Chintakaya Pachadi: చింతకాయలతో ఇలా స్పైసీగా పచ్చడి చేసుకోండి, వేడి వేడి అన్నంలో అదిరిపోతుంది.
26 September 2024, 17:30 IST
- Chintakaya Pachadi: చింతకాయలతో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీన్ని అన్నంలో, ఇడ్లీలో, దోశెలో ఎలా తిన్నా రుచి అదిరిపోతుంది. పచ్చి చింతకాయ పచ్చడి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
స్పైసీ చింతకాయ పచ్చడి రెసిపీ
Chintakaya Pachadi: పుల్లని చింతకాయలతో చేసే స్పైసీ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చింతకాయలు, కొత్తిమీర, పచ్చి మిరపకాయలు కలిపి చేసే ఈ పచ్చడి రుచి మామూలుగా ఉండదు. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
చింతకాయ పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు
పచ్చి చింతకాయలు - అరికిలో
పచ్చి మిర్చి - అయిదు
కొత్తిమీర తరుగు - ఒక కప్పు
జీలకర్ర - ఒక స్పూను
బెల్లం తరుగు - ఒక స్పూను
ఆవాలు - ఒక స్పూను
మినపప్పు - ఒక స్పూను
ఎండుమిరప కాయలు - ఆరు
కరివేపాకులు - గుప్పెడు
పసుపు - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
వెల్లుల్లి రెబ్బలు - గుప్పెడు
పచ్చి చింతకాయ పచ్చడి రెసిపీ
1. పచ్చి చింతకాయలు శుభ్రంగా కడిగవి పైన ఉన్న పెచ్చులను తీసేయాలి.
2. చింతకాయలను ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
3. వీటిని వేయించాల్సిన అవసరం లేదు. పచ్చిగానే గ్రైండ్ చేసుకొని పచ్చడిగా చేసుకోవచ్చు.
4. ఇందుకోసం మిక్సీ జార్లో కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి, పచ్చి చింతకాయలు, జీలకర్ర, బెల్లం, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
5. ఈ మొత్తాన్ని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి.
6. దీనికి తాళింపు పెట్టేందుకు స్టవ్ మీద చిన్న కళాయి పెట్టాలి.
7. అందులో నూనె వేసి జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడించాలి.
8. తర్వాత తరిగిన వెల్లుల్లి రెబ్బలను వేసి వేయించాలి. శనగపప్పు, మినప్పప్పు కూడా వేసి వేయించుకోవాలి.
9. వీటిలోనే ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి.
10. పసుపు కూడా కలపాలి. కరివేపాకులు వేసి గరిటతో కలుపుకోవాలి.
11. ఈ మిశ్రమాన్ని చిన్న మంట మీద ఉంచి ముందుగా రుబ్బి పెట్టుకున్న చట్నీని వేసి బాగా కలుపుకోవాలి.
12. రెండు నిమిషాలు చిన్న మంట మీద ఈ పచ్చడిని ఉంచి కలపాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
13. అంతే టేస్టీ పచ్చి చింతకాయ పచ్చడి రెడీ అయినట్టే.
14. దీని రుచి మామూలుగా ఉండదు. మీకు స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోండి.
15. వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకుని తింటే రుచి అదిరిపోతుంది.
చింతకాయలతో ఉపయోగాలు
చింతకాయలు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో పోషకాలు అందుతాయి. దీనిలో ఆల్ఫా హైడ్రాక్సి యాసిడ్స్ అధికంగా ఉంటాయి. మన చర్మానికి ఇవి చాలా ముఖ్యం. చింతకాయలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే చర్మకాంతి పెరుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా చింతకాయ బెస్ట్ ఎంపిక. కాలేయం ఆరోగ్యాన్ని కాపాడడంలో చింతకాయలోని పోషకాలు ముందుంటాయి. డయాబెటిస్ ఉన్నవారు చింతకాయ పచ్చడిని అప్పుడప్పుడు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. మలేరియా వంటి జ్వరం బారిన పడినవారు కూడా చింతకాయలను తినవచ్చు.