Yoga Pose for Belly Fat: పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించగల యోగాసనం ఇది.. చేయడం సులభం
02 December 2024, 6:01 IST
- Yoga Pose for Belly Fat: పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతే ఆరోగ్యానికి చేటు చేస్తుంది. వ్యాధుల రిస్క్ పెరుగుతుంది. ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు ఓ సులభమైన యోగాసనం తోడ్పడుతుంది. ఆ ఆసనం వివరాలు ఇవే.
Yoga Pose for Belly Fat: పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించగల యోగాసనం ఇది.. చేయడం సులభం
పొట్ట చుట్టూ కొవ్వు (బెల్లీ ఫ్యాట్) అధికమైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. గుండె వ్యాధులు లాంటి దీర్ఘ కాలిక సమస్యల రిస్క్ అధికం అవుతుంది. బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే బెల్లీ ఫ్యాట్ ఉంటే.. అది కరిగేందుకు సరైన డైట్, వ్యాయామాలు చేయాలి. ఈ బెల్లీ ఫ్యాట్ కరిగేందుకు ఓ యోగాసనం కూడా తోడ్పడుతుంది. ఈ సులువైన ఆసనం.. పొట్ట చుట్టూ కొవ్వు కరిగేలా సహకరిస్తుంది. అదే 'భుజంగాసనం'. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
భుజంగాసనం ఇలా చేయాలి
- భుజంగాసనం వేసేందుకు ముందుగా ఓ చోట బోర్లా పడుకోవాలి. కడుపు, మోకాళ్లు నేలకు అనేలా కాళ్లు స్ట్రైట్‍గా ఉంచాలి.
- చేతులను ముందుకు చాపాలి. ఆ తర్వాత మోచేతులను వంచి.. అరచేతులను భుజాల వద్దకు తేవాలి.
- అరచేతులపై భారం వేస్తూ శరీర ముందు భాగాన్ని పైకి లేపాలి. నడుము వరకు బాడీనిపైకి లేపాలి.
- అలా శరీర ముందు భాగాన్ని పైకి లేపాక పైకి చూడాలి. శ్వాసను గాఢంగా తీసుకొని.. వదలాలి. అలాగే మీ శరీరం సహకరించినంత సేపు ఇదే భంగిమలో ఉండాలి.
- ఆ తర్వాత మెడను కిందికి వంచి.. రెండు చేతులను ముందుకు చాచి బోర్లా పడుకునే స్థితికి రావాలి. మళ్లీ ఈ ఆసనాన్ని రిపీట్ చేయాలి. నాగుపాము పడగ ఎత్తినట్టుగా ఈ ఆసనం ఉంటుంది. అందుకే దీన్ని కోబ్రా (నాగుపాము) ఆసనం అని కూడా అంటారు.
బెల్లీ ఫ్యాట్ తగ్గుదల
భుజంగాసనం వేసే సమయంలో కడుపుపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీంతో పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగేందుకు ఆ ఆసనం తోడ్పడుతుంది. ఇలా బరువు తగ్గేందుకుక కూడా ఈ ఆసనం తోడ్పడుతుంది. ఈ సులువైన ఆససాన్ని ప్రతీ రోజు సాధన చేస్తే బెల్లీ ఫ్యాట్ తగ్గే అవకాశాలు ఉంటాయి.
జీర్ణక్రియ మెరుగు
కడుపులో ఉబ్బరం, నొప్పి, మలబద్ధకం, అజీర్తి లాంటి సమస్యలు ఉన్న వారు ప్రతీ రోజు ఈ భుజంగాసనం చేయడం మంచిది. జీర్ణవ్యవస్థను ఈ ఆసనం మెరుగుపరుస్తుంది. పొత్తికడుపుపై ఒత్తిడి పడడం వల్ల జీర్ణవ్యవస్థలోని అవయవాలు ప్రేరేపితమవుతాయి. జీర్ణం మెరుగుదల వల్ల కూడా బరువు తగ్గేందుకు ఈ ఆసనం సహకరిస్తుంది.
కండరాల దృఢత్వం
భుజంగాసనం రెగ్యులర్‌గా చేస్తే శరీరం ఫ్లెక్సిబుల్‍గా మారుతుంది. చాలా నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. పొట్ట, భుజాలు, వెన్ను సహా వివిధ భాగాల వద్ద కండరాల దృఢత్వం పెరుగుతుంది. రోజుకు రెండుసార్లు భుజంగాసనం వేయడం మేలు.
నడుము నొప్పి
ఒకే చోట చాలాసేపు కూర్చోవడం వల్ల నడుము నొప్పి వస్తుంది. ఇది బెల్లీ ఫ్యాట్‍కు కూడా కారణం అవుతుంది. భుజంగాసనం సాధన చేయడం వల్ల నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఆసనంలో వెన్ను స్ట్రెచ్ అవుతుంది. దీంతో నడుము నొప్పి నుంచి ఉపశమనం దక్కుతుంది.
మానసిక ఒత్తిడి తగ్గుతుంది
భుజంగాసనం వేయడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన లాంటివి కూడా తగ్గుతాయి. ఏకాగ్రత పెరగడంతో పాటు మూడ్ బాగా ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి.
గర్భిణులు ఈ భుజంగాసనం వేయకూడదు. పొత్తి కడుపుపై భారం పడడమే ఇందుకు కారణం. ఇటీవలే పొత్తికడుపు సంబంధిత శస్త్రచికిత్స అయినా ఈ ఆసనం వద్దు. పక్కటెముకలు, మణికట్టు సమస్యలు ఉన్న వారికి కూడా ఈ ఆసనం సరిపడదు. ఈ సమస్యలు లేని అందరూ ఈ ఆసనం రెగ్యులర్‌గా వేయవచ్చు.
టాపిక్