Eating Late। భోజనం ఆలస్యంగా చేస్తున్నారా? ఈ సమస్యలు తప్పవు!
12 August 2023, 16:24 IST
- Eating Late: వేళకి భోజనం చేయకపోవడం వలన కూడా పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆలస్యంగా తినడం వలన ఎలాంటి నష్టాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.
Eating Late - lunch or dinner
Eating Late: ఈ రోజుల్లో ప్రజలు తమ ఆరోగ్యం కోసం చేయాల్సినవన్నీ చేస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంపై దృష్టి పెడుతున్నారు. కానీ, వేళకు తినడం మాత్రం మరిచిపోతున్నారు. మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తున్నప్పటికీ వేళకి భోజనం చేయకపోవడం వలన కూడా పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మధ్యాహ్నం పనిలో మునిగిపోయి లంచ్ సాయంత్రం చేయడం లేదా రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చి అర్ధరాత్రి భోజనాలు చేయడం వంటివి ఆరోగ్యంపై దుష్ప్రభావాలను కలిగిస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం లంచ్ ఆలస్యంగా చేసినట్లయితే కడుపు సంబంధిత సమస్యలు, జీర్ణాశయ వ్యాధులు ఇబ్బంది పెట్టవచ్చు. ఆలస్యంగా తినడం వలన ఎలాంటి నష్టాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.
ఎసిడిటీ
మీరు మధ్యాహ్న భోజనం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంటల మధ్య పూర్తి చేయాలి. లేనిపక్షంలో మీకు కడుపులో ఎసిడిటీ సమస్య ఉండవచ్చు. సమయానికి లంచ్ చేయకపోవడం వల్ల గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి వస్తుంది. దీనినే యాసిడ్ రిఫ్లక్స్ వ్యాధి కూడా అంటారు. ఇవే కాకుండా, ఇతర జీర్ణ సమస్యలు, జీవక్రియ సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా లంచ్ చేయకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోతాయి, ఆలస్యంగా చేయడం వలన మళ్లీ ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది ఇలాగే కొనసాగితే, దీర్ఘకాలంలో మధుమేహానికి దారితీయవచ్చు.
తలనొప్పి
సమయానికి భోజనం చేయకపోవడం వల్ల తలనొప్పి వస్తుంది. ఇది ఆకలి కారణంగా కలిగే తలనొప్పి. భోజనం ఆలస్యం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి, ఇది తలనొప్పిని ప్రేరేపిస్తుంది. ఈ తలనొప్పి కారణంగా కొన్నిసార్లు కోపం, చిరాకు కూడా కలుగుతుంది. అంతేకాకుండా చాలా బలహీనంగా, నీరసంగా అనుభూతి చెందుతారు. పనులపై దృష్టి పెట్టలేరు.
గ్యాస్
మధ్యాహ్నం భోజనం చేయకపోతే కడుపులో గ్యాస్ సమస్య రావచ్చు. కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్, మీథేన్, హైడ్రోజన్, ఆక్సిజన్‌లతో తయారైన వాయువులు కూడా పొత్తికడుపులో నొప్పిని కలిగిస్తాయి. కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉంటాయి2. దీర్ఘకాలంలో గ్యాస్ కారణంగా మీ పొట్ట ముందుకు రావచ్చు.
రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తే కలిగే దుష్ప్రభావాలు
మీరు రాత్రిపూట కూడా ఆలస్యంగా తింటే, మీరు తీసుకునే కేలరీలు సరిగా జీర్ణం కావు. ఫలితంగా, అవి మీ శరీరంలో కొవ్వుగా నిల్వ చేయబడతాయి. తరచుగా ఆలస్యంగా తినడం వల్ల మీ శరీరం కేలరీలను కొవ్వుగా నిల్వ చేస్తుంది, ఇది బరువు పెరగడానికి, ఊబకాయానికి దారితీస్తుంది. అంతేకాకుండా అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది.
ఆరోగ్య నిపుణుల ప్రకారం, సాయంత్రం 7 లోపు డిన్నర్ పూర్తి చేయాలి. నిద్రపోవడానికి కనీసం 2-3 గంటల ముందే రాత్రి భోజనం తినేయాలి. అలాగే తిన్నవెంటనే పడుకోకూడదు అని సూచిస్తారు.
నిద్రవేళకు కనీసం రెండు గంటల ముందు రాత్రి భోజనం చేసే వారికి క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. పురుషులకు, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 26% తగ్గుతుంది , స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 16% తగ్గుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి.