తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Second Hand Car | సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనేటప్పుడు ఈ 6 జాగ్రత్తలు పాటించండి

Second Hand Car | సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనేటప్పుడు ఈ 6 జాగ్రత్తలు పాటించండి

Hari Prasad S HT Telugu

30 January 2022, 10:49 IST

    • ఒకవేళ మీరు సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనాలనుకుంటే.. చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కారు చూసినప్పటి నుంచి డబ్బు చెల్లించే వరకూ మీరు మోసపోకూడదని అనుకుంటే.. ఇప్పుడు చెప్పబోయే జాగ్రత్తలను మీరు కచ్చితంగా పాటించాల్సిందే.
సెకండ్ హ్యాండ్ కార్లకు క్రమంగా పెరుగుతున్న డిమాండ్
సెకండ్ హ్యాండ్ కార్లకు క్రమంగా పెరుగుతున్న డిమాండ్

సెకండ్ హ్యాండ్ కార్లకు క్రమంగా పెరుగుతున్న డిమాండ్

Second Hand Car | కారు ఒకప్పుడు లగ్జరీ. ఇప్పుడు కామనైపోయింది. దేశంలోని మధ్యతరగతి వాళ్లు కూడా ఇప్పుడు కార్లలో దర్జాగా తిరుగుతున్నారంటే దానికి కారణం సెకండ్‌ హ్యాండ్‌ కార్లే. కొత్త కారు కొనే స్థోమత లేని వాళ్లు సెకండ్‌ హ్యాండ్‌ కార్ల వైపు చూస్తున్నారు. ఇలాంటి కార్లు ఒకప్పుడు తెలిసిన వాళ్ల దగ్గర కొనేవాళ్లు. అయితే ఇప్పుడు ఆ అవసరం లేదు. కొత్త కార్లు అమ్మే షోరూమ్‌లు ఉన్నట్లే.. సెకండ్‌ హ్యాండ్‌ కార్లను అమ్మడానికి కూడా ఇబ్బడిముబ్బడిగా షోరూమ్‌లు వెలిశాయి. ఇందులో కొన్ని ఎంతో నమ్మకంగా వినియోగదారులకు సేవలందిస్తుండగా.. మరికొందరు కార్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. 

1. ఆన్‌లైన్‌లోనే కార్లు.. కానీ..

ఇప్పుడన్నీ ఆన్‌లైనే కదా. ఇంట్లో కూర్చొనే కిరాణా సామాను నుంచి ఎలక్ట్రానిక్స్‌, కార్ల వరకూ అన్ని షాపింగ్‌లూ చేసేస్తున్నారు. కొత్త కార్లకే కాదు ఇప్పుడు సెకండ్‌ హ్యాండ్‌ కార్ల కోసం కూడా ఎన్నో ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లు ఉన్నాయి. వాటిలో అందుబాటులో ఉన్న సెకండ్‌ హ్యాండ్‌ కార్ల వివరాలు అన్నీ ఉంటాయి. కారు ఫొటోలు, దానిని ఎప్పుడు తయారు చేశారు? ఎప్పుడు రిజిస్ట్రేషన్‌ చేశారు? ఇప్పటి వరకూ ఎన్ని చేతులు మారింది? ఎంత తిరిగింది? ఎలాంటి కండిషన్‌లో ఉంది? అన్న వివరాలతోపాటు కారుకు సంబంధించిన అన్ని ఫొటోలు కూడా అప్‌లోడ్‌ చేస్తున్నారు. 

అయితే ఈ వివరాలు అన్నీ ఉన్నాయి కదా అని.. ఆన్‌లైన్‌లోనే అన్నీ చేసినట్లు కారు షాపింగ్‌ చేసేయకండి. మీరు ఏ వెబ్‌సైట్‌లో మీకు నచ్చిన కారును చూశారో.. అక్కడికి నేరుగా వెళ్లండి. మీకు కారు గురించి పూర్తిగా తెలిస్తే ఒక్కరే వెళ్లినా నష్టం లేదు. అలా కాదంటే.. మీకు నమ్మకమైన మెకానిక్‌ను వెంట తీసుకెళ్లడం తప్పనిసరి. మనం కారు పైపైన చూస్తాం. మెకానిక్‌ అయితే.. కారు లోపలి సంగతి కూడా తెలుస్తుంది. అందుకే తెలిసిన మెకానిక్‌ వెంట ఉండటం మంచిది.

