Benne Dosa Recipe। వెన్న ముద్దను కలిపి చేసే బెన్నె దోశ, దీని రుచి ఎంతో ప్రత్యేకం!
28 July 2023, 6:06 IST
- Benne Dosa Recipe: చాలా రకాల వెరైటీ దోశలను మీరు తిని ఉంటారు. కానీ, మీరు బెన్నె దోశను తిని ఉండక పోవచ్చు. ఇక్కడ మీకు బెన్నె దోశ రెసిపీని అందిస్తున్నాము.
Benne Dosa Recipe
Healthy Breakfast Recipes: బ్రేక్‌ఫాస్ట్‌లోకి దోశను ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు. ఈ దోశలలో చాలా వెరైటీలు ఉంటాయి, ఇందులో చాలా రకాల వెరైటీ దోశలను మీరు తిని ఉంటారు. కానీ, మీరు బెన్నె దోశను తిని ఉండక పోవచ్చు. ఇది ఒక ప్రత్యేకమైన దోశ, కర్ణాటకలోని దావంగెరె పట్టణంలో ఈ దోశ చాలా ప్రసిద్ధి. ఇక్కడ మీకు బెన్నె దోశ రెసిపీని అందిస్తున్నాము.
బెన్నె దోశ అంటే వెన్న దోశ అని అర్థం వస్తుంది. అయితే మీరు రెగ్యులర్‌గా తినే బటర్ దోశకు పూర్తిగా విభిన్నం. ఈ బెన్నె దోశ ఆకృతి కూడా ఒక వైపు క్రిస్పీగా, మరొక వైపు మృదువుగా ఉంటుంది. ఈ దోశ పిండిలో మరమరాళ్ళు కూడా కలుపుతారు. సాంప్రదాయకంగా బెన్నె దోశలను కట్టెల పొయ్యిపై చేస్తారు. దీనివల్ల బెన్నె దోశకు ఒక ప్రత్యేకమైన స్మోకీ రుచి వస్తుంది, అలాగే దీనిని చట్నీతో పాటుగా ప్రత్యేకంగా ఆలుగడ్డ పిట్ల కూరతో వడ్డిస్తారు, అందుకే దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. బెన్నె దోశ ఎలా చేయాలో ఈ కింద సూచనలు చదవండి.
Benne Dosa Recipe కోసం కావలసినవి
- 1/2 కప్పు మినపపప్పు
- 2 కప్పుల ఇడ్లీ బియ్యం
- 3 కప్పులు మరమరాళ్లు/ ప్యాలాలు
- 1 టీస్పూన్ ఉప్పు
- 1/4 టీస్పూన్ మెంతులు
- 1/4 కప్పు మైదా (ఐచ్ఛికం)
- దోశలు చేయడానికి వెన్న
బెన్నె దోశ తయారు చేసే విధానం
- ముందుగా మినపపప్పు, ఇడ్లీ బియ్యాన్ని బాగా కడిగి, తగినన్ని నీటిలో వేర్వేరు గిన్నెలలో నానబెట్టండి. కనీసం 4-5 గంటలు లేదా రాత్రంతా నానబెట్టండి. మినపపప్పులో మెంతులు కూడా వేసి నానబెట్టాలి.
- తర్వాత నానబెట్టిన మినపపప్పులో మిగిలిన నీటిని వడకట్టి, ఆపై అందులో ఐస్ వాటర్ పోసి గ్రైండ్ చేయండి. అలాగే నానబెట్టిన బియ్యంలో కూడా నీళ్లు కలిపి మెత్తని పిండిగా రుబ్బుకోవాలి.
- ఇప్పుడు రుబ్బిన మినపపప్పు, బియ్యంను ఒక గిన్నెలో కలిపేసి దోశ బ్యాటర్ చేయాలి.
- మరమరాళ్లను కూడా పిండిగా రుబ్బుకొని, మైదా పిండితో పాటు దోశ బ్యాటర్‌లో కలపండి, ఇందులో ఉప్పు కూడా వేసి, పిండిని 6-8 గంటలు పులియబెట్టండి. అప్పుడు మీకు దోశలు వేసుకునేలా మృదువైన బ్యాటర్ రెడీ అవుతుంది.
- ఇప్పుడు దోశల పెనంను వేడి చేసి వెన్న వేయండి, వేడయ్యాక దోశ పిండి వేసి కాస్త మందంగా ఉండేలా గుండ్రంగా విస్తరించండి. బాగా కాల్చండి, మరోవైపు కూడా తిప్పి, ఓ 30 సెకన్ల పాటు ఉడికించాలి.
అంతే, బెన్నె దోశ రెడీ. ఆలుగడ పిట్ల, కొబ్బరి చట్నీతో వేడివేడిగా వడ్డించండి.
టాపిక్