తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Spicy Coconut Powder: అన్నం, ఇడ్లీలోకి ఎండు కొబ్బరి మసాలా పొడి ఒక్కసారి చేసుకుంటే నాలుగు నెలలు నిల్వ ఉంటుంది

Spicy Coconut Powder: అన్నం, ఇడ్లీలోకి ఎండు కొబ్బరి మసాలా పొడి ఒక్కసారి చేసుకుంటే నాలుగు నెలలు నిల్వ ఉంటుంది

Haritha Chappa HT Telugu

16 July 2024, 17:30 IST

google News
    • Spicy Coconut Powder: ఇడ్లీ, దోశ వంటి వాటితో ఏదో ఒక పొడిని పెట్టుకొని తింటే ఆ రుచే వేరు. వేడి వేడి అన్నంలో కాస్త పొడి చల్లుకొని నెయ్యి వేసుకొని చల్లి తింటే రుచి అదిరిపోతుంది. ఇక్కడ మేము ఎండు కొబ్బరి మసాలా పొడి రెసిపీ ఇచ్చాను.
ఎండు కొబ్బరి కారం పొడి
ఎండు కొబ్బరి కారం పొడి

ఎండు కొబ్బరి కారం పొడి

Spicy Coconut Powder: తెలుగింటి భోజనాల్లో కూర, పచ్చళ్లతో పాటు కారంపొడులకు కూడా ఎంతో విశిష్టత ఉంది. ఎప్పుడు ఒకేలాంటి పొడులు తినే బదులు కాస్త భిన్నంగా ఈసారి ఎండు కొబ్బరి మసాలా పొడిని ప్రయత్నించండి. ఒక్కసారి చేసుకుంటే ఇది నాలుగు నెలల పాటు తాజాగా ఉంటుంది. ఇడ్లీలు, దోశలు, అన్నంలో కూడా తినవచ్చు. కాస్త స్పైసీగా చేసుకుంటే రుచి అదిరిపోతుంది. దోశలు చేసినప్పుడు పైన ఈ కొబ్బరి పొడిని చల్లుకొని తింటే ఆ రుచే వేరు. ఎండు కొబ్బరి పొడి చేయడం చాలా సులువు. కేవలం అరగంటలో ఇది రెడీ అయిపోతుంది.

ఎండు కొబ్బరి పొడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు

నెయ్యి - ఒక స్పూను

మినప్పప్పు - అర కప్పు

శనగపప్పు - అర కప్పు

ఎండుమిర్చి - ఎనిమిది

కొబ్బరి ముక్కలు - ఒక కప్పు

వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది

ఉప్పు - రుచికి సరిపడా

ఎండు కొబ్బరి మసాలా పొడి రెసిపీ

1. పచ్చి కొబ్బరి కాకుండా దాన్ని ఎండబెట్టి ఎండు కొబ్బరిగా మార్చాక సన్నని ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

3. అందులో మినప్పప్పు, శెనగపప్పు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి.

4. వాటన్నింటినీ తీసి ఒక గిన్నెలో వేసి చల్లబరుచుకోవాలి.

5. ఇప్పుడు అదే కళాయిలో కొబ్బరి ముక్కలను వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.

6. మిక్సీలో వేయించుకున్న పప్పులు, కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

7. గాలి చొరబడని కంటైనర్లో ఈ మొత్తం మిశ్రమాన్ని వేసి ఉంచుకోవాలి.

8. ఇది నాలుగైదు నెలల పాటు తాజాగా ఉంటుంది.

9. దోశెలు, ఇడ్లీల్లోకి అదిరిపోతుంది.

10. వేడివేడి అన్నంలో ఈ ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే రుచి వేయరు.

11. ఒక్కసారి దీన్ని వండి చూడండి. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.

అన్నంలో కలుపుకునేందుకు ఏమీ లేనప్పుడు ఈ ఎండు కొబ్బరి పొడిని కలుపుకొని తినవచ్చు. వేడి వేడి అన్నంలో ఎండు కొబ్బరి పొడి అదిరిపోతుంది. ఇప్పుడు చేయడం కూడా చాలా సులువు. కాబట్టి ముందే చేసి పెట్టుకుంటే సమయానికి అందుకొస్తుంది. ఉదయాన పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టేటప్పుడు సమయం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పనులను చేసి పెట్టుకుంటే ఉత్తమం.

తదుపరి వ్యాసం