Sunday Motivation: చిన్నదో, పెద్దదో జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి, లక్ష్యం లేని జీవితం దారం తెగిన గాలిపటంలాంటిది
18 February 2024, 5:00 IST
- Sunday Motivation: ఒక లక్ష్యంతో జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లాలని చెబుతారు పెద్దవారు. కానీ ఎంతోమంది ఎలాంటి లక్ష్యాన్ని పెట్టుకోకుండా ముందుకు సాగిపోతున్నారు. అలాంటి వారి జీవితాలు దారం తెగిన గాలిపటాలు వంటివి.
మీ జీవితానికి ఒక లక్ష్యం అవసరం
Sunday Motivation: ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు... లక్ష్యం అంటూ ఉంటే వారి జీవితాలు సవ్యంగా ముందుకు సాగుతాయి. ఆ లక్షణాలను సాధించడానికి ఒక క్రమ పద్ధతిలో జీవితాన్ని సాగిస్తారు. లక్ష్యం లేకుండా ముందుకు సాగే వారు జీవితంలో ఏదీ సాధించలేరు.
లక్ష్యాన్ని సాధించడానికి మీరు వేసే మొదటి అడుగు చాలా ముఖ్యమైనది. ఆ మొదటి అడుగు... ముందుగా మీకంటూ ఒక లక్ష్యాన్ని సెట్ చేసుకోవడం. గమ్యం లేని ప్రయాణం ఎందుకు పనికిరానిది. మీ జీవితంలో ఎలాంటి పురోగతిని తీసుకురాదు. కాబట్టి ఒక గమ్యాన్ని నిర్దేశించుకుని ముందుకు చేరండి. ఉదాహరణకు మీరు మంచి పెయింటర్ కావాలనుకుంటే... పెయింటర్ కావడానికి ఏమేం చేయాలో వాటన్నింటినీ పాయింట్ల రూపంలో రాసుకొని ముందుకు సాగండి. మీరు మంచి సింగర్ కావాలి అనుకుంటే సింగర్ కావడానికి మీకు కావాల్సిన అవసరాలు ఏంటో తేల్చుకుని ముందుకు నడవండి.
లక్ష్యాన్ని సెట్ చేసుకున్నాక ఒకేసారి ఆకాశాన్ని అందుకోవడానికి ప్రయత్నించకూడదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ చిన్నచిన్న దశలుగా లక్ష్యం వైపు ముందుకు సాగాలి. అప్పుడు మీకు నిరుత్సాహం తగలకుండా ఉంటుంది. లేకుంటే ఒకేసారి ఆకాశాన్ని అందుకోవాలని అనుకుంటే నేల మీద పడడం ఖాయం. అప్పుడు నిరుత్సాహం భయం, ఓటమి కలుగుతాయి.
ఎంతోమంది బరువు తగ్గడాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఒకేసారి సన్నగా, మెరుపు తీగలా అయిపోవడం కష్టమే. కానీ నెలకి మూడు కిలోలు చొప్పున తగ్గాలన్న లక్ష్యం పెట్టుకుని చూడండి. కచ్చితంగా మీరు తగ్గి తీరుతారు. లక్ష్యమంటే అతి పెద్దగా ఉండాలని లేదు. చిన్నదైనా సరే దాన్ని సాధించడం చాలా ముఖ్యం.
మీ లక్ష్యసాధనలో ధైర్యంగా ఉండాల్సింది మీరే. మీ స్నేహితులలో, కుటుంబ సభ్యులను చూసి ధైర్యం తెచ్చుకోకండి. మీ మీద మీరు నమ్మకాన్ని ఉంచండి. మిమ్మల్ని చూసే మీరు ధైర్యం తెచ్చుకోండి. ఎప్పుడైతే పక్కవారి మీద ఆధారపడతారో... మీలో లక్ష్యాన్ని చేరుకోవాలన ఆలోచన క్షీణించడం మొదలవుతుంది.
మీ గమ్యాన్ని చేరుకోవడంలో మీరు ఒక దశను పూర్తి చేస్తే ఆ విజయాన్ని కచ్చితంగా సెలబ్రేట్ చేసుకోండి. అది మీలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. మీ చుట్టూ సానుకూల వ్యక్తులు ఉండేలా చూసుకోండి. మీలో స్ఫూర్తి నింపే పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోండి. వారంలో ఒక్కసారి కచ్చితంగా రెండు మూడు గంటలసేపు ఎలాంటి టెన్షన్, ఒత్తిడి లేని ప్రదేశంలో వెళ్లి ప్రశాంతంగా కూర్చోండి. అది మీకు వారానికి సరిపడా శక్తిని అందిస్తుంది.
మీ చుట్టూ జరిగే అనవసర విషయాల కోసం మీ మెదడును వాడకండి. మెదడు శక్తిని పొదుపు చేసుకొని దాచుకోండి. మీ లక్ష్యాన్ని సాధించే దిశగానే మీ మెదడుకు పని చెప్పండి. అంతే తప్ప చుట్టుపక్కల జరిగే అనవసర విషయాల్లో తలదూరిస్తే మీ మెదడు పనిచేసే తీరే మారిపోతుంది. ఆలోచనలు కూడా మారిపోవచ్చు. కాబట్టి మీ లక్ష్యాన్ని సాధించడం ఒకటే మీ మెదడులో నింపుకోండి. కచ్చితంగా మీరు మీ గమ్యాన్ని చేరుకుంటారు.
టాపిక్