Insurance policy | ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారా? ఈ మిస్టేక్స్ చేయకండి
03 May 2022, 16:01 IST
- ఇన్సూరెన్స్ పాలసీ విలువ కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రతి ఒక్కరికి తెలిసొచ్చింది. ముఖ్యంగా కుటుంబాన్ని పోషించేవారు అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబం దిక్కులేని పరిస్థితుల్లో పడుతుంది.
ప్రతీకాత్మక చిత్రం: కుటుంబాన్ని పోషించే వారికి బీమా అవసరం
సంపాదించే ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరిగా మారింది. అయితే చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే ముందు సరైన అవగాహన లేక అనేక తప్పిదాలు చేస్తుంటారు. అవేంటో తెలుసుకుందాం.
1. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయకపోవడం
సాధారణంగా మనం ఖర్చు చేసేటప్పుడు, పెట్టుబడి పెట్టేటప్పుడు ప్రతిఫలం గురించి ఆలోచిస్తాం. బీమా పాలసీ విషయంలో ఈ విధానం సరికాదు.
టర్మ్ ఇన్సూరెన్స్ అయితే చనిపోయినప్పుడు మాత్రమే నామినీలకు దక్కుతుంది. పాలసీ కాలం పూర్తయి పాలసీదారు బతికి ఉంటే ప్రతిఫలం, రాబడి రాదు. కానీ ఈ టర్మ్ పాలసీలకు మీరు వెచ్చించే ప్రీమియం చాలా తక్కువ అని గమనించాలి.
నాన్–టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో అయితే పాలసీ మెచ్యూరిటీ వచ్చాక మనకు ప్రతిఫలం లేదా రాబడి ఉంటుంది. కానీ ఇది ఇతర పెట్టుబడి సాధనాలతో పోల్చితే చాలా తక్కువ ప్రలిఫలం వస్తుంది.
2. వందేళ్ల వరకు పాలసీ తీసుకోవడం..
చాలా మంది ఎక్కువ కాలానికి అంటే వందేళ్లకు, ఆ పైబడి సంవత్సరాలకు కూడా పాలసీ తీసుకుంటారు. దీని వల్ల మీరు ప్రీమియం అధికంగా చెల్లించాల్సి వస్తుంది. పైగా మీ పాలసీ విలువ ద్రవ్యోల్బణాన్ని బట్టి చూస్తే అప్పటికి చాలా తక్కువగా కనిపిస్తుంది.
3. తగినంత మొత్తంలో బీమా చేయించుకోకపోవడం
చాలా మంది చిన్న వయస్సులోనే అప్పటి ఆర్థిక స్థోమతను బట్టి, అవసరాలను బట్టి కొద్ది మొత్తంలో ఇన్సూరెన్స్ చేస్తారు. కానీ తరువాత కుటుంబ అవసరాలు, పరిస్థితులు మారుతుంటాయి. దానికి అనుగుణంగా బీమా మొత్తాన్ని పెంచుకోవాలి.
4. అనారోగ్య విషయాలను దాచిపెట్టడం
ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలో మీకున్న అనారోగ్య విషయాలను, పొగ తాగే వారైతే సంబంధిత విషయాన్ని బహిర్గత పరచాల్సి ఉంటుంది. లేదంటే పాలసీ ఇచ్చే కంపెనీలు భవిష్యత్తులో మీ క్లెయిమ్‌ను నిరాకరించే ప్రమాదం ఉంటుంది.
5. టాక్స్ సేవింగ్స్‌తో ముడిపెట్టడం..
ఎక్కువ మంది టాక్స్ సేవింగ్స్ కోసమని చెప్పి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. పన్ను మినహాయింపు వస్తుందని చెప్పి పెద్దపెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లిస్తూ పాలసీలు తీసుకుంటారు. పన్ను మినహాయింపునకు, జీవిత బీమా పాలసీకి లింక్ పెట్టొద్దు.
టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే తక్కువ ప్రీమియంలో ఎక్కువ మొత్తానికి బీమా చేయించవచ్చు. ఈ ప్రీమియంను కూడా ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద మినహాయింపుగా చూపవచ్చు. టాక్స్ సేవింగ్స్ కోసం అని పాలసీ తీసుకునే బదులుగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఈఎల్‌ఎస్‌ఎస్ లాంటి ఓ మోస్తరు రాబడి ఇచ్చే ఫండ్స్ తీసుకోవడం మేలు. అయితే రిస్క్ సామర్థ్యాన్ని కూడా బేరీజు వేసుకోవాలి.
6. వాయిదా వేయడం..
ఇప్పుడిప్పుడే ఉద్యోగం సంపాదించో లేదా స్వయం ఉపాధితోనే కుటుంబాన్ని పోషించే వారు ఇప్పుడే బీమా ఎందుకులే అని నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ కుటుంబ పోషణ భారం మీ పైనే ఉందన్న సంగతి మరవొద్దు. అందువల్ల వయస్సు చిన్నదే అయినా, కనీసం మీరు 60 నుంచి 70 ఏళ్లు వచ్చేవరకు వర్తించేలా పాలసీ తీసుకోవడాన్ని వాయిదా వేయొద్దు.
టాపిక్