తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఎండాకాలంలో కూల్ కూల్ తాటి ముంజల్..

ఎండాకాలంలో కూల్ కూల్ తాటి ముంజల్..

Manda Vikas HT Telugu

28 February 2022, 19:01 IST

google News
    • ఐస్ యాపిల్‌ను సాధారణంగా నుంగు పండు లేదా తాటి ముంజ అంటారు. ఇందులో ఫైటోన్యూట్రియంట్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. కొద్ది మొత్తంలో పీచు పదార్థం కలిగి ఉంటుంది, ఇందులో విటమిన్లు A, C, B7, E, K , ఐరన్ ఉన్నాయి. కాబట్టి కాలానుగుణంగా ఈ ముంజలను తినటం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
Ice Apple
Ice Apple (Stock Photo)

Ice Apple

ఐస్ యాపిల్ (పామ్ ఫ్రూట్)ను సాధారణంగా నుంగు పండు లేదా తాటి ముంజ ఇలా ప్రాంతాన్ని బట్టి వివిధ పేర్లతో పిలుస్తారు. వేసవిలో తాటి చెట్టుకు బొండంలాగా కాసి దాని లోపల ఈ ముంజలు తయారవుతాయి. చూడటానికి నిగనిగలాడుతూ పారదర్శకమైన జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. జ్యూస్ గడ్డకటినట్లుగా కనిపించే ఈ పండు సహజమైన చలువ లక్షణాలను కలిగి ఉంటుంది. శరీరంలోని టాక్సిన్‌లను వదిలించుకోవడానికి, శరీర సహజ ఉష్ణోగ్రతను నియంత్రించటానికి ఐస్ యాపిల్ అద్భుతంగా సహాయపడుతుంది.  ఆకృతిలో లిచీని పోలి ఉండే తాటి ముంజలు రుచి విషయానికి వస్తే,  లేత కొబ్బరిలా ఉంటుంది. 

దక్షిణభారతంలో ఎక్కువ..

తాటి చెట్లు ఎక్కువగా దక్షిణ భారతదేశంలో కనిపిస్తాయి. సీజన్ ప్రకారం తాటి చెట్లకు కాసే ఈ పండ్లు శరీరానికి అవసరమయ్యే ఖనిజాలు, తక్కువ కేలరీ చక్కెరను సరఫరా చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఫైటోన్యూట్రియంట్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. కొద్ది మొత్తంలో పీచు పదార్థం కలిగి ఉంటుంది, ఇందులో విటమిన్లు A, C, B7, E, K , ఐరన్ ఉన్నాయి. కాబట్టి కాలానుగుణంగా ఈ ముంజలను తినటం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

ఐస్ యాపిల్ వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు:

1. ఐస్ ఆపిల్ వేసవిలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ సహజంగా చల్లబరుస్తుంది. ఇది దాహాన్ని తీర్చడమే కాకుండా రోజంతా చురుకుగా ఉండేలా శక్తిని అందిస్తుంది.

2. ఐస్ యాపిల్‌లో కావాల్సిన మొత్తంలో ఖనిజాలు సోడియం, పొటాషియం ఉంటాయి, ఇది శరీరంలో ద్రవం, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఐస్ ఆపిల్‌కు ఉన్న ఈ లక్షణం వేసవిలో డీహైడ్రేషన్,  అలసటను నివారించడంలో ఉత్తమంగా పనిచేస్తుంది.

3. ఇది అనేక ఉదర సంబంధ వ్యాధులు, జీర్ణ సమస్యలకు సహజమైన ఔషధం. ఐస్ ఆపిల్ మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది, ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది.  అసిడిటీ , స్టమక్ అల్సర్ల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.  చిన్నపాటి కడుపునొప్పిని, గర్భధారణ సమయంలో తరచుగా వచ్చే వికారాలను తగ్గిస్తుంది.

4.ఐస్ యాపిల్‌లో అనేక ఫైటోకెమికల్స్ ఉండటం వల్ల బలమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇవి వృద్ధాప్యాన్ని తగ్గించడంలో, గుండె జబ్బులు,  క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

5. వేసవిలో వేడి దద్దుర్లు, పొక్కులు వంటి చర్మ సమస్యలు చాలా సాధారణం. అయితే ఐస్ ఆపిల్ గుజ్జును అప్లై చేయడం వల్ల శరీరంపై  కలిగే దురద నుంచి ఉపశమనం కలుగుతుంది.  ఎండాకాలంలో వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తూ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

6. ఐస్ యాపిల్‌లో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది  శరీరంలోని టాక్సిన్‌లను శుభ్రపరచడంలో సహాయపడుతుంది, కాలేయ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా వివిధ రకాల ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే ఫైటోకెమికల్స్, ఆంథోసయనిన్ లాంటి వాటిని నిర్మూలిస్తుంది. ఐస్ యాపిల్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తాటి ముంజలు సహజంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

అయితే చాలామంది ముంజల పైన పొట్టులాగా ఉండే పైపొరను తీసేసి తింటారు. కానీ ఆ పొట్టులోనే ఎన్నో రకాల పోషకాలుంటాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అవి చాలా అవసరం. అలాగే ఈ పొట్టువల్లే శరీరానికి ఎక్కువ చలువ చేస్తుంది. కాబట్టి తాటి ముంజల్ని పొట్టు తీయకుండా తింటేనే ఆరోగ్యానికి మంచిది.

 

టాపిక్

తదుపరి వ్యాసం