తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Living Room Curtains: హాల్ కోసం పరదాలు కొనేప్పుడు వీటిని ఆలోచించాల్సిందే..

Living room curtains: హాల్ కోసం పరదాలు కొనేప్పుడు వీటిని ఆలోచించాల్సిందే..

HT Telugu Desk HT Telugu

18 September 2023, 16:30 IST

  • Living room curtains:హాల్ కోసం పరదాలు కొనేటప్పుడు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి. అప్పుడే అందంతో పాటూ సౌకర్యం కూడా. ఆ సలహాలేంటో చేసేయండి. 

కర్టెయిన్లు ఎంచుకునేటప్పుడు చిట్కాలు
కర్టెయిన్లు ఎంచుకునేటప్పుడు చిట్కాలు (pexels)

కర్టెయిన్లు ఎంచుకునేటప్పుడు చిట్కాలు

ఇంటిని అలంకరించుకోవడంలో కర్టెన్ల పాత్ర కీలకం. మన ఇంటీరియర్‌కి, గోడల రంగులకు, మన అవసరాలకు తగినట్లుగా వాటిని ఎంపిక చేసుకోవాలి. అప్పుడే ఇంటి అందం రెట్టింపవుతుంది. సౌకర్యంగానూ ఉంటుంది. అన్ని గదుల్లో సంగతి ఒక ఎత్తయితే హాల్లో ఎలాంటి కర్టెన్లను ఎంచుకోవాలి? అనే విషయంలో అవగాహనతో ఉండాలి. హాల్‌ అనేది మనకు, అతిథులకు, బయట నుంచి వచ్చిన వారికి.. ఇలా అందరి కోసం ఏర్పాటు చేసుకున్న స్థలం. కాబట్టి ఇక్కడ ఎంపికలో కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. అవేంటంటే..

  • హాల్లో కిటికీలు ఎంత పెద్దగా ఉన్నాయి? వాటి నుంచి మనం బయట వారికి ఎక్కువగా కనిపిస్తామా? అన్న విషయాన్ని గ్రహించాలి. ఒక వేళ మనం రోడ్డుపైన వారికి ఎక్కువగా కనిపించేట్లు ఉన్నట్లయితే అందుకు తగినట్లుగా మందపాటి కర్టెన్లను ఎంచుకోవాలి. కర్టెన్లకు బదులుగా ఇప్పుడు రకరకాల డిజైనర్‌ బ్లైండ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్‌ని బట్టి వాటినీ ప్రయత్నించవచ్చు. ఇవి పూర్తిగా కాంతిని ఆపేస్తాయి. బయట వారికి మనం కనిపించడాన్ని నిరోధిస్తాయి. ఈ ఇబ్బంది లేకపోతే గనుక హాల్‌ని ఎప్పుడూ ఎక్కువ వెలుతురు వచ్చే విధంగానే ఉంచుకోవాలి. అందుకని సెమీ ట్రాన్సపరెంట్‌ పరదాలను ఎంపిక చేసుకోవాలి. అవి మన ఇంటీరియర్‌కి, రంగులకి నప్పే రంగుల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • కిటికీ సైజు బాగా వెడల్పుగా ఉంటే అప్పుడు అంతా ఒకటే ప్రింట్‌ని తీసుకోవడం అంత బాగుండదు. బదులుగా రెండు ప్రింటెడ్‌ కర్టెన్ల మధ్యలో ఒక సాదా కాంట్రాస్ట్‌ కలర్ పరదాను ఎంపిక చేసుకోవాలి.
  • అలాగే చాలా ఇళ్లల్లో హాల్‌, డైనింగ్‌ రూం మధ్యలో గోడలు ఉండవు. అలాంటప్పుడు భోజనం చేసే వారు హాల్లోకి నేరుగా కనిపిస్తూ ఉంటారు. దీని కోసం ఇక్కడ రెండు డిజైనర్‌ కర్టెన్లను ఎంపిక చేసుకోవచ్చు. ఒకటేమో మొత్తం ట్రాన్సపరెంట్గా ఉండాలి. ఒకటేమో మొత్తం కనిపించకుండా దళసరిగా ఉండాలి. ఇలా రెండింటినీ కలిపి ఒకటే కర్టెన్లా కుట్టించుకోవాలి. అప్పుడు ఇంట్లో వాళ్లే ఉన్నప్పుడు ట్రాన్సపరెంట్‌ కర్టెన్‌ని వాడుకుని దళసరిగా ఉన్న దాన్ని టై చేసి పక్కన వేలాడేలా ఉంచుకోవచ్చు. అదే హాల్లో ఎవరైనా అతిథులు ఉన్నారని అనుకున్నప్పుడు దళసరి కర్టెన్‌ టై తీసేసి వాడుకోవచ్చు.
  • హాల్లో ఉండే గుమ్మాలకు కర్టెన్లను ఎంపిక చేసేప్పుడు అవి మరీ నేలకు తగిలేలా ఉండకూడదు. ఓ రెండించులైనా పైకే ఉండేలా కొలతలు తీసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో వాక్యూమ్‌ రోబోల్లాంటివి వాడినా, తడిగుడ్డ చేతితో పెట్టుకోవడానికైనా అవి అడ్డం తగులుతూ ఉంటాయి.

తదుపరి వ్యాసం