కమ్మని నిద్రను రారమ్మని ఆహ్వానించండి, త్వరగా నిద్రపట్టాలంటే ఈ టిప్స్ పాటించండి
28 February 2022, 14:42 IST
- సుఖవంతమైన నిద్రకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. ప్రతిరోజూ కనీసం అర్ధగంటైనా వాకింగ్, వ్యాయామం లాంటివి చేయాలి. రాత్రిపూట పడుకునే ముందు మాత్రం ఎలాంటి వ్యాయామాలు చేయొద్దు. పడకను నిద్రపోవడానికి మాత్రమే ఉపయోగించాలి.
Sleeping Tips
ఆకలేస్తే వెంటనే ఏదైనా తినేయచ్చు, దాహం వేస్తే వెంటనే నీళ్లు తాగేయచ్చు, కానీ నిద్రపోవాలనుకున్న వెంటనే మాత్రం నిద్రపోలేం. ఎందుకంటే ఆకలి, దప్పిక కడుపుకి సంబంధించినవి, నిద్ర మాత్రం మనస్సుకు సంబంధించినది. కొందరికి వెంటనే ఇలా కళ్లు మూయగానే అలా నిద్రలోకి జారుకుంటారు. కానీ చాలా మందికి అంత త్వరగా నిద్ర రాదు, దాని కోసం ఎన్నో రిహార్సల్స్ చేయాల్సి ఉంటుంది. కొందరికి కథలు చెప్తే వస్తుంది, మరికొందరికి జోలపడితే వస్తుంది. కొందరికి మందేస్తే, ఇంకొందరికి మాత్రేస్తే వస్తుంది. ఇలా ఒక్కొక్కరు ఒకలా నిద్రరావడం కోసం తంటాలు పడుతుంటారు. మీరు ఈ జాబితాలో ఉన్నారా? మీరూ కంటి మీద కునుకు లేకుండా ఉంటున్నారా? అయితే మీకు ఇక్కడ కొన్ని టిప్స్ అందిస్తున్నాం. మీకు నిద్రపట్టనపుడు ఈ టిప్స్ ఒకసారి ఫాలో అయి చూడండి.
పడక గదిని చల్లబరచండి
గదిలో వేడి, ఉక్కపోతే ఉంటే అది మిమ్మల్ని కుదురుగా ఉండనివ్వదు, వేడి వాతావరణం నిద్రరావడానికి సహకరించదు. కాబట్టి ముందుగా మీ పడకగదిలో చల్లటి వాతావరణం కల్పించండి. దీంతో మీ శరీరం కూడా చల్లగా మారుతుంది. మీ శరీరం చల్లటి అనుభూతికి లోనయినపుడు ఇది మీ మెదడుకు నిద్రపోవడానికి ఒక సంకేతాన్ని పంపుతుంది.
పడుకునే ముందు స్నానం
పడుకునే 1 లేదా 2 గంటల ముందు వెచ్చటి నీటితో స్నానం చేయండి ఇలా వెచ్చటి నీటితో స్నానం చేసినపుడు శరీరానికి ఒక రకమైన హాయిగొలిపిన అనుభూతి కలిగుతుంది. ఇది మీ నిద్రకు ఆహ్వానం పలుకుతుంది. లేదా షవర్ కింద పదినిమిషాల పాటు తడిసినా కూడా శరీరం చల్లిబడి తేలికగా అనిపిస్తుంది. ఇలా పడుకునే ముందు స్నానం చేస్తే నాణ్యమైన నిద్రపోవచ్చు అని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.
ఆలోచించడం మానేయండి
పడుకునే ముందు ఆలోచనలు ఎక్కువైతే నిద్రపట్టదు. రేపటి గురించి ఆలోచనలు, ఆందోళనలు రేపటికే వాయిదా వేయండి. నిద్రపోయే ముందు మానసికంగా ప్రశాంతత పొందేందుకు ప్రయత్నించాలి. ఒకవేళ మీరు ఆలోచనలను నియంత్రించలేకపోతే కొద్దిసేపు ప్రాణయామం, ధ్యానం లాంటివి చేయాలి. ఈ అభ్యాసాలు ప్రతిరోజూ కొనసాగిస్తే మీ ఆలోచనలను నియంత్రించే మానసిక ధృడత్వం లభిస్తుంది.
ప్రణాళిక తప్పొద్దు
ఏదైనా ప్రణాళికబద్ధంగా చేయడం అలవర్చుకోవాలి. మన శరీరంలో జీవగడియారం వ్యవస్థ పనిచేస్తుంటుంది. నిర్ధిష్ట కాలంలో ప్రతొరోజూ ఏదైనా పనిచేస్తూ ఉంటే ఆ సమయానికి మెదడుకు అలర్ట్స్ వెళ్తుంటాయి. నిద్రపోవడం, లేవడానికి కూడా ఒక నిర్ధిష్ట సమయం అంటూ కేటాయించుకోండి. అదే సమయానికి నిద్ర, ఎలాంటి అలారమ్ లేకుండానే మెలకువ వస్తుంది. సమయానికి తినడం, సమయానికి నిద్రపోవడం మీ శ్రేయస్సుకు అన్ని విధాల మంచింది.
పడక సౌకర్యం
సౌకర్యవంతమైన పడక ఉంటే మనం బెడ్ మీద ఇలా పడుకోగానే, అలా నిద్ర పట్టేస్తుంది. కాబట్టి శరీరానికి హాయిగొలిపేలా ఉండే పరిశుభ్రమైన పరుపు, దిండు, దుప్పట్లు వాడాలి. వీటి రంగులు కూడా ముదురివి కాకుండా, లేత రంగులైతే మంచిది. పడకను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. చిందరవందరగా ఉంటే నిద్రకు అనుకూలించదు.
పడుకునే పొజిషన్
సౌకర్యవంతమైన పడక ఉండగానే సరిపోదు, నిద్రపట్టాలంటే మీరు పడుకునే పొజిషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అయితే వెల్లకిలా పడుకునేవారు సుఖవంతమైన నిద్రపోతారని కొన్ని రీసెర్చీలు తేల్చాయి. కాబట్టి మీరు ఇపుడు పడుకునే పొజిషన్ లో నిద్రరాకపోతే మాత్రం అది మార్చుకోండి.
శరీరానికి ఎండ అవసరం
వెలుతురు నిద్రను ప్రభావితం చేస్తుంది. నిద్రించే సమయంలో ఎలాంటి వెలుతురు లేకుండా గదిని చీకటిగా మారిస్తే, త్వరగా నిద్ర పడుతుంది. అలాగే శరీరానికి సూర్యుని నుంచి వచ్చే కాంతి కూడా చాలా అవసరం. ఎప్పుడూ ఇంట్లోనే పండు మక్కినట్లు మక్కితే మంచిది కాదు. కాబట్టి పగలు కొద్దిసేపు ఎండ తగిలించుకోవాలి. పగటి వెలుతురు శరీరాన్ని అలర్ట్ గా ఉంచితే, చీకటి విశ్రాంతిని సూచిస్తుంది. .
సమయాన్ని చూసుకుంటూ ఉండొద్దు
కొందరికి నిద్రరాకపోతే ఇంకా నిద్ర రావడం లేదు, అర్ధరాత్రి దాటింది 12 అయింది, ఒంటిగంట దాటింది ఇంకా నిద్ర రావడం లేదంటూ పదేపదే టైం చూసుకుంటూ ఉంటారు. ఈ అలవాటుని మానుకోవాలి. నిద్రించేటపుడు సమయాన్ని అసలు చూడొద్దు.
మొబైల్ దూరంపెట్టండి
బాగా రాత్రివరకు టీవీ చూడటం, కంప్యూటర్ ముందు కూర్చోవడం, మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ లోపల తలదూర్చేసి గంటల కొద్దీ సోషల్ మీడియాలో గడిపిస్తే నిద్ర అస్సలు రాదు. నిద్రపోయేటపుడు ఎలక్ట్రానిక్స్ వస్తువులన్నీ పూర్తిగా ఆఫ్ చేయాలి, వీలైతే మనకు అందనంత దూరంలో ఉంచుకోవాలి.
కెఫీన్ సంబంధిత పానీయాలకు దూరం
కెఫీన్ సమ్మేళనం ఉండే కాఫీ, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్, చాక్లెట్లను నిద్రించేటపుడు అస్సలు తీసుకోవద్దు. ఇవి తీసుకుంటే నిద్ర గోవిందా. వీటికి బదులుగా పాలు, కొన్ని రకాల హెర్బల్ టీలు తాగితే ఏదైనా ప్రయోజనం ఉండొచ్చు.
చివరగా చెప్పేదేంటంటే, సుఖవంతమైన నిద్రకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. ప్రతిరోజూ కనీసం అర్ధగంటైనా వాకింగ్, వ్యాయామం లాంటివి చేయాలి. రాత్రిపూట పడుకునే ముందు మాత్రం ఎలాంటి వ్యాయామాలు చేయొద్దు. పడకను నిద్రపోవడానికి మాత్రమే ఉపయోగించాలి. బెడ్ పైనే కూర్చుని లాప్‌టాప్‌లో పనిచేసుకోవడం, మొబైల్ చూడడం, చదుకోవడం లాంటివి చేయొద్దు. మధ్యాహ్నం పూట నిద్రపోవడం తగ్గించుకోవాలి, పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందే డిన్నర్ పూర్తి చేయాలి.