Raw Papaya roti: పొప్పడి కాయతో బియ్యంపిండి రొట్టెలు.. బాలింతలూ తినదగ్గ అల్పాహారం
Raw Papaya roti: బొప్పాయి కాయతో చేసే బియ్యం రొట్టె రుచి చూశారా. లేకపోతే ఒకసారి సింపుల్‌గా, రుచిగా ఎలా చేసుకోవాలో వివరంగా తెల్సుకోండి. ఉదయం పూట మంచి అల్పాహారం ఇది.
పొప్పడి లేదా బొప్పాయి.. కాయగా ఉన్నప్పుడు కూడా తింటారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తుంది. కేవలం పొప్పడి పండు మాత్రమే ఎక్కువగా తింటారు. ఈ పొప్పడి కాయతో చాలా రుచికరమైన వంటలు చేసుకోవచ్చు. అందులో ఒకటి పొప్పడికాయతో బియ్యం రొట్టె. బాలింతలకు పొప్పడి కాయను ఎక్కువగా పెడతారు. అలాంటప్పుడు ఈ రొట్టెలో కొన్ని మార్పులు చేసుకుని చేసి వాళ్లకూ పెట్టొచ్చు.కారం తక్కువ చేసి బాలింతలకు పెట్టొచ్చు. ఇక మామూలుగా ఈ రొట్టెల్ని ఎవ్వరైనా తినేయొచ్చు. ఉదయం అల్పాహారంలోకి తినడం ఆరోగ్యకరం కూడా. దాని తయారీ వివరంగా చూసేయండి.
పొప్పడి కాయతో బియ్యం రొట్టె తయారీకి కావాల్సిన పదార్థాలు:
2 కప్పుల బియ్యం పిండి
పావు కప్పు సన్నం రవ్వ
1 కప్పు పొప్పడి కాయ తురుము
1 ఉల్లిపాయ తరుగు
2 పచ్చిమిర్చి, సన్నటి ముక్కలు
1 కరివేపాకు రెమ్మ
గుప్పెడు కొత్తిమీర తరుగు
1 చెంచా అల్లం ముద్ద
1 టీస్పూన్ జీలకర్ర
1 టీస్పూన్ ధనియాలు
సగం చెంచా ఉప్పు
2 చెంచాల నూనె
పొప్పడికాయతో బియ్యం రొట్టె తయారీ విధానం:
1. ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో బియ్యం పిండి, రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకుంటే రొట్టెలు కాస్త మెత్తగా వస్తాయి. వద్దనుకుంటే కేవలం బియ్యం పిండి వాడుకోవచ్చు.
2. ఇప్పుడు బొప్పాయి కాయ చెక్కు, గింజలు తీసేసి తురుముకొని పక్కన పెట్టుకోవాలి.
2. బియ్యం పిండిలో పొప్పడి కాయ తురుము, సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచుకున్న ధనియాలు, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ధనియాలు, అల్లం ముద్ద వేసుకోవాలి.
3. కాస్త గట్టిగా పిండుతూ పిండిని కలుపుతుంటే అన్నీ బాగా కలిసిపోతాయి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి గట్టిగా కలుపుకోవాలి.
4. ఇక రొట్టె తయారీకి పిండి సిద్ధం అయినట్లే. అయితే వీటిని చపాతీల్లాగా ఒత్తుకోలేం. బదులుగా సర్వపిండి లాగా పెనానికి ఒత్తుకోవాలి. లేదంటే ఏదైనా తడిగుడ్డ మీద ఒత్తుకొని పెనం మీద వేసుకోవాలి.
5. ఇప్పుడు ఒక పెనం పెట్టుకుని నూనె రాసుకోవాలి. చిన్న మంట మీద స్టవ్ మీద పెట్టుకోవాలి.
6. ఒక పిండి ఉండ తీసుకుని తడి గుడ్డ మీద కాస్త మందంగానే చపాతీలాగా ఒత్తుకోండి. దాన్ని పెనం మీద గుడ్డతో సహా వేసేసి, నిమిషం ఆగాలి. తర్వాత మెల్లగా అంటే గుడ్డ పైకి వచ్చేస్తుంది. రొట్టె పెనం మీద ఉండిపోతుంది.
7. అంచుల వెంబడి నూనె వేసుకుని ఈ రొట్టెను కాల్చుకోవాలి. రెండువైపులా బాగా కాల్చుకోవాలి.
8. అంతే.. పొప్పడికాయ రొట్టె రెడీ అయినట్లే. ఈ రొట్టెల్ని అలాగే తినేయొచ్చు. లేదా ఏదైనా చట్నీతో, ఊరగాయతో సర్వ్ చేసుకోవచ్చు. కొన్ని చోట్ల పెరుగుతో కూడా తింటారు. మీ ఇష్టాన్ని బట్టి లాగించేయండి.
పొప్పడికాయకుండే పచ్చిదనం ఈ రొట్టెలో ఉండకూడదంటే.. తురుము వీలైనంత సన్నగా ఉండాలి. అలాగే రొట్టెను సన్నం మంట మీద బాగా కాల్చుకోవాలి.