Sugar free Tablets: షుగర్ ఫ్రీ మాత్రలు వేసుకుంటున్నారా? పంచదార తినడం కంటే డేంజర్ అంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
20 July 2024, 10:30 IST
Sugar free Tablets: ఒక పరిశోధన ప్రకారం, కృత్రిమ స్వీటెనర్లు జీర్ణవ్యవస్థ, ప్రేగులలో ఉన్న బ్యాక్టీరియాపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీని వల్ల వ్యక్తి ఆకలి అలవాటు దెబ్బతింటుంది.
షుగర్ ఫ్రీ మాత్రలు వేసుకోవచ్చా?
చక్కెర ఆరోగ్యానికి ఎంతో చేటు చేస్తుంది. పంచదారతో చేసిన పదార్థాలను ఎంత తక్కువగా తింటే అంత మంచిదని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. డయాబెటిస్ ఉన్న వారు పంచదారకు బదులు షుగర్ ఫ్రీ మాత్రలు వాడుతున్నారు. వాటిని పాలు, టీలలో వేసుకుని కలుపుకుని తాగేస్తున్నారు. వీటినే కృత్రిమ స్వీటెనర్లు అంటారు. చక్కెర లేని మాత్రలు వాడడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయని, మంచి ఆరోగ్యానికి సహాయపడతాయని భావిస్తారు. కానీ ఈ అభిప్రాయం తప్పని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
వాస్తవానికి, WHO నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 400 మిలియన్ల మంది డయాబెటిస్ వ్యాధితో బాధుపడుతున్నారు. ఈ ప్రమాదకరమైన వ్యాధిలో ఇన్సులిన్ స్థాయి అసమతుల్యం అవుతుంది. ఇలాంటి సమయంలో సహజ చక్కెర లేదా కృత్రిమ స్వీటెనర్‌ను ఆహారం, పానీయాలలో ఉపయోగించకూడదని డబ్ల్యూహెచ్ఓ తన నివేదికలో తెలిపింది. సహజమైన పండ్లలో ఉన్న చక్కెర బరువు తగ్గడానికి, శరీరంలోని కేలరీల మొత్తాన్ని తగ్గించడానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ఇలాంటి ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్లు వల్లే హాని కలుగుతుంది. కెనడాలోని మానిటోబా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం, కృత్రిమ స్వీటెనర్ జీర్ణవ్యవస్థ, ప్రేగులలో ఉన్న బ్యాక్టీరియాపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీని వల్ల వ్యక్తి ఆకలి అలవాటు దెబ్బతింటుంది.
కృత్రిమ స్వీటెనర్‌తో ఈ వ్యాధులు
ప్రజలు తమను తాము ఆరోగ్యంగా ఉంచడానికి చక్కెరకు బదులుగా కృత్రిమ స్వీటెనర్ను ఉపయోగిస్తారు. కానీ అలా చేసేటప్పుడు, దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల వారు ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం పెరిగిపోతుంది. మరో మాటలో చెప్పాలంటే, కృత్రిమ స్వీటెనర్లలో కేలరీలు తక్కువగా ఉండవచ్చు, కానీ అవి ఆరోగ్యానికి చాలా దుష్ప్రభావాలను కలిగిస్తాయి. వీటిలో ఉండే రసాయనాలు శరీరంలో మంటను కలిగిస్తాయి. కాలేయాన్ని బలహీనపరుస్తాయి. ఆరోగ్యానికి కృత్రిమ తీపి పదార్థాలు, షుగర్ ఫ్రీ మాత్రలు తీసుకోవడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం.
ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు తినేటప్పుడు అందులో క్యాలరీల పరిమాణం తక్కువగా ఉంటుందని, ఎంతైనా తినవచ్చనే సందేశం మెదడుకు చేరుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల వాటిని అధికంగా తినేసే అవకాశం ఉంది. కృత్రిమ స్వీటెనర్లు మీ ఆకలిని పెంచడం ద్వారా మీకు ఊబకాయం సమస్యను పెంచుతాయి. మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ చేసిన ఒక పరిశోధన ప్రకారం, ఆర్టిషిఫియల్ స్వీటెనర్లు జీవక్రియ, ఆకలిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
అధిక రక్తపోటు
చక్కెర రహిత ట్యాబ్లెట్లు గుండె ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కృత్రిమ స్వీటెనర్లతో తయారు చేసిన పానీయాలను రోజుకు రెండుసార్లు కంటే ఎక్కువ తినే వ్యక్తులు… ఇది వారి రక్తపోటును పెంచుతుంది. ప్రజలలో అధిక రక్తపోటు, గుండె సమస్యలు, కొరోనరీ హార్ట్ డిసీజ్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
అలెర్జీలు
కృత్రిమ స్వీటెనర్లలో ఉండే అస్పర్టమే… అధిక ఉష్ణోగ్రతల వద్ద ఫార్మిక్ ఆమ్లంగా విచ్ఛిన్నమవుతుంది. దీని వల్ల అలర్జీ సమస్య వ్యక్తిని ఇబ్బంది పెడుతుంది. వీటిని ఎప్పుడైతే వేడి పాలలో, టీలలో దీన్ని వేసుకుంటారో అప్పుడు అస్పర్టమే ఫార్మిక్ ఆమ్లంగా మారిపోతుంది. దీని వల్ల తలనొప్పి, వికారం, కీళ్ల నొప్పులు, నిద్రలేమి, కంగారు మొదలైనవి కొందరిలో కనిపిస్తాయి.