పిల్లలు మానసిక ఆందోళనకు గురవుతున్నట్లు ఎలా తెలుసుకోవచ్చు?
28 February 2022, 18:43 IST
- పిల్లలు మానసికంగా, శారీరకంగా చాలా సున్నితమైన వారు.ఒత్తిడి, ఆందోళన వంటివి వారిపై బాగా ప్రభావం చూపుతాయి. దీని ఫలితాలు వారిపై దీర్ఘకాలం వరకు ఉంటాయి. సంతోషకర వాతావరణం లేకపోతే పిల్లల సాధారణ ప్రగతి అభివృద్ధిపై కూడా అది ప్రభావం చూపుతుంది.
Stress in kids may have long-term impact
పిల్లలు మానసికంగా, శారీరకంగా చాలా సున్నితమైన వారు. ఒత్తిడి, ఆందోళన వంటివి వారిపై బాగా ప్రభావం చూపుతాయి. దీని ఫలితాలు వారిపై దీర్ఘకాలం వరకు ఉంటాయి. కోవిడ్ మహమ్మారి వారి సాధారణ కార్యకలాపాలలో చాలా మార్పులు తెచ్చింది. పాఠశాలలు చాలా రోజుల పాటు మూతపడ్డాయి. ఆన్‌లైన్ విధానంలోకి విద్య మారింది. తోటి పిల్లలతో మాట్లాడే అవకాశాలు పరిమితం అయ్యాయి. ఏదో అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయని వారు భావించడం సహజం. కోవిడ్ మహమ్మారి వారి విద్య, కెరీర్ ప్రణాళికలను దెబ్బతీసింది. ఇక్కడ తల్లిదండ్రులు, సంరక్షకులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం. వారు పిల్లలకు సరిగ్గా మార్గనిర్దేశం చేయాలి.
ఈ పరిస్థితిని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పిల్లలు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు కొంతమంది చిన్నారులు కరోనా కారణంగా తమ తల్లిదండ్రులను లేదా సంరక్షకులను కోల్పోవడం లాంటి దురదృష్టకర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపేవే. సంతోషకర వాతావరణం లేకపోతే పిల్లల సాధారణ ప్రగతి అభివృద్ధిపై కూడా అది ప్రభావం చూపుతుంది.
పిల్లలు మానసిక ఆందోళనకు గురవుతున్నట్లు ఎలా తెలుసుకోవచ్చు?
పెద్ద వాళ్లలా కాకుండా పిల్లలు ఒత్తిడి సమయంలో చాలా భిన్నంగా ప్రవర్తిస్తారు. కొందరు పిల్లలు మొండిగా వ్యవహరిస్తారు. మరికొందరు ఆవేశంతో వ్యవహరిస్తారు, ఇంకొందరు మానసికంగా కుంగిపోతారు.కొందరు మాట పలుకు లేకుండా మౌనంగా ఉండిపోతారు. అందువల్ల పిల్లల మానసిక స్థితిని అర్ధం చేసుకోవడం కష్టం. పరిసరాల ప్రభావం వారి భావోద్వేగాలు, మూడ్‌పై చూపుతుంది. పిల్లలు ఆయా పరిస్థితులను అంతర్గతంగా తీసుకుంటారు. భయం, అనారోగ్యం, దగ్గరి వ్యక్తులు, సన్నిహితుల మరణం వంటివి వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. కొన్ని సందర్భాలలో వారు తమ భయం, ఆందోళనను సరిగ్గా వ్యక్తం చేయలేరు.
అందువల్ల, పెద్దలు పిల్లల ప్రవర్తనను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ప్రస్తుత సంక్షోభ సమయంలో పిల్లలు తమ అభిప్రాయాలు చెప్పడానికి, వివిధ అంశాలపై తమ దృక్పథాన్ని వెల్లడించడానికి పెద్దలు ప్రోత్సహించాలి. వారు సరిగ్గా వ్యక్తం చేయలేకపోయినట్టయితే వారు డ్రాయింగ్, పెయింటింగ్, లేదా ఇతర మాధ్యమాల ద్వారా వ్యక్తం చేసేందుకు అవకాశం కల్పించాలి.
ఏదైనా ప్రభావం గురించి పిల్లలను సూటి ప్రశ్నలను అడగరాదు. చిన్నారులతో మాట్లాడేటపుడు సున్నితంగా వ్యవహరించాలి. నిజానికి వారిలో అంతర్గతంగా వస్తున్న మార్పును వారు గుర్తించలేరు.అందువల్ల వారిని అర్థం చేసుకునేందుకు వినూత్న మార్గాలు అన్వేషించాలి. అయితే క్లిష్టమైన అంశాల గురించి చర్చించేటపుడు అంటే ఇన్‌ఫెక్షన్, మరణం వంటి వాటి గురించి మాట్లాడేటపుడు నేరుగానే మాట్లాడాలి.
పిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టి, తల్లిదండ్రులకు పాటించాల్సిన సూచనలు:
పని ప్రదేశం, వ్యక్తిగత ప్రదేశానికి మధ్యగల సన్నని విభజన రేఖ చెరిగిపోతున్నది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల చదువు బాధ్యతలను అదనంగా చేపట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. ప్రతి వయసు పిల్లలకు వేరే వేరు అవసరాలు ఉంటాయి. వారిపై ప్రత్యేక దృష్టి పెట్టడం, వారికి వనరులు సమకూర్చడం, వారికి సంతోష కరమైన వాతావరణం ఉండేట్టు చూడాలి.
ఇంట్లో ఒత్తిడితో కూడిన వాతావరణం ఉంటే అది పిల్లల మానసిక ఆరోగ్య పరిస్థితులపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుత పరిస్థితుల‌్లో సురక్షిత వాతావరణం వారి మానసిక ఆరోగ్యఆందోళనలను దూరం చేయగలదు.తల్లిదండ్రులు పిల్లలను వివిధ వ్యాపకాలలో నిమగ్నం చేయడానికి వారు సానుకూల దృక్పథంతో ఉండాలి. తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండడానికి వారు మార్గాలు అన్వేషించాలి. వారు తమ రోజువారి కార్యకలాపాలను ఒక పద్ధతిలోకి తెచ్చుకోవాలి. అప్పడు వారు పిల్లలపై దృష్టిపెట్టి వారితో ప్రోత్సాహకరంగా మాట్లాడడానికి వీలు ఉంటుంది.ఒత్తిడిని భరించలేని స్థితిలో ఉన్నవారు స్నేహితులు, ప్రొఫెషనల్స్ సహాయం తీసుకోవాలి.
టాపిక్