Health Insurance | ఆరోగ్య బీమా గురించి సామాన్యూల్లో ఉండే అపోహలు ఇవే!
28 February 2022, 14:24 IST
- Health Insurance | హెల్త్ ఇన్సూరెన్స్‌ను అదనపు ఖర్చుగానే చూస్తున్నారు. ముఖ్యంగా సరైన అవగాహన లేకపోవడం వల్ల వారిలో ఆందోళన, నిరాశకు కారణమవుతుంది. ఫలితంగా వైద్య బీమా గురించి అనేక అపోహలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా గురించి సామాన్యూల్లో సాధారణంగా ఉండే అపోహలేంటో ఇప్పుడు చూద్దాం.
ఆరోగ్య బీమా
ఆరోగ్య బీమా పాలసీలు ఈ రోజుల్లో అత్యంత ముఖ్యమైనవిగా మారాయి. కరోనా మహమ్మారి ప్రభావంతో అన్ని వయస్కుల వారికి వీటి ప్రాధాన్యత తెలుసొచ్చింది. అనారోగ్యకరమైన జీవనశైలి, కాలుష్య వాతావరణం లాంటి కారణాలే కాకుండా సంక్రమిత వ్యాధులు, ఒత్తిడితో కూడిన వ్యక్తిగత జీవితం వల్ల రోగాల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఫలితంగా వైద్య ఖర్చులకు తడిసిమోపెడవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఎదురుదెబ్బలు తగలకుండా హెల్త్ ఇన్సూరెన్స్‌లు బాగా ఉపయోగపడుతున్నాయి. అదనంగా కోవిడ్-19 ముప్పు కూడా ప్రజలను వీటి గురించి బాగా ఆలోచించేలా చేస్తుంది.
అయితే ఇప్పటికీ కొంతమంది మెడికల్ ఇన్సూరెన్స్‌ను అదనపు ఖర్చుగానే చూస్తున్నారు. ముఖ్యంగా సరైన అవగాహన లేకపోవడం వల్ల వారిలో ఆందోళన, నిరాశకు కారణమవుతుంది. ఫలితంగా వైద్య బీమా గురించి అనేక అపోహలు తలెత్తుతున్నాయి. కాబట్టి అయోమయాలను తెలుసుకుని వాస్తవాలను దూరం చేసే ప్రయత్నం చేయాలి. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా గురించి సామాన్యూల్లో సాధారణంగా ఉండే అపోహలేంటో ఇప్పుడు చూద్దాం.
ఇన్సూరెన్స్ యువతకు అవసరం లేదనుకోవడం..
చాలా మంది ఆరోగ్య బీమా అనగానే అది కేవలం పెద్దవారికి మాత్రమే అని అపోహపడుతుంటారు. అలా కాకుండా చిన్న వయస్సు నుంచే హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం వల్ల మీకే ప్రయోజనకరం. ఎందుకంటే ఈ వయస్సులో ఆసుపత్రిలో చేరే అవకాశం చాలా తక్కువ కాబట్టి మీకు ఆరోగ్య పాలసీ సరసమైన ప్రీమియం ధరతో, మంచి కవరేజీ లభిస్తుంది. అంతేకాకుండా తీసుకున్న మొదటి రోజు నుంచే బీమా కవర్ కాదు. పరిస్థితుల ఆధారంగా కొన్ని నిర్దిష్ట వ్యాధులను కవర్ చేయడానికి 2 నుంచి 4 సంవత్సరాల వరకు సమయం ఉంటుంది.
ఒకవేళ పాలసీదారుకు ముందుగానే అనారోగ్య పరిస్థితులు ఉంటే బీమా నిబంధనల ప్రకారం నిర్దిష్ట వెయిటింగ్ పీరియడ్ పూర్తయిన తర్వాత మాత్రమే అందుబాటులోకి వస్తుంది. సాధారణంగా ఈ వ్యవధి 36 నుంచి 48 నెలల వరకు ఉంటుంది. ఈ కారణంగా హెల్త్ ఇన్సూరెన్స్‌ను ముందుగానే కొనుగోలు చేయడం మంచిది.
బీమా క్లెయిమ్ చేయాలంటే కనీసం 24 గంటలు ఆసుపత్రిలో ఉండాలి..
