Solala Biryani: తెలంగాణ స్పెషల్.. సోలాల బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా?
14 November 2023, 12:00 IST
Solala Biryani: తెలంగాణ స్పెషల్ సోలాలు లేదా కందికాయ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా. తయారీ చాలా సులభం. దాన్నెలా చేయాలో పక్కా కొలతలతో సహా చూసేయండి.
సోలాల బిర్యానీ
ఈ సీజన్‌లో పచ్చి కందికాయ మార్కెట్లో చాలా దొరుకుతుంది. తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఈ పచ్చికందికాయ గింజలతో చేసే బిర్యానీ చాలా ఫేమస్. దీన్నే సోలాల బిర్యానీ అని కూడా అంటారు. ఈ బిర్యానీని రుచిగా ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో సహా చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
పావు కేజీ సోలాలు లేదా పచ్చి కంది గింజలు
1 క్యారట్ (ఆప్షనల్)
1 కప్పు బియ్యం
2 చెంచాల నెయ్యి
1 చెంచా నూనె
అర అంగుళం దాల్చిన చెక్క
2 లవంగాలు
1 యాలకులు
1 బిర్యానీ ఆకు
పావు చెంచా ఆవాలు
పావు చెంచా షాజీరా
2 పచ్చిమిర్చి చీలికలు
1 ఉల్లిపాయ, పొడవుగా ముక్కలు కోసుకోవాలి
అరచెంచా అల్లం వెల్లుల్లి ముద్ద
పావు చెంచా పసుపు
రుచికి సరిపడా ఉప్పు
కొద్దిగా కొత్తిమీర
తయారీ విధానం:
- ముందుగా వెడల్పాటి పాత్ర ఒకటి పొయ్యి మీద పెట్టుకోవాలి. అందులో నెయ్యి, నూనె వేసుకోవాలి. నెయ్యి వద్దనుకుంటే పూర్తిగా నూనె వాడుకోవచ్చు.
- నూనె వేడెక్కాక ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడాక బిర్యానీ ఆకు, షాజీరా, పచ్చిమిర్చి చీలికలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకుని వేగనివ్వాలి.
- ఒక నిమిషం ఆగి పచ్చిమిర్చి చీలికలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని వేగనివ్వాలి. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కాస్త రంగు మారేంత వరకు వేగనివ్వాలి.
- ఇప్పుడు క్యారట్ ముక్కలు వేసుకొని మెత్తగా అయ్యేవరకు మూత పెట్టుకోవాలి. ఈ క్యారట్ వేసుకోవడం అనేది ఆప్షనల్. మీకిష్టం లేకపోతే వేసుకోకండి.
- ఇప్పుడు కంది గింజలు వేసుకుని మూత పెట్టుకుని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటూ మగ్గనివ్వాలి.
- అందులో కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోసుకుని మరుగు పట్టనివ్వాలి. నీళ్లు బాగా మరిగాక బియ్యం, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకొని మూత పెట్టుకోవాలి.
- అయిదు నిమిషాల్లో వేడి వేడి సోలాల బిర్యానీ రెడీ అయిపోతుంది.