Bathing Ingredients । మీరు స్నానం చేసే నీటిలో వీటిని కలిపితే అద్భుతమైన ప్రయోజనాలు!
14 June 2023, 10:36 IST
- Natural Bathing Ingredients: స్నానపు నీటిలో కలపడానికి కొన్ని అద్భుతమైన పదార్థాలను చర్మవ్యాధి నిపుణులు సూచించారు, అవి ఈ కింద తెలుసుకోండి.
Bathing Ingredients
Natural Bathing Ingredients: మనం స్నానం చేసేటపుడు సబ్బులు, షవర్ జెల్స్, షాంపూలు ఉపయోగిస్తుంటాం. అయితే స్నానం చేయటానికి సాధారణమైన నీటినే ఉపయోగిస్తాం. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నీటిలో పసుపు, వేపాకులు మొదలైన వాటిని కలపడం తెలిసిందే. ఎందుకంటే ఇవి యాంటీబాక్టీరియా, యాంటీ వైరస్ లక్షణాలను కలిగి ఉంటాయి, అవి రోగాల నుండి కాపాడతాయని మనం నమ్ముతాం. భారతీయ సంప్రదాయాలలో స్నానానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది, స్నానం చేసే నీటిలో వివిధ సహజమైన పదార్థాలను కలపడం పురాతన కాలం నుంచే ఉంది. మరి అలాంటి ప్రయోజనాలు ఉన్నప్పుడు మామూలు నీటితో స్నానం చేయడం ఎందుకు?
మీరు విలాసవంతమైన స్నానం చేయాలని కోరుకుంటే, మీరు మీ స్నానపు నీటిలో కలిపే కొన్ని పదార్థాల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. మీరు స్నానం చేసే నీటిలో వీటిని కలపడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. వీటిని ద్వారకలోని ఆకాష్ హెల్త్‌కేర్ & సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని చర్మవ్యాధి నిపుణురాలు అయిన డాక్టర్ పూజా చోప్రా సూచించారు.
లావెండర్
స్నానపు నీటిలో లావెండర్ కలపడం ద్వారా మీరు మరింత రిలాక్స్‌గా, రిఫ్రెష్‌గా అయినటువంటి అనుభూతిని పొందవచ్చు.లావెండర్ వాసన నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది, కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు ఇది మీ ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది.
స్నానపు నీటిలో ఆరు నుండి ఎనిమిది చుక్కల స్వచ్ఛమైన లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి, బాగా కలపండి. ఇప్పుడు ఈ నీటితో స్నానం చేయండి. అయితే స్నానం చేసేటప్పుడు మీ చర్మాన్ని కఠినంగా రుద్దకండి. అలాగే స్నానం చేసిన వెంటనే మీ చర్మానికి మాయిశ్చరైజేషన్ రాయండి. తద్వారా మీ జుట్టు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
ఓట్‌మీల్
ఓట్‌మీల్‌ను మనం సాధారణంగా ఆహారంగా స్వీకరిస్తాం. కానీ ఓట్స్‌ను మీరు స్నానం చేయడానికి కూడా ఉపయోగించవచ్చునని మీకు తెలుసా? ఓట్‌మీల్‌లో ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు వంటి వివిధ రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ E చర్మాన్ని శుభ్రపరచడం, హైడ్రేట్ చేయడంలో ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. మీ స్నానపు నీటిలో ఓట్స్‌ను కలపడం ద్వారా పొడి చర్మం, దురద, చికాకు మొదలైన అలెర్జీ ప్రతిచర్యలకు పరిష్కారం లభిస్తుంది. మీరు ఓట్‌మీల్ నీటితో స్నానం చేసినప్పుడు, ఇది మీ చర్మంపై ఒక పొరను ఏర్పరుస్తుంది. ఇది చర్మంలోని తేమను నిలిపి ఉంచడానికి, దురద, మంటను తగ్గించడానికి సహాయపడుతుంది.
ఒక కప్పు ఓట్‌మీల్‌ను ఏదైనా మెత్తని పిండిలో కలపండి. అది నీటిని పీల్చుకునేలా ఉండాలి. ఆపై ఈ మిశ్రమాన్ని గోరువెచ్చని నీటి టబ్‌లో వేసి బాగా కలపండి. ఈ నీటిలో కనీసం 15 నిమిషాల పాటు మీ శరీరాన్ని నానబెట్టండి.
ఆపిల్ సైడర్ వెనిగర్
మీరు మీ జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఏదైనా పదార్ధం కోసం చూస్తున్నట్లయితే, ఆపిల్ సైడర్ వెనిగర్ తో స్నానం చేయడానికి ప్రయత్నించండి. మీ స్నానపు నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపినప్పుడు, అది ఒక నిర్విషీకరణ నీటిగా మారుతుంది. దీనిలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు మీ చర్మంపై నుండి అన్ని రకాల హానికర మలినాలను, చెమటను తొలగించడానికి సహాయపడుతుంది. ఈ నీటితో స్నానం చేయడం వలమ అది మీ మొటిమలకు చికిత్స చేస్తుంది, మీ దద్దుర్లతో ఎరుపెక్కిన చర్మాన్ని శుభ్రపరుస్తుంది, శాంతపరుస్తుంది.
ఒక బకెట్ నిండా నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలపండి, ఈ నీటితో స్నానం చేయండి. అలాగే, యాపిల్ సైడర్ వెనిగర్‌ను నీటిలో కరిగించి చంకల కింద రుద్దడం వల్ల దుర్వాసన పోతుంది.
అన్నట్టూ మీకు ఈ విషయం తెలుసా? జూన్ 14 అంటే ఈరోజును అంతర్జాతీయ స్నాన దినోత్సవం (International Bath Day) గా పాటిస్తారు.