Summer Tips | ఎండాకాలంలో ఈ తప్పులు చేయొద్దు.. వడదెబ్బకు నివారణ మార్గాలు ఇవిగో!
16 March 2022, 22:27 IST
- ఎండలో తిరిగినపుడు అలసటగా అనిపిస్తే అది ఎండదెబ్బకు సంకేతం కావొచ్చు. ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయి, నివారణ మార్గాలేమిటో చూడండి..
Summer Tips
వేసవి రావడంతో పాటు తోడుగా కొన్ని సైడ్ ఎఫెక్ట్‌లను కూడా తీసుకొస్తుంది. ఈ సీజన్‌లో వేడి గాలులు, ఉక్కపోత కారణంగా అలసట, తలనొప్పి, వికారం లాంటి అనారోగ్య సమస్యలతో పాటు ప్రాణాంతకమైన వడదెబ్బ కూడా సంభవిస్తుంది. ఈ ఎండాకాలంలో మన శరీరంలో చోటుచేసుకునే లక్షణాలను ఒక కంట కనిపెడుతుండటం ఎంతో ముఖ్యం. మీకు మీరుగా జాగ్రత్తలు తీసుకోవాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి.
మనం అధిక ఉష్ణోగ్రతలకు గురైనపుడు మన శరీరంలోని నీరు, లవణాలు చెమట రూపంలో ఆవిరైపోతుంది. దీంతో శరీరం శక్తిని కోల్పోయి నీరసంగా అనిపిస్తుంది. 40 డిగ్రీల సెల్సియస్ ఎండలో ఎక్కువగా తిరిగినపుడు లేదా శారీరక శ్రమ చేసినపుడు అది ఎండదెబ్బకు దారితీస్తుంది.
ఎండాకాలంలో అలసటను అస్సలు అశ్రద్ధ చేయవద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎండదెబ్బ తగిలినపుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, నివారణ మార్గాలు ఏమిటో ఫోర్టిస్ హాస్పిటల్ డాక్టర్ సందీప్ పాటిల్ వివరించారు.
ఎండదెబ్బ లక్షణాలు
శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తుంది. అంతా గందరగోళంగా వికారంగా అనిపిస్తుంది. చెమటపట్టే విధానంలో మార్పులు గమనించవచ్చు. ఇవేకాకుండా తీవ్రమైన తలనొప్పి, శ్వాస ఎక్కువగా తీసుకుంటాం. ఇలాంటి లక్షణాలు వడదెబ్బ తగిలిందనే సంకేతాలను ఇస్తుంది. దీనికి వెంటనే చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.
ఎండదెబ్బను నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది గుండె, మూత్రపిండాలు, మెదడు, కండరాల పనితీరును దెబ్బతీస్తుంది. తద్వారా మరణం సంభవించవచ్చు.
నివారణ మార్గాలు
* హైడ్రేటెడ్‌గా ఉండాలి. వేడిని తట్టుకోవడానికి తరచుగా నీరు, నిమ్మరసం, పండ్ల రసాలు, సల్ల, లస్సీ వంటివి తీసుకోండి.
* బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ అలాగే సన్ గ్లాసెస్ ఉపయోగించండి
* వేడి ఎక్కువగా ఉండే సమయాల్లో ఆరుబయట తిరగటం మంచిది కాదు
* మధ్యాహ్నం సమయంలో బాగా వెంటిలేషన్ లేదా ఎయిర్ కండిషన్ సరిగ్గా ఉన్న ప్రదేశాలలో ఉండటానికి ప్రయత్నించండి
* పిల్లలు, వృద్ధులు సాయంత్రం వేళల్లో ఉష్ణోగ్రత తగ్గినప్పుడు మాత్రమే బయటకు వెళ్లాలి
* ప్రయాణ సమయాల్లో తేలికపాటి కాటన్ దుస్తులు ధరించి తలను కప్పుకోవాలి
ఎండలో తిరిగి వచ్చిన తర్వాత అలసటగా అనిపించి, పైన పేర్కొన్న లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.