2. కారును పూర్తిగా చెక్ చేయండి

ఆన్‌లైన్‌లో కారుకు సంబంధించిన 360 డిగ్రీల ఫొటోలు పెడుతున్నారు. కారు బయట, లోపలకు సంబంధించిన అన్ని ఫొటోలు ఇందులో ఉంటాయి. వీటిని బట్టి కారుపై ఓ అంచనాకు రావచ్చు. అయితే నేరుగా వెళ్లినప్పుడు మాత్రం కారు అణువణువూ క్షుణ్నంగా తనిఖీ చేయండి. ఏవో చిన్నచిన్న స్క్రాచ్‌లు, డెంట్లు ఉంటే పెద్దగా నష్టం లేదు. కానీ పెద్దవి అంటే తుప్పు పట్టడంలాంటివి ఉంటే మాత్రం అస్సలు ఆ కారు జోలికి వెళ్లొద్దు. 

ఇక కారులో ఉన్న అన్ని ఎలక్ట్రికల్‌ పరికరాలు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో చూడండి. వీటిలో ఏవైనా చిన్నచిన్న లోపాలు ఉంటే.. వాటికి తగినట్లు మీరు కారు ధరను బేరమాడవచ్చు. అలాగే టైర్లు ఎలాంటి కండిషన్‌లో ఉన్నాయో కూడా చెక్‌ చేయండి. కొన్ని సెకండ్‌ హ్యాండ్‌ కార్లు అమ్మే షోరూమ్‌లో టైర్ల జీవితకాలం ఇంకా ఎంత ఉందో కూడా స్పష్టంగా చెబుతున్నాయి. ఒకవేళ టైర్లు మరీ పాతబడి ఉంటే.. దానిని బట్టి కూడా మీరు మరికాస్త బేరమాడవచ్చు.

3. డ్రైవ్ చేసిన తర్వాతే..

సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనడంలో అన్నింటి కంటే ముఖ్యమైనది టెస్ట్‌ డ్రైవ్‌. కారును నడిపి చూస్తేనే దాని అసలు రంగు బయటపడుతుంది. కారు కొనేవాళ్లే కాదు.. వెంట ఉండే వాళ్లు కూడా నడిపి చూడటం మంచిది. ఒకవేళ మీరు గుర్తించలేని లోపాలను కూడా మరొకరు గుర్తించే అవకాశం ఉంటుంది. ఇక టెస్ట్‌ డ్రైవ్ చేసే సమయంలో గేర్‌ రాడ్‌ సాఫీగా ఉందో లేదో చూసుకోండి. క్లచ్‌, బ్రేకులు, ఇంజిన్‌ శబ్దం వంటివి అన్నీ గమనించండి. కావాలంటే కారు స్టార్ట్‌ చేసి.. ముందు బానెట్‌ తెరిచి ఇంజిన్‌ శబ్దాన్ని వినండి. ఏవైనా వింత శబ్దాలు వస్తున్నాయేమో చూడండి. 

అలాగే వెనుక సైలెన్సర్‌లో నుంచి పొగ లేదా ఆయిల్‌ వంటివి ఏమైనా వస్తున్నాయేమో చూసుకోండి. క్లచ్‌ పట్టుకొని గేర్‌ వేసిన తర్వాత కారు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా ముందుకు సాగిపోతోందా లేదంటే ఏదో అడ్డుపడినట్లు అవుతుందా అన్నది చూడండి. అలాగే ఎలాంటి వైబ్రేషన్స్‌ కూడా ఉండకూడదు. కారును అన్ని వేగాల్లో నడిపి చూడటం మంచిది. ఇప్పుడు చాలా వరకూ షోరూమ్‌లు టెస్ట్‌ డ్రైవ్‌ కోసం హైదరాబాద్‌లాంటి నగరాల్లో ఇంటికే పంపిస్తున్నారు. అది కూడా ఎలాంటి అదనపు ఫీజు లేకుండా.

