Happy life: మీ లైంగిక జీవితం సంతోషంగా సాగాలంటే ఈ అలవాటును మానేయండి
24 January 2024, 9:36 IST
- Smoking: భార్యాభర్తలు సంతోషంగా ఉండడానికి లైంగిక జీవితం ఎంతో ముఖ్యం. కొన్ని రకాల అలవాట్లు మీ లైంగిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
ధూమపానంలో నష్టాలు
Smoking: ధూమపానం అనేది పురుషులు, మహిళలు... ఇద్దరి ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ధూమపానం అధికంగా చేసేవారిలో గుండె సంబంధ వ్యాధులతో పాటు వివిధ రకాల క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే అధికంగా ధూమపానం చేసే వారి లైంగిక ఆరోగ్యం పై కూడా దీని ప్రభావం పడుతుంది. భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే వారి మధ్య లైంగిక సంబంధం సవ్యంగా సాగాలి. ఎప్పుడైతే వారి మధ్య లైంగిక సంబంధం దెబ్బతింటుందో వారి అనుబంధం కూడా బలహీనమవుతుంది. ధూమపానం చేసే వారిలో లైంగిక పనితీరు, లిబిడో, సంతానోత్పత్తి సామర్థ్యం అన్నీ తగ్గుతాయి. సిగరెట్ పొగలో అమోనియా, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ సైనైడ్ వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి శరీరంలో చేరి లైంగిక సంబంధిత సమస్యలను కలిగిస్తాయి. మీ లైంగిక ఆరోగ్యం బాగుండాలంటే కచ్చితంగా మీరు ధూమపానాన్ని విడిచి పెట్టాలి. ధూమపానం లైంగిక ఆరోగ్యం పై ఎలాంటి చెడు ప్రభావాలను చూపిస్తుందో తెలుసుకోండి.
అనేక అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ధూమపానం అధికంగా చేసే మగవారిలో అంగస్తంభన ఇబ్బందులు ఉంటాయి. పురుషాంగానికి రక్తం సరఫరాను సిగరెట్లలోని నికోటిన్ అడ్డుకుంటుంది. ఒక అధ్యయనం ప్రకారం ధూమపానం చేయని పురుషులతో పోలిస్తే ధూమపానం చేసే పురుషులలో అంగస్తంభన ప్రమాదం 41 శాతం ఎక్కువగా ఉంటుంది.
స్త్రీలలో...
ధూమపానం పురుషులకే కాదు మహిళలకు కూడా అనారోగ్యగే. ఇది స్త్రీ లైంగిక ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది. ముఖ్యంగా ధూమపానం చేయడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే రొమ్ముల ఆరోగ్యం బలహీనపడుతుంది. రొమ్ము క్యాన్సర్ కుటుంబ చరిత్ర గల మహిళలు కచ్చితంగా ధూమపానానికి దూరంగా ఉండాలి.
సిగరెట్లు అధికంగా కాల్చే మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. దీనివల్ల వారి సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. సిగరెట్ తాగడం వల్ల వీర్యం ఉత్పత్తి, వీర్యకణాల చలన శీలత తగ్గిపోతాయి. దీనివల్ల గర్భం ధరించడం కష్టంగా మారుతుంది.
మహిళల విషయానికి వస్తే పొగాకు వినియోగించే స్త్రీలు కూడా సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటారు. ధూమపానం వల్ల అండాశయంలో అండాల నిల్వ క్షీణిస్తుంది. అండాల సంఖ్య తగ్గిపోతుంది. అలాగే వాటి నాణ్యత తగ్గిపోతుంది. దీనివల్ల పిల్లలు ఆరోగ్యంగా పుట్టే అవకాశం కూడా తగ్గుతుంది. కొన్నిసార్లు గర్భం ధరించడం కష్టతరంగా మారుతుంది.
ప్రీమెచ్యూర్ మెనోపాజ్
ధూమపానం చేసే మహిళల్లో మెనోపాజ్ రావాల్సిన వయసు కంటే ముందుగానే వచ్చేయొచ్చు. దీన్నే ప్రీ మెచ్యూర్ మెనోపాజ్ అంటారు. ధూమపానం చేయని మహిళలతో పోలిస్తే ధూమపానం చేసే మహిళలు 50 ఏళ్ల లోపే మెనోపాజ్‌ను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ధూమపానం మానేయండిలా
లైంగిక ఆరోగ్యం కోసం ధూమపానం మానేయడానికి ప్రయత్నించండి. దీనికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే కొన్ని రోజుల్లో ధూమపానాన్ని వదిలేయవచ్చు. సిగరెట్ తాగాలనిపించినప్పుడల్లా ఒంటరిగా కూర్చోకుండా స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉండండి. నీరు అధికంగా తాగండి. నీరు అధికంగా తాగడం అప్పుడు తాగడం వల్ల సిగరెట్ తాగాలన్న కోరిక తగ్గిపోతుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న సిగరెట్లు, లైటర్లు, యాష్ ట్రేలు కనిపించకుండా పారేయండి. వాటిని చూసినప్పుడు కూడా మీకు ధూమపానం చేయాలన్న కోరిక పెరుగుతుంది. మీ మానసిక స్థితిని మీ నియంత్రణలో ఉంచుకోండి. సిగరెట్ తాగాలని అనిపించినప్పుడల్లా ఒక క్యారెట్ ను తినడం అలవాటు చేసుకోండి. అలాగే క్రంచీగా ఉండే స్నాక్స్ తినడం వల్ల ధూమపానానికి దూరంగా ఉండొచ్చు. ప్రయత్నిస్తే ధూమపానం అలవాటును త్వరగా మానేయొచ్చు.