Valentine Strawberry Mousse । ఈ మధురమైన ప్రేమకు మరింత తీపిని జోడించండి.. వాలెంటైన్ స్ట్రాబెర్రీ కేక్ ఇదిగో!
02 February 2023, 18:26 IST
- Valentine Strawberry Mousse Recipe: మీ వాలెంటైన్‌పై మీ ప్రేమను కురిపించడానికి ఇక్కడ తియ్యటి స్ట్రాబెర్రీ మూస్ రెసిపీ ఉంది చూడండి.
Valentine Strawberry Mousse Recipe
ఒకరి హృదయానికి మార్గం వారి కడుపు నుంచి ప్రారంభం అవుతుందని చెబుతారు. అంటే మనం ఒకరికి పసందైన భోజనం పెట్టి, వారి ఆకలిని తీర్చి వారిని సంతృప్తి పరిస్తే.. వారి మనసులో మనకు స్థానం ఏర్పడుతుందని అర్థం. మరి ఈ ప్రేమికుల రోజున మీ ప్రియమైన వారి మనసులో మీ స్థానం ఉండాలంటే ఇప్పటికే ఏం చేయాలో మీకు అర్థమై ఉంటుంది. ఇష్టమైన వారికోసం ఎంత కష్టమైన పడాలంటారు, కానీ కష్టం లేకుండా ఇష్టాన్ని గెలుచుకోవాలంటే అది మీరు ఆత్మీయంగా పెట్టే ఆహారంతో సాధ్యపడవచ్చు.
మీ వాలెంటైన్‌పై మీ ప్రేమను కొంత కురిపించడానికి ఇక్కడ మీకు ఒక రెసిపీని పరిచయం చేస్తున్నాం. మీ మధురమైన ప్రేమకు గుర్తుగా మధురమైన రుచిగల స్ట్రాబెర్రీ మూస్ కేక్ తయారు చేయండి. దీనికి హృదయ ఆకృతిని ఇస్తే, నేరుగా మీ హృదయాన్ని ఇచ్చినట్లే ఉంటుంది. మీరే ప్రేమతో సిద్ధం చేస్తే మీ ప్రేమ ఇంకా పండుతుంది. స్ట్రాబెర్రీ మూస్ కేక్ తయారు చేయడం చాలా సులభం. స్ట్రాబెర్రీ మూస్ కేక్ రెసిపీని ఈ కింద చూడండి.
Valentine Strawberry Mousse Recipe కోసం కావలసినవి
- 1 కప్పు స్ట్రాబెర్రీ ప్యూరీ
- 1 టీస్పూన్ వెనీలా ఎసెన్స్
- 1 కప్పు హెవీ క్రీమ్
- 3 టేబుల్ స్పూన్లు చక్కెర పౌడర్
- 5 స్ట్రాబెర్రీ గార్నిషింగ్ కోసం
వాలెంటైన్ స్ట్రాబెర్రీ మూస్ కేక్ తయారీ విధానం
- ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో హెవీ క్రీమ్ వేయండి, ఆపై ఎలక్ట్రిక్ బీటర్‌ని ఉపయోగించి సుమారు 2-3 నిమిషాల పాటు క్రీమ్‌ను గిలక్కొట్టండి, నురుగుగా మారేలా చూసుకోండి.
- ఇప్పుడు క్రీమ్‌లో వెనీలా ఎసెన్స్‌ను కలపండి, ఆపైన చక్కెర పౌడర్ ను వేసి అన్ని పదార్థాలు బాగా కలిసిపోయేలా మరో నిమిషం పాటు గిలక్కొట్టండి.
- తర్వాత క్రీమ్ మిశ్రమంలో స్ట్రాబెర్రీ ప్యూరీని వేసి గరిటెతో కలపండి. మీ దగ్గర స్ట్రాబెర్రీ ప్యూరీ లేకపోతే, స్ట్రాబెర్రీలను బ్లెండ్ చేసి, ప్యూరీ లాగా వడకట్టండి.
- ఇప్పుడు హృదయాకార పాత్రలో, సిద్ధం చేసిన మిశ్రమంను నింపండి. ఒక గంట పాటు ఫ్రిజ్‌లో ఉంచండి.
- ఫ్రీజింగ్ తర్వాత దగ్గరగా గడ్డకట్టిన మూస్ కేకును బయటకు తీసి స్ట్రాబెర్రీలతో అలంకరించండి.
అంతే, వాలెంటైన్ స్ట్రాబెర్రీ మూస్ కేక్ రెడీ. ప్రేమతో మీ ప్రియమైన వారికి తినిపించండి, ప్రేమను పంచండి. తియ్యని వేడుక చేసుకోండి.