Eggs Eating: ప్రతిరోజూ గుడ్లను తినే వారిలో ఆ సమస్య వచ్చే అవకాశం తక్కువ, ఇంకెందుకు ఆలస్యం రోజూ తినేయండి
27 March 2024, 8:00 IST
- Eggs Eating: కోడి గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయినా కూడా కొంతమంది ప్రతిరోజూ గుడ్డు తినడాన్ని ఇష్టపడరు. నిజానికి ప్రతిరోజూ గుడ్డు తినడం వల్ల ఆర్థరైటిస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
కోడిగుడ్లతో ఆరోగ్యం
Eggs Eating: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అయితే ప్రతిరోజూ గుడ్లను తినడం అలవాటు చేసుకోండి. కొత్త అధ్యయనం చెబుతున్న ప్రకారం ఎవరైతే ప్రతిరోజూ గుడ్లను తింటారో వారికి కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు ఉదయం ఒక గుడ్డు, సాయంత్రం ఒక గుడ్డు ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.
ఆర్ధరైటిస్ అదుపులో
గుడ్లు కేవలం ప్రోటీన్ అందించడమే కాదు, మన శరీరాన్ని ఎన్నో రోగాల నుంచి కాపాడుతుంది. మన మానసిక శారీరక ఆరోగ్యాన్ని పెంచడానికి గుడ్డు సహాయపడుతుంది. ఒక గుడ్డు తింటే చాలు గుండెకు అవసరమైన పొటాషియం, ఫోలేట్, బి విటమిన్లు పుష్కలంగా అందుతాయి. అయితే కొత్త అధ్యయనం ప్రకారం గుడ్డును తినడం వల్ల ఆర్థరైటిస్ వంటి సమస్యలు కూడా అదుపులో ఉంటాయి.
ఆర్ధరైటిస్ అంటే...
ఆర్థరైటిస్ అంటే బోలు ఎముకల వ్యాధి. ఇది ఎముకలను ఇబ్బంది పెడుతుంది. కీళ్ల నొప్పులను పెంచుతుంది. ఎముక సాంద్రత, ద్రవ్యరాశిని కోల్పోతుంది. అంటే బలహీనంగా మారుతుంది. దీనివల్లే అవి నొప్పులు పెడుతూ ఉంటాయి. ఎముకల్లో బలం తగ్గడం వల్ల పగుళ్లు కూడా ఏర్పడవచ్చు కాబట్టి ఆర్థరైటిస్ వంటి వ్యాధులను తేలికగా తీసుకోకూడదు. దాని బారిన పడకుండా ఉండాలన్నా, ఆ నొప్పులను భరించే శక్తి కావాలన్నా ప్రతిరోజూ గుడ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఈ అధ్యయనంలో భాగంగా దాదాపు 19 వేల మందిపై పరిశోధన నిర్వహించారు. వారిలో గుడ్డు తినేవారు, గుడ్డు తినని వారు అని రెండు విభాగాలుగా చేశారు. ప్రతిరోజూ రెండు పెద్ద గుడ్లు తినే వారితో పోలిస్తే... తినని వారిలో కీళ్లవ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ప్రతిరోజూ రెండు గుడ్లు తినే వారిలో ఎముక సాంద్రత అధికంగా ఉంది. దీనివల్ల వారికి కీళ్ల నొప్పులు వంటివి రాకుండా ఉంటాయి.
ముఖ్యంగా వృద్ధులు కచ్చితంగా గుడ్లను తినాలి. వారికి ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వయసు పెరిగా కొద్దీ ఎముకలు బలహీనంగా మారుతాయి. అలాగే ఈస్ట్రోజన్ స్థాయిలు మహిళల్లో తగ్గిపోతూ ఉంటాయి. దీనివల్ల వృద్ధులకు అధికంగా కీళ్లనొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తగినంత పోషకాహారం లేకపోవడం, శారీరక శ్రమ తక్కువగా ఉండడం, ధూమపానం, మద్యపానం వంటివి చేయడం కూడా ఆర్థరైటిస్ రావడానికి కారణం.
ప్రతిరోజూ గుడ్లు తింటే వాటిల్లో ఉండే ప్రోటీన్, ఆల్కలీన్ ఫాస్పేటేస్ వంటివి ఎముకలను బలంగా మారుస్తాయి. ఆల్కలిన్ ఫాస్పేటేస్ అనేది కాలేయం, ఎముకలు, మూత్రపిండాలు వంటి వాటిలో ఉండే ఎంజైమ్‌లు. ఇవి ఎముక జీవక్రియకు చాలా అవసరం. తొడ ఎముకలో ఈ ఆల్కలీన్ ఫాస్పేటేస్ అధికంగా ఉండాలి. అలాగే నడుము, వెన్నెముకలో కూడా ఇది చాలా అత్యవసరం. గుడ్డు తినడం వల్ల తొడ ఎముక, నడుము, వెన్నుముకలో ఈ ఎంజైములు ఉత్పత్తి అధికంగా ఉంటుంది. కాబట్టి కీళ్ల నొప్పుల బారిన పడకుండా ఉండాలంటే ఈరోజు నుంచే ఉదయం ఒకటి, రాత్రి ఒకటి గుడ్డు తినడం అలవాటు చేసుకోండి.