First Aid: మీ ఎదురుగా ఎవరికైనా కరెంట్ షాక్ కొడితే వెంటనే చేయాల్సిన ప్రథమ చికిత్స ఇదే
26 April 2024, 7:00 IST
- First Aid: మీ ఎదురుగా ఎవరికైనా కరెంట్ షాక్ కొడితే ఏం చేయాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కొన్ని రకాల ప్రాథమిక చికిత్సల వల్ల ఎదుటివారి ప్రాణాన్ని కాపాడగలిగిన వారమవుతాము.
కరెంట్ షాక్ కొడితే చేయాల్సిన ప్రథమ చికిత్స
First Aid: ఏదో ఒక ప్రమాదం జరగడం, అలాంటి సమయాల్లో మనం సహాయం చేయాల్సి రావడం వంటి ఘటనలు ఎప్పుడైనా జరగవచ్చు. ముఖ్యంగా ఎవరైనా కరెంటు షాక్ కు గురైతే వెంటనే మీరు ఏం చేయాలో తెలుసుకోండి.
కరెంట్ షాక్ తగిలితే ప్రథమ చికిత్స ఇలా...
మీ ఎదురుగా ఎవరికైనా కరెంట్ షాక్ కొడితే వెంటనే పవర్ బటన్ స్విచ్ ఆఫ్ చేయండి. చీపురు లేదా చెక్కతో ఆ మనిషి నుండి విద్యుత్ కనెక్షన్ ను దూరం చేయండి. అలాగే అతనికి శ్వాస ఆగుతుందో లేదో చూడండి. గుండె కొట్టుకుంటుందో లేదో కూడా పరిశీలించండి. శ్వాస తీసుకోకపోయినా, గుండె కొట్టుకోకపోయినా వెంటనే CPR చేయండి. అంటే గుండె మధ్యలో రెండు చేతులతో వేగంగా నొక్కండి.
కాలిన గాయాలు కనిపిస్తే వెంటనే ఆ గాయాలపై నీటిని వేయండి. వారికి గాలి తగిలేలాగా చూడండి. అంతా చుట్టూ మూగిపోతే వారికి గాలి తగలక శ్వాస ఆడక... గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.
విద్యుత్ షాక్‌కు గురైనప్పుడు వారికి శరీరంలో ఏ భాగంలో మొదట కరెంటు ప్రయాణం మొదలైందో... దాన్నిబట్టి అంతర్గత అవయవాలపై ప్రభావం పడుతుంది. ఉదాహరణకు రెండు చేతుల్లో కరెంటు వైర్ పట్టుకుంటే మొదటగా కరెంటు ఊపిరితిత్తులు, గుండె వంటి వాటిపై ప్రభావం చూపుతుంది. అదే కరెంటు వైర్ తలకు తాకినట్లయితే ఆ కరెంట్ షాక్ ప్రభావం పొట్ట, మూత్రాశయం వంటి అవయవాలపై ఎక్కువగా పడుతుంది. అలాగే ఊపిరితిత్తులు, గుండె కూడా ఎంతో కొంత ప్రభావితం అవుతాయి. కరెంట్ షాక్ కొట్టిన తర్వాత వెంటనే ఆ వ్యక్తిని వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలి.
కరెంట్ షాక్ కొట్టిన వ్యక్తిని పడుకోబెట్టి అతని కాళ్లని కాస్త పైకి లేపి, తలను కాస్త కిందకి ఉంచేలా చూడాలి. కాలిన గాయాలయితే పరిశుభ్రమైన వస్త్రంతో కప్పాలి. ఆ గాయాలపై దుమ్ము ధూళి పడి ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రసరించిన కరెంటు ఎక్కువ వోల్టేజ్ తో ఉంటే మాత్రం ఆ వ్యక్తిని కాపాడడం కాస్త కష్టమే. కాబట్టి ముందు జాగ్రత్తగా ఏ వైర్లను తాకకుండా ఉండాలి. తడిచేతులు, తడి కాళ్లతో కరెంట్ వైర్లు జోలికి వెళ్లకూడదు. వీలైనంతగా ఎవరి జాగ్రత్తలో వారు ఉండడం చాలా మంచిది.
టాపిక్