోపును దోశ బ్యాటర్లో వేసి కలపాలి.
  4. ఇప్పుడు దోశ బ్యాటర్ మరింత మృదువుగా మారడానికి ఒక చిన్న ఈనో ప్యాకెట్ లేదా అర చెంచా వంటసోడ వేసి కొద్దిగా నీళ్లుపోసుకొని కలుపుకోవాలి.
  5. ఇప్పుడు పాన్ తీసుకొని స్టవ్ మీద వేడిచేసి కొద్దిగా నూనె అద్దె పైన చేసుకున్న బ్యాటర్‌తో బన్ సైజులో సెట్ దోశలాగా దోశలు చేసుకోవాలి.

ఇలా తయారైన దోశలు ఎంతో స్పాంజీగా, ఎంతో మృదువుగా ఉండటమే కాకుండా చట్నీతో కలిపి తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి.

టాపిక్

తదుపరి వ్యాసం