తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mango Curry | మామిడికాయ కూర.. ఒక్కసారి తింటే ఎప్పటికీ మరిచిపోరు!

Mango Curry | మామిడికాయ కూర.. ఒక్కసారి తింటే ఎప్పటికీ మరిచిపోరు!

HT Telugu Desk HT Telugu

09 June 2022, 20:26 IST

    • మ్యాంగో జ్యూస్, మామిడి కాయ తొక్కు మీకు తెలిసిందే. కానీ మామిడితో పులుసు పెట్టుకొని కూర చేసుకొని తింటేనే ఆ టేస్టు వాళ్లు, వీళ్లు చెప్పడమే గానీ ఎవరికీ తెలియదు. మీకు తెలియాలంటే.. ఇక్కడ రెసిపీ ఇచ్చాం, వండుకొని తినండి.
Mango Curry
Mango Curry (stock photo)

Mango Curry

మీ అందరికీ మామిడి కాయ పప్పు తెలుసు, మామిడి కాయ తొక్కు తెలుసు. కానీ మామిడికాయ కూర గురించి ఎప్పుడైనా విన్నారా? కొద్దిగా పులుపు కోసం మామిడి కాయలను పప్పుల్లో, కూరల్లో వేయడం మీరు చూసే ఉంటారు. కానీ ఇది అచ్చంగా మామిడి కాయలతోనే చేసే వంటకం. ఇది ఎక్కువగా కేరళలో వండుతారు. దీనిని అక్కడ మామిడి పులిస్సేరీ/ మాంబజా పులిస్సేరి అంటారు. ఈ కూరలో మంచి గ్రేవీ ఉంటుంది. మసాలా కూడా ఉంటుంది. తింటే పుల్లపుల్లగా, కారంకారంగా ఎంతో రుచిగా కూడా ఉంటుంది.

మీకు ఇక్కడ ఆ రుచికరమైన మామిడి కాయ కూర రెసిపీని అందిస్తున్నాం. ఇప్పుడు మామిడి కాయల సీజన్ అయిపోతుంది. ఇంకొన్ని రోజులైతే మామిడి కాయలు దొరకకపోవచ్చు. హైబ్రిడ్ మామిడి కాయలైతే దొరుకుతాయనుకోండి. కానీ అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ మామిడి కాయ కూర రుచి చూడకపోతే మళ్లీ సంవత్సర కాలం ఆగాల్సి వస్తుంది. అందుకే వీలైనంత త్వరగా ఈ విభిన్నమైన కూర రుచిని ఆస్వాదించండి.

మరి మామిడి కాయ కూరకు కావాల్సిన పదార్థాలేమిటి? ఎలా తయారుచేసుకోవాలో కింద పేర్కొన్నాం. చూడండి..

మామిడి కాయ కూర (మామిడి పులిస్సేరీ) కు కావాల్సినవి

  • 2 మామిడి కాయలు, తరిగినవి
  • 2 కప్పులు కొబ్బరి తురుము
  • 1 స్పూన్ పసుపు పొడి
  • 2 కప్పుల పెరుగు
  • 2 పచ్చి మిరపకాయలు
  • 2 ఎండు మిరపకాయలు
  • 1 స్పూన్ జీలకర్ర
  • 1 స్పూన్ ఆవాలు
  • 8-10 కరివేపాకు ఆకులు
  • పోపు కోసం నూనె
  • ఉప్పు తగినంత
  • 2 స్పూన్ల బెల్లం పొడి (మామిడి మరీ పుల్లగా ఉంటే)

తయారీ విధానం

  1. ముందుగా కొబ్బరి, పసుపు, జీలకర్ర, పచ్చిమిర్చిలను ఒక కటోరీలో తీసుకొని కొన్ని నీళ్లతో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి.
  2. ఒక కడాయిలో ఒక టీస్పూన్ నూనెను వేడి చేయండి. ఇందులో పేస్ట్‌లా చేసుకున్న మిశ్రమాన్ని వేసి 2-4 నిమిషాల పాటు ఉడకబెట్టండి.
  3. ఆపై ఉప్పు, పెరుగు, కొద్దిగా నీళ్లు వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
  4. ఇప్పుడు మరుగుతున్న రసంలో మామిడి కాయ ముక్కలను వేసి 5-7 నిమిషాలు ఉడకనివ్వండి.
  5. మరొక పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేడిచేయండి. ఇందులో ఎర్ర మిరపకాయలు, ఆవాలు, కరివేపాకును వేయించుకోవాలి.
  6. ఈ పోపును ఉడుకుతున్న కూరలో వేయాలి. అనంతరం దించేయాలి.

వేడివేడి మామిడికాయ కూర రెడీ. దీనిని అన్నంలో కలుపుకొని తినవచ్చు. లేదా రోటీ, పరోటాలతో అద్దుకొని తినవచ్చు.

ఈ మామిడి పులిస్సేరీ కూరను నిజానికి మామిడి పండ్లతో తయారు చేస్తారు. కానీ అది రుచిలో కొంచెం తీపిగా ఉంటుంది. అలా వద్దు అనుకునేవారు ఇలా చేసుకోవాలి.

టాపిక్