Saturday Motivation | నువ్వు నీ లక్ష్యాన్ని వెంబడించు.. ఇతరులను కాదు!
Saturday Motivation: జీవితంలో విజయం సాధించాలంటే నీ ఆట నువ్వు ఆడాలి, నీ లక్ష్యం వైపు పరుగులు తీయాలి. మీలో ప్రేరణ నింపే ఒకా స్ఫూర్థిదాయకమైన కథను ఇక్కడ చదవండి.
Saturday Motivation: జీవితంలో ప్రతీ ఒక్కరికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి, అప్పుడే ఆ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. చాలా మంది ఎన్నో లక్ష్యాలను కలిగి ఉంటారు. కానీ ఎన్నో కారణాల చేత తమ లక్ష్యాన్ని విడిచి మరో జీవితంలో జీవిస్తుంటారు. ఆపై తమలో తామే చింతిస్తుంటారు, తాను ఈ స్థాయిలో ఉండాల్సిన వాడిని, కానీ పరిస్థితుల ప్రభావం వలన అంతకు తక్కువ స్థాయిలో ఉన్నానని మదనపడతారు. కానీ అది పరిస్థితుల ప్రభావమే కాకపోవచ్చు, అందులో వారి తప్పిదమూ ఉండవచ్చు. మీలో కూడా చాలా మంది చదువుకునే రోజుల్లో, లేదా మీ జీవితంలో ఒకానొక దశలో మీకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకొని ఉండవచ్చు. దాని గురించి అందమైన కలలు కని ఉండవచ్చు. ఒకరు డాక్టర్ అవ్వాలని, మరొకరు యాక్టర్ అవ్వాలని, సినిమా డైరెక్టర్ అవ్వాలని లేదా ఒక నాయకుడు అవ్వాలని కలలు కని ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీ కలలు అనేవి కలలుగానే మిగిలిపోయి ఏదో ఒక ఉద్యోగంలోనో లేదా వ్యాపారంలోనో స్థిరపడి ఉండవచ్చు. మరి ఇలా ఎందుకు జరిగి ఉండవచ్చు అని అనుకుంటున్నారు? దీనికి సమాధానం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం..
ఒక వ్యక్తి తన కుక్కపిల్లను వెంటబెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు. దారిలో అతడికి ఒక గురువు ఎదురైతే ఆ వ్యక్తి అతడికి నమస్కరించి, తన బాధను చెప్పుకుంటాడు. స్వామీజీ, నేను నా జీవితంలో చాలా కష్టపడ్డాను, చాలా చదివాను, చాలా ప్రయత్నాలు చేశాను, అయినప్పటికీ నా జీవితంలో నేను విజయం సాధించలేకపోయాను, నా లక్ష్యాలను చేరుకోలేకపోయాను, దేవుడు నా రాత ఇలా ఎందుకు రాశాడో అని అంటాడు. అప్పుడు ఆ స్వామిజీ బదులిస్తూ, కొద్దిదూరంలో ఉన్న ఒక ప్రదేశం పేరు చెప్పి ఒక వస్తువును తీసుకొని రమ్మంటాడు. నీకు సమాధానం దొరుకుతుందని చెబుతాడు. దీనికి ఆ వ్యక్తి వెంటనే స్వామిజీ చెప్పిన ప్రదేశానికి తన కుక్కపిల్లను వెంటబెట్టుకొని బయలుదేరుతాడు, కొద్దిసేపటి తర్వాత స్వామిజీ చెప్పిన వస్తువును తీసుకొని వస్తాడు. స్వామీజీ ఏం చెప్తాడో అని ఆత్రుతతో చూస్తాడు.
ఇంతలో ఆ వ్యక్తిని చూసిన స్వామిజీ మాట్లాడుతూ నువ్వెంతో ఉత్సాహంతో ఉన్నావు, నీతో కూడా వచ్చిన నీ కుక్కపిల్ల ఎందుకో అలిసిపోయినట్లుగా ఉంది అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి బదులిస్తూ.. నా కుక్కపిల్ల దారినపోయే కుక్కపిల్లల వెంట పరుగులు పెట్టింది, ఆటలు ఆడింది మళ్లీ నా వెంట వచ్చింది, అందుకే అలిసిపోయి ఉంటుంది. నేను మామూలుగా నడిచాను కాబట్టి అలసట లేదు అంటాడు. దీనికి వెంటనే స్వామిజీ బదులిస్తూ అదే నీకు సమాధానం అని చెబుతాడు. నువ్వు నీ లక్ష్యం చేరకపోవడానికి నువ్వు కూడా ఒకప్పుడు ఇతరులను చూసి పరుగులు పెట్టినవాడివే. నీ లక్ష్యం నీకు ఎదురుగా ఉన్నప్పటికీ పక్కదారిపట్టడం వల్లే ఇలా జరిగింది అని చెబుతాడు.
ఇక్కడ మీకు కూడా విషయం అర్థమైనట్లే కదా? మీలో చాలా మంది ఏదో ఉద్దేశ్యంతో బీటెక్, బీఫార్మసీ అని చదివి ఉంటారు, ఆ తర్వాత అందరినీ చూసి ఎంబీయే వైపు, ఆ తర్వాత బ్యాంక్ కోచింగ్, ఆ తర్వాత సాఫ్ట్ వేర్ కోచింగ్.. ఇలా ఇకదానితో ఒకటి సంబంధం లేకుండా ఇతరులను చూసి పరుగులు పెడితే ఏం ఉపయోగం? అందుకే నువ్వు నీ లక్ష్యాన్ని మాత్రమే వెంబడించు, ఇతరులను కాదు.. నీ మార్గంలో నువ్వు వెళ్తుంటే, నీ గమ్యాన్ని నువ్వు కచ్చితంగా ముద్దాడుతావు.
సంబంధిత కథనం