వైద్య పురోగతి కారణంగా కొన్ని సర్జరీలను ఆసుపత్రిలో చేరిన 24 గంటల్లోపే పూర్తి చేస్తున్నారు. అయితే చాలా వరకు ఆరోగ్య బీమా సంస్థలు కూడా ఇందుకు తగినట్లుగానే డే-కేర్ ప్రొసిజర్స్ అయిన కీమోథెరపీ, డయాలిసిస్, కంటి శస్త్రచికిత్స, రేడియో థెరపీ, లిథోట్రిప్సీ లాంటి విధానాలకు కవరేజీని అందిస్తున్నాయి. కొన్ని కంపెనీలైతే ఆంక్షలతో డెంటల్ ట్రీట్మెంట్ లాంటి ఔట్ పేషెంట్ ప్రొసిజర్స్‌కూ కవరేజీ ఇస్తున్నాయి.
ఎంప్లాయిర్ అందించే ఆరోగ్య బీమా సరిపోతుందనుకోవడం..
కార్పోరేట్ ఉద్యోగులకు తమ కంపెనీ యాజమాన్యాలే(Employers) ఆరోగ్య బీమాను అందిస్తాయి. ఈ పాలసీలు తమతో పాటు అత్యంత సన్నిహితులైన కుటుంబ సభ్యులను కవర్ చేస్తాయి. ఇంతవరకు బాగానే ఉంటుంది.. కానీ వృద్ధులైన తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులపై ఆదారపడిన వారికి పూర్తి కవరేజ్ లభించదు. అంతేకాకుండా పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో చేరే వరకు ఈ బీమా కవర్ సరిపోకవచ్చు. దీంతో పాటు ఈ ప్లాన్లు కేవలం ఎంప్లాయిర్ దగ్గర ఉద్యోగి పనిచేసినంత కాలం మాత్రమే చెల్లుబాటు అవుతాయి. అందువల్ల తమకిష్టమైన వారికోసం కార్పోరేట్ ప్లాన్ల కంటే మెరుగైన బీమా కవరేజీని తీసుకోవడం ఉత్తమం.
అంతేకాకుండా జీవిత చరమాంకంలో ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడం చాలా ఖర్చుతో కూడికుని ఉంటుంది. తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులు ఉన్న వ్యక్తులకు ఇవి అందుబాటులో కూడా ఉండకపోవచ్చు.
ఆన్‌లైన్‌లో ఆరోగ్య బీమా కొనుగోలు చేయడం సురక్షితం కాదు..
చాలా మందికి ఆన్‌లైన్‌లో బీమా కొనుగోలు చేయకూడదనే అపోహ ఉంటుంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు చాలా మారాయి. డిజిటలైజేషన్ వల్ల ఆన్‌లైన్‌లో కూడా హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చౌకగా వీటిని తీసుకోవచ్చు. బీమా కంపెనీలు కస్టమర్లకు ఆన్‌లైన్‌లో డిస్కౌంట్లను కూడా అందిస్తున్నాయి. ఒక్క క్లిక్‌తో తమకు సరిపోయే ప్లాన్ ఎంచుకోవడమే కాకుండా, ఇతర ప్లాన్‌లతో పోల్చుకోవడం కూడా వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది. సురక్షితమైన చెల్లింపులు, సందేహాలను తక్షణమే నివృత్తి చేయకలిగే కస్టమర్ సపోర్టును అందిస్తున్నాయి. పారదర్శకతతో కూడిన సమాచారాన్ని అందించడమే కాకుండా పాలసీదారుల సమాచారం పరంగానూ గోప్యతను పాటిస్తున్నాయి. కాబట్టి ఆన్‌లైన్‌లో నిరభ్యంతరంగా హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసుకోవచ్చు.
చౌకైన పాలసీనే బెస్ట్ అనుకోవడం..
మనలో చాలా మంది కేవలం ఖర్చును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అంతేకాకుండా తక్కువ ప్రీమియంలు ఉండే పాలసీలనే ఎంచుకుంటారు. ఖర్చు ముఖ్యమైన అంశమే అయినప్పటికీ కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉండే ఫీచర్లు, వెయిటింగ్ పీరయడ్, కో-పేమెంట్స్ లాంటి కీలక అంశాలను పోల్చుకోవడం ముఖ్యం. మీరు ఎక్కువ ప్రయోజనాలు పొందాలనుకుంటే విస్తృతమైన కవరేజీని అందించే పాలసీని తీసుకోవాలి. తక్కువ ప్రీమియంలతో వచ్చే ప్లాన్లలో ఫీచర్లు పరిమితమే ఉండవచ్చు. కాబట్టి పాలసీని కొనుగోలు చేసేముందు అన్ని వివరాలను చెక్ చేసుకోవాలి. కుటుంబ ఆరోగ్యం కంటే ఏది ముఖ్యమైంది కాదు కాబట్టి తగిన ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకోవడం ముఖ్యం. తప్పుడు సమాచారం, అపోహలకు దూరంగా ఉండి మంచి నిర్ణయం తీసుకోవాలి.
టాపిక్