4. డాక్యుమెంట్లు.. తప్పనిసరి

ఇక సెకండ్ హ్యాండ్‌ కారు కొనే సమయంలో అన్నింటి కంటే ముఖ్యంగా చూడాల్సింది డాక్యుమెంట్లు. ఇవి పక్కాగా ఉన్నాయో లేదో చెక్‌ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ లేదా ఆర్సీ, ఇన్సూరెన్స్‌, పొల్యూషన్‌ కాగితాలు వంటివి చూడండి. రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌పై కారుకు సంబంధించిన అన్ని వివరాలు స్పష్టంగా ఉంటాయి. ఛాసిస్‌ నంబర్‌, ఇంజిన్‌ నంబర్‌, కారు తయారు చేసిన సంవత్సరం, రిజిస్ట్రేషన్‌ అయిన తేదీ, దాని వేలిడిటీలాంటివన్నీ ఉంటాయి. ఛాసిస్‌, ఇంజిన్‌ వివరాలు కారుతో సరిచూసుకోండి. డీలర్‌ నుంచి సెకండ్‌ హ్యాండ్‌ కారు కొంటుంటే.. కారు ఎవరి పేరు మీద ఉందో చూడండి. ఆ కారు కచ్చితంగా ఇంతకుముందు ఓనర్‌ పేరు మీదే ఉండాలి. ఒకవేళ డీలర్‌ పేరు మీద ఉంటే.. అది థర్డ్‌ హ్యాండ్‌ కారు అవుతుంది. దీనికి విలువ తక్కువగా ఉంటుంది. 

కారు సర్వీసింగ్‌ వివరాలు అడిగి తెలుసుకోండి. ఒకవేళ సర్వీస్‌ బుక్‌ ఉంటే.. దానిని చూడండి. దీనిని బట్టి కారును సమయానికి సర్వీసింగ్‌ చేయించారో లేదో తెలుస్తుంది. ఇలా చేసి ఉంటే.. కారు కండిషన్‌ బాగున్నట్లే. ఇక సదరు కారు లోనుపై తీసుకొని ఉంటే.. అది పూర్తిగా చెల్లించారో లేదో తెలుసుకోండి. లోన్‌ ఎన్వోసీ (నో ఆబ్జెక్షన్‌ సర్టిపికెట్‌) అడగండి. ఇక కారు చాలా తక్కువ దూరం తిరిగిందని చెప్పి ఎక్కువ సొమ్ము చేసుకునే వాళ్లు ఉంటారు. ఇలాంటి వాళ్లు కారు తిరిగిన దూరాన్ని చూపించే ఓడోమీటర్‌ టాంపరింగ్‌కు పాల్పడుతుంటారు. అలాంటిదేమైనా జరిగిందేమో చూడండి. ఇది తెలుసుకోవడం కాస్త కష్టమే అయినా.. మీకు తెలిసిన మెకానిక్‌ ద్వారా లేదంటే సర్వీస్‌ సెంటర్‌కు తీసుకెళ్లడం ద్వారా తెలుసుకోవచ్చు.

5. కారులో ఈ మార్పులు చేయకూడదు..

ఇక కొందరు కారులో చేయకూడని మార్పులు చేస్తూ అమ్మకానికి పెడుతుంటారు. ఇప్పుడున్న వాహన చట్టాల ప్రకారం.. కారులో కొన్ని మార్పులు చేయడంపై నిషేధం ఉంది. అంటే కారు రంగు మార్చడం, కారు మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ చెప్పినదాని కంటే ఎక్కువ ఎత్తున్న టైర్లు బిగించడం వంటివి చేయకూడదు. 

కారు రంగుకు సంబంధించిన సమాచారం రిజిస్ట్రేషన్‌ కార్డుపై ఉంటుంది. మీరు కొనే కారు రంగును ఆర్సీపై ఉన్న సమాచారంతో పోల్చి చూసుకోవచ్చు. కొంతమంది దొంగతనం చేసిన కార్లను అమ్మడానికి ఇలా రంగు మార్చడం, నంబర్‌ ప్లేట్‌ ఫ్యాన్సీది బిగించడం, ఇంజిన్‌లో మార్పులు చేయడం చేస్తుంటారు. అందుకే ఈ విషయాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి.

6. కచ్చితమైన ధర తెలుసుకోండి..

ఇక మీరు కొనబోయే సెకండ్‌ హ్యాండ్‌ కారు ఏ కంపెనీకి చెందినది, ఎంత తిరిగింది, ఎలాంటి కండిషన్‌లో ఉందన్నదానిని బట్టి దాని ధర ఆధారపడి ఉంటుంది. మీరు కొనబోయే వ్యక్తి లేదా డీలర్‌ చెప్పిన ధర సరిగ్గానే ఉందా లేదా అన్నది మీరు ఆన్‌లైన్‌లో లేదంటే వీటిపై అవగాహన ఉన్న వారి నుంచి తెలుసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ ధర చెబుతున్నట్లు అనుమానం వస్తే.. సరైన ధరకు మీరు బేరమాడే అవకాశం ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం