Alcohol: మండే ఎండల్లో రోజూ మద్యం సేవించడం వల్ల జరిగే ప్రమాదాలు ఇవే, జాగ్రత్త
03 April 2024, 9:30 IST
- Alcohol: మండే ఎండల్లో మద్యం సేవించడం చాలా ప్రమాదకరం. అయినా కూడా ఎంతోమంది ప్రతిరోజు ఆల్కహాల్ తాగుతూనే ఉంటారు. వేసవిలో మద్యం సేవించడం వల్ల ఐదు రకాల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
వేసవిలో ఆల్కహాల్ తో సమస్యలు
Alcohol: వేసవిలో ఆహారపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే కొన్ని రకాల సమస్యల బారిన పడే అవకాశం ఉంది. వేసవిలో తాగడం వల్ల శారీరకంగా, మానసికంగా చాలా ప్రభావం పడుతుంది. మద్యపానం శారీరక, మానసిక సామర్ధ్యాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల కొన్ని రకాల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మద్యపానం వల్ల వేసవిలో ఎలాంటి ప్రమాదాలు లేదా హాని జరగవచ్చో తెలుసుకోండి
డీహైడ్రేషన్
వేసవిలో సాధారణంగానే డీహైడ్రేషన్ బారిన పడుతూ ఉంటారు. ఇక ఆల్కహాల్ ప్రతిరోజు తాగే వారి గురించి ఇక చెప్పక్కర్లేదు. త్వరగా శరీరం నుంచి నీటిని కోల్పోతారు. వేడి వాతావరణం అధికంగా ఉన్నప్పుడు మద్యపానం తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శరీరం నుంచి చెమట రూపంలో నీరు బయటకు రావడమే కాకుండా, మూత్రవిసర్జన చేయడం ద్వారా కూడా నీరు బయటకు పోతుంది. దీనివల్ల శరీరం మరింతగా నిర్జలీకరణం అవుతుంది. సాధారణం కంటే ఎక్కువగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం, చెమటలు పట్టడం ఈ రెండూ కూడా ప్రమాదమే. ఆల్కహాల్ అధికంగా తీసుకుంటే పొట్టలో చికాకు వస్తుంది. వాంతులు అవుతాయి. దీనివల్ల కూడా శరీరంలో ఉన్న ద్రవం బయటకుపోతుంది. మరణం కూడా సంభవించవచ్చు.
వడదెబ్బ
హీట్ స్ట్రోక్ తగిలే అవకాశం ఎక్కువగా మద్యపానం చేసే వారికే ఉంది. ఎక్కువసేపు బయట ఉండడం, బయట తాగడం వేడికి గురయ్యేలా చేస్తాయి. శరీరం నియంత్రించలేనంతగా ఉష్ణోగ్రత పెరుగుతుంది. మన శరీరం పెద్ద మొత్తంలో వేడిని ఉత్పత్తి చేసినప్పుడు... ఆ వేడిని చెమట ద్వారా బయటికి పంపి చల్లబడేలా చేస్తుంది. ఎప్పుడైతే శరీరానికి తగినంత ద్రవాలు లేనట్లయితే శరీరానికి చెమట పట్టదు. దీనివల్ల శరీరంలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. కానీ ఆ ఉష్ణోగ్రత బయటికి పంపే దారి ఉండదు. దీనివల్ల దీనివల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. వడదెబ్బ వల్ల తలనొప్పి, మైకం, గందరగోళం, వాంతులు, మూర్చలు వంటి సమస్యలు రావచ్చు.
మునిగిపోవడం
వేసవిలో ఎక్కువ మంది చల్లని సరస్సులు, సముద్రాల దగ్గరికి స్నానాలు చేసేందుకు వెళతారు. ఆల్కహాల్ శరీరంలో చేరినప్పుడు ఇలా సరస్సులు, సముద్రాల దగ్గరికి వెళ్లడం మంచిది కాదు. తమకు తెలియకుండానే నీటిలో మనకి మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం ప్రతి ఏడాది 20% మంది పెద్దవాళ్లు మద్యపానం చేసి సముద్రం, సరస్సులలో ప్రమాదవశాత్తు మునిగి చనిపోతున్నట్టు అంచనా. కాబట్టి మద్యపానం చేసి ఎలాంటి విహారయాత్రలకు వెళ్లకపోవడమే మంచిది.
బోటింగ్ ప్రమాదాలు
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెబుతున్న లెక్కల ప్రకారం బోటింగ్ చేస్తూ మరణిస్తున్న వారిలో దాదాపు మూడింట ఒక వంతు మంది మద్యపానం చేసినవారే. ఎవరైతే మద్యపానం చేసి బోటింగ్‌కు వెళ్తారో.. వారు తమ సమతుల్యతను కోల్పోతారు. మానసికంగా, శారీరకంగా అలెర్ట్‌గా ఉండలేరు. దీనివల్ల బోటింగ్ సమయంలో చెరువులో లేదా నదిలో పడి మరణించడం వంటి సమస్యలు, పరిణామాలు జరుగుతున్నాయి. కాబట్టి బోటింగ్ వంటి సాహసాలు చేసేటప్పుడు మద్యపానం చేయకుండా ఉండడం చాలా ముఖ్యం.
కారు ప్రమాదాలు
వేసవిలో ఆల్కహాల్ తాగితే మత్తు త్వరగా శరీరానికి ఎక్కేస్తుంది. శరీరం డిహైడ్రేషన్‌కి గురవ్వడం, మద్యపానం శరీరంలో చేరడం వల్ల మానసికంగా శారీరకంగా సమతుల్యంగా ఉండలేరు. మద్యం మత్తులో కారు నడిపితే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మద్యపానం చేసి కార్లు నడపడం వల్ల మరణించిన వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. కాబట్టి వేసవిలో మద్యపానాన్ని చాలా తగ్గించుకోవడం ఉత్తమం.