Car Re-registration | సెకండ్ హ్యాండ్ కారు రీ-రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి!
28 February 2022, 14:18 IST
- Car Re-registration.. కొత్త కారు కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం సదరు షోరూమ్ చూసుకుంటుంది. అయితే సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలు ఎక్కువైన ఈ సమయంలో.. కారును రీ రిజిస్ట్రేషన్ చేయించాల్సి వస్తోంది. అంటే కారు ఒకరి పేరు మీది నుంచి మరొకరి పేరు మీదికి మార్చుకోవడం.
కారు రీ-రిజిస్ట్రేషన్.. ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి
ఈ ప్రక్రియను కూడా హైదరాబాద్‌లోని కొన్ని సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్‌లు చూసుకుంటున్నాయి. అయితే మీరు తెలిసిన వాళ్ల దగ్గర లేదంటే కారు రిజిస్ట్రేషన్ బాధ్యత కొన్నవాళ్లదే అయిన సంద్భంలో దానిని రీ రిజిస్ట్రేషన్ ఎలా చేయించాలి? దీనికి అవసరమైన డాక్యుమెంట్లు ఏవి అన్న విషయాలు కొందరికీ తెలియవు. ఇప్పుడు చెప్పబోయే సూచనలు పాటించి.. సెకండ్ హ్యాండ్ కారు రిజిస్ట్రేషన్‌ను సులువుగా పూర్తి చేసుకోండి.
ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ ఎలా?
సెకండ్ హ్యాండ్ కారు కొంటున్న సమయంలో ఆ కారు ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం కారు కొన్న 30 రోజుల్లోపు మీరు స్థానిక ఆర్టీవోలో దరఖాస్తు చేసుకోవాలి.
- ఒకవేళ కారు ఒక ఆర్టీవో నుంచి మరో ఆర్టీవో పరిధిలోకి ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటే.. ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) తీసుకోవాల్సి ఉంటుంది. కారు కొన్న వ్యక్తే ఆ కారును మొదట రిజిస్ట్రేషన్ చేసిన ఆర్టీవో దగ్గరికి వెళ్లి ఈ సర్టిఫికెట్ పొందాలి. ఆ తర్వాత ఆ ఆర్టీవో పరిధిలో కారు డీరిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒకవేళ కారు ఒకే ఆర్టీవో పరిధిలో చేతులు మారితే ఎన్వోసీ అవసరం లేదు.
- ఒకసారి ఎన్వోసీ పొందిన తర్వాత మీ స్థానిక ఆర్టీవోకి ఈ కింది డాక్యుమెంట్లు తీసుకొని వెళ్లి ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ ప్రారంభించాలి.
ఒరిజినల్ ఆర్సీ
ఫార్మ్ 29 - రెండు కాపీలు, పూర్తిగా నింపి సంతకాలు చేయాలి
ఫార్మ్ 30 - రెండు కాపీలు, పూర్తిగా నింపి సంతకాలు చేయాలి
చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ కాపీ
చెల్లుబాటు అయ్యే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్
కారు కొన్న వ్యక్తి అడ్రెస్ ప్రూఫ్ (ఓటర్ ఐడీ/పాస్‌పోర్ట్/కరెంట్ బిల్లు/ఆధార్ కార్డు/ప్రభుత్వ బ్యాంకు ఖాతా బుక్కుల్లో ఏదో ఒకటి)
కారు అమ్మే వ్యక్తి ఐడీ ప్రూఫ్
కారు కొన్న వ్యక్తి పాస్‌పోర్ట్ సైజు ఫొటో
- ఈ డాక్యుమెంట్లను స్థానిక ఆర్టీవోలో ఇచ్చి.. పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కారు కొన్న వ్యక్తి బయోమెట్రిక్ వివరాలు, ఫొటో తీసుకుంటారు. ఆ రోజు లేదంటే మరుసటి రోజు కారు ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ పూర్తవుతుంది. ఆ కొత్త ఆర్సీని మీరు ఆర్టీఏ ఎం-వాలెట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కార్డు రావడానికి 15 రోజుల నుంచి నెల రోజుల సమయం పడుతుంది.
వేరే రాష్ట్రం నుంచి కారు కొంటే..
కారును మరో రాష్ట్రం నుంచి కొనుగోలు చేస్తే మొదట ఇంటర్‌స్టేట్ ట్రాన్స్‌ఫర్ పూర్తి చేసిన తర్వాతే రీరిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాలి. దీనికోసం కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటో చూద్దాం.
కారు కొన్న రాష్ట్రానికి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ
ఫార్మ్ 20
అంతకుముందు ఆర్టీవో నుంచి ఎన్వోసీ
ఫార్మ్ 27
ఫార్మ్ 33
అడ్రెస్ ఫ్రూఫ్ అటెస్ట్ చేసిన కాపీ
కారు ఓనర్ డ్రైవింగ్ లైసెన్స్ కాపీ
పీయూసీ సర్టిఫికెట్ కాపీ
పాన్ కార్డు, ఫార్మ్ 60 లేదా ఫార్మ్ 61
దరఖాస్తుదారు పాస్‌పోర్ట్ సైజు ఫొటో
కారు లోన్‌లో ఉంటే.. రుణం ఇచ్చిన బ్యాంకు నుంచి ఎన్వోసీ
ఈ డాక్యుమెంట్లను స్థానిక ఆర్టీవోలో సమర్పిస్తే.. 30 రోజుల్లో మీరు కొన్న కారుకు స్థానిక రాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు.
- మరో రాష్ట్రం నుంచి కారు కొంటే.. స్థానిక రాష్ట్ర ఆర్టీవోకు రోడ్డు ట్యాక్సు కూడా చెల్లించాల్సి ఉంటుంది. కారు కొన్ని ఒరిజినల్ ఇన్వాయిస్ ఆధారంగా ఈ రోడ్డు ట్యాక్స్ ఉంటుంది. దీనిని డీడీ ద్వారా చెల్లించాలి. అంతకుముందు రోడ్డు ట్యాక్స్ కట్టిన రాష్ట్రం నుంచి దానిని క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనికోసం..
రోడ్డు ట్యాక్స్ రీఫండ్ అప్లికేషన్
ఉద్యోగం చేస్తున్న సంస్థ ఇచ్చిన ఫార్మ్ 16
కొత్త రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) కాపీ
పాత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కాపీ
కొత్త రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉన్న ఇన్సూరెన్స్ పాలసీ
ఐడీ ప్రూఫ్, అడ్రెస్ ప్రూఫ్
ఇవన్నీ పాత రాష్ట్రంలో సమర్పించి అక్కడ కట్టిన రోడ్డు ట్యాక్స్ రీఫండ్ కోరవచ్చు. అయితే అప్పటికే కారు కొన్నేళ్లు తిరిగి ఉంటే.. మొదట కట్టిన మొత్తంలో నుంచి ఆ మేరకు కోత విధించి మిగతా మొత్తం ఇస్తారు.