తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  కారు ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువగా చెల్లిస్తున్నారా? ఇలా చేస్తే మీ డబ్బు ఆదా

కారు ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువగా చెల్లిస్తున్నారా? ఇలా చేస్తే మీ డబ్బు ఆదా

Manda Vikas HT Telugu

24 January 2022, 17:54 IST

google News
    • ప్రతీ ఏడాది ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించడం సగటు వినియోగదారుడికి తలకు మించిన భారంలా పరిణమిస్తుంది. కాబట్టి ప్రీమియం చెల్లించేటపుడు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మనం కొంత డబ్బును ఆదా చేసుకోవడమే కాకుండా, మెరుగైన ప్రయోజనాలను పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 
Insurance Policy
Insurance Policy ( (Getty/HT Archive))

Insurance Policy

వాహనాలు కొనుగోలు చేసేటపుడు చాలా డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. మీరు కారు లేదా మరేదైనా ఖరీదైన వాహనం కొనుగోలు చేసినపుడు ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి మాత్రమే కాదు, అది ఒక మంచి నిర్ణయం కూడా. దీనివల్ల భవిష్యత్తులో మీ వాహనానికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆ నష్టాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ భర్తీ చేస్తుంది.

అయితే, రోజురోజుకు పెరిగిపోతున్న ఇంధన ధరలకు తోడు, వాహనానికి సర్వీసులు, మరమత్తులు చేయింటం, ఇతరత్రా అన్ని ఖర్చులతో పాటు ప్రతీ ఏడాది ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించడం సగటు వినియోగదారుడికి తలకు మించిన భారంలా పరిణమిస్తుంది. కాబట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేటపుడు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మనం కొంత డబ్బును ఆదా చేసుకోవడమే కాకుండా, మెరుగైన ప్రయోజనాలను పొందవచ్చునని నిపుణుల సలహా. అవేంటంటే..

మినహాయింపులు పెంచడం: 

ఇన్సూరెన్స్ పాలసీ కవరేజీకి సంబంధించి బీమా సంస్థ అనేక అంశాలను చేరుస్తుంది. వీటిలో కొన్ని ప్రాధాన్యం లేనివాటిని మినహాయించడం ద్వారా పాలసీ ప్రీమియం ధరను తగ్గించుకోవచ్చు. ఇలా ప్రతీ ఏడాది చాలావరకు డబ్బు ఆదా అవుతుంది. కాబట్టి బీమా సంస్థ తమ కవరేజీలో భాగంగా వేటికి చెల్లించదలుచుకుంటుందో ముందుగా తెలుసుకోండి. మీకు అనవసరం అనిపించిన అంశాలను తీసేయండి. మీరు ఎంతవరకు ప్రీమియం భరించగలుగుతారో అంతే చెల్లించండి.

చిన్న మొత్తాలను క్లెయిమ్ చేయవద్దు:

ప్రతీచిన్న ప్రమాదానికి బీమా ప్రయోజనాన్ని క్లెయిమ్ చేయడం అనేది అవివేకమైన చర్య. ఇది దీర్ఘకాలంలో బీమా కవరేజ్ ప్రయోజనాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి, కారుకు చిన్న డెంట్ పడటం లేదా టెయిల్ లైట్ పగలడం లేదా సైడ్ మిర్రర్ విరిగిపోవడం లాంటి చిన్న చిన్న సమస్యల కోసం చిన్న మొత్తాలను క్లెయిమ్ చేయకుండా ప్రయత్నించండి. అలాంటి మరమ్మతులను స్థానిక మెకానిక్స్ వద్ద తక్కువ ధరలోనే సులభంగా చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మీకు నాన్-క్లెయిమ్ బోనస్‌లను కూడబెట్టుకోవచ్చు. ఇలా మీరు  ఆదా చేసిన బోనస్ మొత్తాలను మరో వాహనం కొనుగోలు చేసినపుడు కూడా వాటికి బదలాయించుకునే అవకాశం ఉంటుంది.

విశ్వసనీయత: 

ప్రతీ ఏడాది ఒకే బీమా సంస్థను ఎంచుకోవడం ద్వారా, నాన్- క్లెయిమ్స్ ఎక్కువగా ఉండటం ద్వారా మీరు సదరు బీమా సంస్థ యొక్క విశ్వాసాన్ని చూరగొన్నవారవుతారు. ఇది మీకు లాయల్టీ రివార్డ్‌గా బీమా ప్రీమియం తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

యాంటీ థెఫ్ట్ డివైజ్: 

మీ వాహనానికి యాంటీ థెఫ్ట్ డివైస్ అమర్చినట్లు బీమా కంపెనీకి తెలియజేస్తే ఇది కూడా మీ ప్రీమియం తగ్గించటానికి ఉపకరిస్తుంది.

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్: 

మీ వాహనం మరీ పాతదైనప్పుడు,  మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకుంటున్నపుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ సరిపోతుంది. ఇది చాలా తక్కువ ధరకే లభిస్తుంది.

 ఈ స్మార్ట్ చిట్కాలను పాటించండి, ప్రతీ ఏడాది డబ్బు ఆదా చేయండి.

 

తదుపరి వ్యాసం