Tomato Bajji: బజ్జీ బండి స్టైల్‌లో టమాటా బజ్జీ రెసిపీ, ఇలా చేస్తే రుచి రెట్టింపు
28 September 2024, 15:30 IST
Tomato Bajji: సాయంత్రం పూట టేస్టీగా, స్పైసీగా ఏదైనా తినాలనుకుంటే టమాటా బజ్జీ ట్రై చేయండి. దీనికోసం టమాటాలు ముఖ్యంగా ఉంటే సరిపోతాయి. వీటిని ఎలా తయారు చేయాలో చూడండి.
టమాటా బజ్జి
ఈవెనింగ్ టీ టైంలో స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తుంది. ముఖ్యంగా పకోడీలు, టీ కాంబినేషన్ అంటే ఎవరికైనా ఇష్టమే. టమాటాలతో గ్రీన్ చట్నీ దట్టించి చేసే ఈ గుజరాతీ స్టైల్ టమాటా బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి. టమాటాలు శనగపిండిలో ముంచి వేస్తే చాలు అనుకోకండి. ఈ రెసిపీ ప్రత్యేకం. ఒకసారి కొరికితే కారంగా, మరోసారి టమాటా పులుపు తగిలి, మసాలా రుచితో ఘాటుగా ఉంటాయివి. వీటి తయారీ ఎలాగో చూసేయండి.
టమాటా పకోడీల తయారీకి కావలసిన పదార్థాలు:
3 టమాటాలు
1 కప్పు శనగపిండి
2 చెంచాల బియ్యం పిండి
3 పచ్చిమిర్చి
అరచెంచా నిమ్మరసం
ఒక టీస్పూన్ చాట్ మసాలా
ఒక టీస్పూన్ ఉప్పు
4 వెల్లుల్లి రెబ్బలు,
గుప్పెడు కొత్తిమీర
గుప్పెడు పుదీనా
2 పచ్చిమిర్చి
ఒక అంగుళం అల్లం ముక్క
డీప్ ఫ్రై కి సరిపడా నూనె
టమోటా పకోడీల తయారీ విధానం:
- ముందుగా టమాటా బజ్జీల కోసం గ్రీన్ చట్నీ రెడీ చేసుకోవాలి. దీనికి ఒక మిక్సీ జార్‌లో పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్ లాగా కలపాలి.
- అందులోనే ఉప్పు, నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు శనగపిండి తీసుకుని అందులో 2 చెంచాల బియ్యంపిండి, ఉప్పు కూడా కలుపుకోవాలి. నీళ్లు పోసుకుని జారుగా కలుపుకోవాలి.
- టమాటాలను శుభ్రం చేసి గుండ్రటి చక్రాల్లాగా ముక్కలు కట్ చేసుకోవాలి.
- ఈ ముక్కల మీద ముందుగా రెడీ చేసుకున్న గ్రీన్ చట్నీని ఒక చెంచాడు రాసుకోవాలి.
- అలా మెల్లగా పట్టుకుని శనగపిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి.
- నూనె బాగా వేడయ్యేలాగా చూసుకోవడం తప్పనిసరి. మీడియం మంట మీద వీటిని ఫ్రై చేసుకుని తీసుకోండి. మీద చాట్ మసాలా చల్లి సర్వ్ చసేయండి.
- వెంటనే ఉల్లిపాయ ముక్కలు లేదా ఏదైనా టమాటా కెచప్ తో సర్వ్ చేసుకోండి.