Speed Up Recovery | ఇన్ఫెక్షన్ల నుంచి వేగంగా కోలుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి!
19 July 2022, 19:32 IST
- వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. వైరల్ ఫీవర్, ఫ్లూ వంటివి వచ్చినపుడు వేగంగా కోలుకోడానికి ఆరోగ్య నిపుణులు తెలిపిన సలహాలు, సూచనలు ఇక్కడ ఉన్నాయి.
Speed Up Your Recovery from Seasonal Infections
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలడం సర్వసాధారణం. తేమ వాతావరణం కారణంగా బాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ సీజన్ లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. కరోనా వ్యాప్తి ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. కొత్తగా మంకీపాక్స్, నల్ల జ్వరం వంటివి ప్రబలుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా గొంతు నొప్పితో మొదలవుతాయి. దీనితో పాటు ముక్కు కారటం, జ్వరం, దగ్గు లోపలి నుంచి పొడిచినట్లుగా అనిపించడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. మీరు ఇన్ఫెక్షన్ సోకినట్లు అనుమానం ఉంటే, వాటి ప్రారంభ లక్షణాలను గమనించిన వెంటనే అప్రమత్తమైతే వేగంగా కోలుకోవచ్చు.
ఇన్ఫెక్షన్లు సోకినపుడు ప్రాథమికంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఏం చేయకూడదు, ఏం చేయాలి అలాగే ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి తదితర అంశాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
లక్షణాలు కనిపించినపుడు ఏం చేయాలి?
వైరస్ ఎక్కువగా ముక్కు, కళ్లు అలాగే నోటి ద్వారా శరీరంలోకి చొరబడి దాడి చేస్తుంది. ఈ క్రమంలో తొలుత గొంతు నొప్పి మొదలవుతుంది. ఆ తర్వాత ఎగువ శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీంతో ముక్కు కారటం, కళ్ల నుంచి నీరు రావటం, జలుబు, దగ్గు, క్రమంగా జ్వరం రావటం జరగవచ్చు. అయితే మీకు తుమ్ములు రావటం, కొంచెం గొంతు నొప్పిగా అనిపించడం, అలాగే నీరసంగా అనిపించినపుడు ముందుగా గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పును వేసుకొని నోటిని పుక్కిలించండి. మీ వద్ద బెటాడిన్ గార్గిల్ ఉంటే, మీరు దానిని కూడా ఉపయోగించవచ్చు. ఆ తర్వాత ఆవిరి పట్టడం వంటి హోమ్ రెమెడీస్ ప్రయత్నించండి.
వెంటనే మందులు తీసుకోవద్దు
సొంత వైద్యం అసలే వద్దు. కొద్దిగా అస్వస్థత అనిపించిన వెంటనే మందులు వేసుకోవడం. యాంటీబయాటిక్స్, ఇతర ఔషధ మాత్రలు తీసుకోవడం చేయవద్దు. మీకు జ్వరం వచ్చిందంటే మీ రోగనిరోధక వ్యవస్థ వైరస్‌తో పోరాడుతున్నట్లు అర్థం. శరీర ఉష్ణోగ్రత పెరగటం వలన తేలికపాటి ఇన్ఫెక్షన్లు నశిస్తాయి. కాబట్టి జ్వరం రాగానే తగ్గించడానికి వెంటనే కౌంటర్ ఔషధాన్ని తీసుకోకండి. ఉష్ణోగ్రత 99 ఫారెన్‌హీట్‌కు పెరగడం సాధారణంగా జ్వరంగా పరిగణించలేము. ఒకవేళ శరీర వేడి 100 ఫారెన్‌హీట్ కంటే ఎక్కువ ఉంటే దానిని జ్వరం అంటారు. ఇంటి చిట్కాలతో తేలికపాటి జ్వరం తగ్గకపోతే, జ్వరం తీవ్రమైతే వైద్యుల సలహా మేరకే ఔషధాలు తీసుకోండి.
ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
జింక్, విటమిన్ డి, విటమిన్ సి వంటివి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. కాబట్టి విటమిన్లు సమృద్ధిగా లభించే ఆహారాలు, తాజా పండ్లు తీసుకోవాలి. ఎండలో కూర్చుని డ్రై ఫ్రూట్స్ తినవచ్చు, విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లను తినవచ్చు. అయితే గొంతు నొప్పి ఉన్నప్పుడు మాత్రం పుల్లని పండ్లు, పెరుగు, సోడా కలిగిన పానీయాలు తీసుకోకండి. గోరు వెచ్చని నీరులో తేనెను కలిపి తీసుకోండి. నీరు పుష్కలంగా త్రాగాలి. పండ్ల రసాలు, పౌడర్ రూపంలో దొరికే ఓఆర్ఎస్ వంటి లవణాలను నీటిలో కలిపి తీసుకోవచ్చు.
తేలికగా జీర్ణమై మంచి శక్తిని అందించే ఆహారాన్ని తీసుకోండి. తాజాగా ఇంట్లో తయారుచేసిన వేడివేడి సూప్, గ్రీన్ టీలు, పసుపు, మిరియాలు వేసిన పాలు, ప్రోటీన్లు కలిగిన ఆహారం తీసుకోండి.