Sunday Motivation | పరీక్షల్లో ఫెయిల్ అయి కూడా జీవితంలో విజేతగా నిలిచిన వారెందరో!
07 May 2023, 5:05 IST
- Sunday Motivation: గెలవాలంటే కావాల్సింది డిగ్రీ పట్టాలు కాదు, పట్టుదల. సాధించాలనే తపన ఉంటే ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు తప్పకుండా సాధించి తీరతారు.
Sunday Motivation
Sunday Motivation: జీవితంలో గొప్పవ్యక్తిగా మారటానికి పెద్దపెద్ద చదువులు చదవాల్సిన అవసరం లేదు. పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించిన వారే జీవితంలోనూ టాప్ లో ఉంటారనే హామీ లేదు. డిగ్రీ మధ్యలోనే ఆపేసిన వారు కూడా జీవితం అనే పరీక్షలో డిస్టింక్షన్ లో పాస్ అయిన వారు ఉన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయి కూడా విజేతగా నిలిచిన వారు మరెందరో ఉన్నారు. గెలవాలంటే కావాల్సింది డిగ్రీ పట్టాలు కాదు, పట్టుదల! సాధించాలనే తపన ఉంటే ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు తప్పకుండా సాధించి తీరతారు.
రేపు మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారో దాని గురించి కలలు కనండి. మీకు ఇచ్చిన పని కాకుండా, మీకు నచ్చిన పని చేయండి, బాగా వచ్చిన పని చేయండి. అప్పుడే మీరు అద్భుతాలు చేయగలరు. కానీ ఇలా చేసేందుకు మనకు ధైర్యం ఉండదు. ఎందుకంటే జీవితంలో విజయం కోసం కష్టపడుతున్న వారిలో చాలా మంది మధ్య తరగతి వారే ఉంటారు. కుటుంబం కోసం తమ కలలను పక్కన పెట్టి, అహర్నిశలు కష్టపడుతున్న వారెందరో ఉన్నారు. కానీ ఎంత పనిచేసినా, ఎన్ని సంవత్సరాలుగా చేసినా బ్యాంకు ఖాతాలో డబ్బు పెరగదు, జీవితంలో వృద్ధి అనేది జరగదు. గమ్యం లేని ప్రయాణంలా సాగుతుంది బ్రతుకు.
కానీ, ఎవరైతే అడుగు ధైర్యంగా వేస్తారో, కట్టుబాట్లను తెంచుకొని తమదైన మార్గంలో పయనిస్తారో వారే ఇంకొకరికి దారి చూపగలరు. విజేతగా నిలవగలరు.
మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు నెలకు లక్షల్లో జీతాలు తీసుకుంటారు. పెద్ద కంపెనీలో సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ మైక్రోసాఫ్ట్ అనే దిగ్గజ సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపించిన బిల్ గేట్స్ కనీసం డిగ్రీ కూడా పూర్తిచేయలేదు. ఈ కంపెనీకి ముందు ఒక కంపెనీని స్థాపించి తీవ్రంగా నష్టపోయాడు. చేతిలో చిల్లిగవ్వ కూడా మిగల్లేదు. . కానీ, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఆధారిత విషయాలపై అతడికి ఉన్న తీవ్రమైన కోరిక, అభిరుచి అతన్ని 'మైక్రోసాఫ్ట్' బ్రాండ్ పేరుతో ఇంత పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపించేలా చేసింది. పెద్దపెద్ద చదువులు చదివిన వారు ఆయన కంపెనీలో చిన్న ఉద్యోగం వచ్చినా చాలని కలలు కంటారు.
ఒక్క ఈయనే కాదు, మన దేశంలో మన చుట్టూ నిన్నమొన్నటి వరకూ మన మధ్య తిరిగిన వారు కూడా ఈరోజు ఎక్కడికో ఎదిగిపోయిన వారు ఉన్నారు. కాబట్టి చదువు లేదనో, డిగ్రీలు తక్కువయ్యాయనో మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి, ఓటమికి భయపడకండి, ఎక్కడా తగ్గకండి. కఠినంగా మీ కలలవైపు దూసుకెళ్లండి.